హనుమకొండ, అక్టోబరు 11(నమస్తే తెలంగాణ ప్రతినిధి): స్థానిక సంస్థల రిజర్వేషన్లపై వెనుకబడిన వర్గాలను మోసం చేసేలా కాంగ్రెస్ ప్రభుత్వ నిర్వాకం ఉండడంతో గ్రామాల్లో అంతా అయోమయం నెలకొన్నది. జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేయడం, హైకోర్టు విచారణకు ఒక్క రోజు ముందు నోటిఫికేషన్ జారీ చేయడం అంతా ఉత్తుత్తి హడావుడి అని తేలిపోయింది. ఎన్నికలు నిర్వహించవద్దనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చేసిన హడావుడికి హైకోర్టు ఆదేశాలతో బ్రేక్ పడింది. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియను మొదలుపెట్టిన తర్వాత నోటిపికేషన్ నిలిచిపోగా, సర్పంచ్ ఎన్నికల ఊసే లేకుండా పోయింది.
కాంగ్రెస్ సర్కారు తీరు, హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో గ్రామీణ స్థానిక సంస్థలు ఎప్పుడు అయ్యేది తెలియడంలేదు. వారం రోజులు ప్రభుత్వం చేసిన హడావుడితో గ్రామాల్లో కొందరు ఎన్నికలు వస్తాయని ఉత్సాహం చూపారు. రిజర్వేషన్లు అనుకూలించిన వారు హడావుడి చేసి ఖర్చు చేశారు. ఎన్నికల ప్రక్రియ ఆగిపోవడంతో ఇప్పుడు ఏం చేయాలో తోచనిస్థితిలో ఉన్నారు. వారం రోజులపాటు చేసిన ఖర్చు నీళ్లలో పోసినట్లయ్యింది. ఎన్నికలు మళ్లీ ఎప్పుడు అవుతాయో, ఏ రిజర్వేషన్లు వస్తాయో అనే ఆందోళన సర్వత్రా నెలకొన్నది. ఎన్నికల నోటిఫికేషన్ నిలువదని తెలిసీ కాంగ్రెస్ ప్రభుత్వం హడావుడి చేసిందని అన్ని పార్టీల నేతలు వాపోతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ప్రక్రియను ఓ నవ్వులాటగా మార్చిందని కాంగ్రెస్ నాయకులే వ్యాఖ్యానిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వ హడావుడిని ప్రతిపక్షాల నేతలు ఎవరూ నమ్మలేదని, తామే ఆగమయ్యామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దసరా ముందు ఎన్నికల ప్రక్రియ మొదలవడంతో పోటీ చేసే ఆలోచనతో ఖర్చు పెట్టామని, ఇప్పుడు తమ భవిష్యత్ ఏమిటో అర్థం కావడంలేదంటున్నారు.
స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసేలా కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నరేండ్లుగా ఎన్నికలు నిర్వహించడంలేదు. పాలకవర్గాలు లేక గ్రామాల్లో అభివృద్ధి పూర్తిగా ఆగిపోయింది. పారిశుధ్య నిర్వహణ కనీస స్థాయిలో ఉండడంలేదు. నిధులు లేక ప్రత్యేక అధికారులు ఏమీ చేయలేని పరిస్థితి నెలకొన్నది. అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొన్నది. దాదాపు రెండున్నరేండ్ల తర్వాత ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తుత్తి ఏర్పాట్లు చేసింది. బీసీ వర్గాలకు 42 శాతం రిజర్వేషన్లు అని ప్రకటించి.. అమలు చేసేలా కాకుండా ప్రకటనల్లో చెప్పుకునేలా వ్యవహరించింది. బీసీ కోటాను పెంచే విషయంలో శాస్త్రీయంగా వ్యవహరించలేదు.
