Sunitha Laxma Reddy | స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సంగారెడ్డిలో సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు అబద్ధాలతో కూడుకున్నవని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి విమర్శించారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రజాధనంతో సభలు నిర్వహించి కేసీఆర్, హరీశ్‌రావుపై వ్యక్తిగత విమర్శలు చేయడం తప్ప రాష్ట్రానికి ఉపయోగపడే ఒక్క అంశాన్నీ సీఎం ప్రస్తావించలేదన్నారు.
కేసీఆర్ ‘అపర భగీరథుడి’లా ఇంటింటికీ తాగునీరు అందించారని తెలిపారు. మిషన్ భగీరథను నిర్వీర్యం చేసిన ఘనత రేవంత్‌రెడ్డిదేనని ఆరోపించారు. రేవంత్‌రెడ్డికి రాష్ట్ర అభివృద్ధిపై ఎలాంటి విధానం లేదని, బూతులు మాట్లాడటం తప్ప ప్రజలకు ఉపయోగపడే పని చేయడం లేదని విమర్శించారు.
రేషన్ కార్డుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోందని సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 6.47 లక్షల రేషన్ కార్డులు ఇచ్చినట్లు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి శాసనమండలిలోనే చెప్పారని గుర్తుచేశారు. రేషన్ కార్డులపై సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్‌ల ఫొటోలు ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. సన్నబియ్యం పంపిణీ కాంగ్రెస్ ఘనత కాదని.. సన్నబియ్యానికి బ్రాండ్ అంబాసిడర్ కేసీఆర్ అని పేర్కొన్నారు. కేసీఆర్ ప్రభుత్వమే సన్నబియ్యం పంపిణీని ప్రారంభించిందన్నారు.
వ్యవసాయానికి 12 గంటల కరెంటు కూడా ఇవ్వడం లేదని అధికారులే చెబుతున్నారని సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. రైతులను కంటిమీద కునుకు లేకుండా ఇబ్బంది పెడుతూ వ్యవసాయాన్ని పండుగ చేశామని ప్రభుత్వం చెప్పుకోవడం హాస్యాస్పదమన్నారు. రైతు రుణమాఫీని హామీ ఇచ్చిన విధంగా అమలు చేయలేదని, కేసీఆర్ రెండేళ్లలో ఇచ్చిన రైతుబంధు కంటే రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన రైతుభరోసా నిధులే తక్కువగా ఉన్నాయని విమర్శించారు. బోనస్‌ను బోగస్‌గా మార్చి గొప్పలు చెప్పుకుంటున్నారని, యూరియా యాప్‌తో రైతుల కష్టాలు మరింత పెరిగాయని అన్నారు.
నిరుద్యోగ యువతను సీఎం మోసం చేశారని సునీతా లక్ష్మారెడ్డి ఆరోపించారు. 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ? నిరుద్యోగ భృతి ఏమైంది? రాజీవ్ యువ వికాసం పరిస్థితి ఏంటి? అని ప్రశ్నించారు. తమ హక్కుల కోసం ప్రశ్నిస్తున్న నిరుద్యోగులను నిర్బంధిస్తున్నారని విమర్శించారు.
స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఇచ్చిన హామీలను కూడా సీఎం నిలబెట్టుకోలేదన్నారు. సిగాచి పరిశ్రమలో మృతిచెందిన కార్మికుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం ఇస్తామని చెప్పి ఆ హామీని కూడా అమలు చేయలేదని విమర్శించారు.
సంగారెడ్డికి వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి వ్యక్తిగత విమర్శలు చేసి వెళ్లారే తప్ప జిల్లాకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదని సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. సింగూరును ఎండబెట్టిన ఘనత రేవంత్‌రెడ్డిదేనని ఆరోపించారు. కల్యాణలక్ష్మి పథకాన్ని ఎత్తివేసే కుట్ర జరుగుతోందని విమర్శించారు.
హరీశ్‌రావుపై సీఎం రేవంత్‌రెడ్డి క్షుద్ర పూజల ఆరోపణలు చేయడాన్ని సునీతా లక్ష్మారెడ్డి తప్పుబట్టారు. నవీన యుగంలో సీఎం రాతియుగంలో ఉన్నట్లు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. క్షుద్ర పూజలు చేసిన వారెవరైనా సీఎం అయ్యారా? అని ప్రశ్నించారు. సీఎం హోదాలో ఉండి ఇలాంటి మాటలు మాట్లాడటంపై ప్రజలు చర్చించుకుంటున్నారని అన్నారు.
రేవంత్‌రెడ్డి ఇలాగే మాట్లాడితే మెదక్ జిల్లాలో కాంగ్రెస్‌కు వచ్చిన మూడు సీట్లు కూడా వచ్చే ఎన్నికల్లో రావని వ్యాఖ్యానించారు. ప్రజల తరఫున ప్రశ్నిస్తున్న హరీశ్‌రావు, కేటీఆర్‌పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.