హైకోర్టు ఆదేశాలతో ఇప్పుడు ఎన్నికల ప్రక్రియ మొత్తం నిలిచింది. ప్రస్తుతం పల్లెల్లో హడావుడి అంతా తగ్గి నిశ్శబ్ద వాతావరణం ఆవహించింది. స్థానిక ఎన్నికలు నిలిచి పోవడంతో గ్రామాల్లో పరిస్థితి మరింత దయనీయంగా మారే ప్రమాదం నెలకొన్నది. రెండున్నరేండ్లుగా ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతుండడంతో ప్రభుత్వ పరంగా నిధులు రావడంలేదు. చేసిన ఖర్చులకు ప్రభుత్వం బిల్లులు చెల్లించడంలేదు. ఇప్పట్లో ఎన్నికలయ్యే అవకాశం లేకపోవడంతో ప్రత్యేక అధికారుల్లోనూ నైరాశ్యం నెలకొన్నది. రెండున్నరేండ్లుగా సొంత డబ్బులు ఖర్చు చేశామని, ఇంకా చేయాలంటే తమ వల్ల కావడంలేదని అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వ తీరుతోనే గ్రామాల్లో ఇప్పుడు ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయని చెబుతున్నారు.
దేవరుప్పుల : రాజ్యాంగ పరమైన అవాంతరాలుంటాయని తెలిసీ కాంగ్రెస్ పార్టీ జీవో 9పై రక్తి కట్టించే డ్రామా నడిపింది. ఇచ్చిన హామీలను అమలు చేయక, ప్రజలను ఎన్నికల్లో ఓట్లడిగే ధైర్యం లేక రిజర్వేషన్ల పేరిట బీసీల గొంతు కోసింది. 42 శాతం బీసీ రిజర్వేషన్‌ను సొంత వ్యవహారంగా కాంగ్రెస్ నడిపి తగిన మూల్యం చెల్లించుకుంది. స్ధానిక సంస్ధల గడువు ముగియడంతో కేంద్ర నిధులు రాక గ్రామాల్లో పాలన అటకెక్కింది. ఈ క్రమంలో రాజకీయ పబ్బం గడుపుకునేందుకు కాంగ్రెస్ సర్కార్ బీసీ డ్రామాలాడుతున్నది. ఈ అపవాదునంతా ప్రతిపక్ష పార్టీల మీద నెట్టేందుకు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం చేస్తున్న కుటిల రాజకీయాలను బీసీలు నమ్మే పరిస్థితి లేదు. పార్లమెంటులో చట్టం ద్వారానే రిజర్వేషన్లు సాధ్యమనే విషయం బీసీలు గమనించాలి. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు క్షమాపణ చెప్పాలి.
– అల్లం ప్రదీప్‌రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా నాయకుడు
బయ్యారం : రాష్ట్ర ప్రభుత్వం విఫల వాదనల వల్లే స్థానిక ఎన్నికలపై కోర్టు తీర్పు బీసీ ప్రజలను నిరాశపరిచింది. కాంగ్రెస్ సర్కార్‌ది ప్రచారార్భాటం తప్ప వేరే ఏమీ లేదని మరోసారి రుజువైంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కోసం ఢిల్లీలో కొట్లాడాల్సిన ప్రభుత్వం గల్లీలో కొట్లాడుతూ బీసీలను మభ్యపెట్టింది. బీసీలు ఇకనైనా మేలొని ప్రభుత్వ విధానాలను ఎండగట్టాలి. రిజర్వేషన్ల కోసం బీసీలంతా ఐక్యంగా రాజీలేని పోరాటం చేయాలి. కాంగ్రెస్‌కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే 42 శాతం రిజర్వేషన్‌పై పార్లమెంటులో చట్టం చేయించి తొమ్మిదో షెడ్యూల్లో చేర్పించాలి.
– గౌని భాసర్, బీసీ జనసభ రాష్ట్ర అధికార ప్రతినిధి
కురవి : బీసీ కులాలను కాంగ్రెస్ పార్టీ ఆ రు దశాబ్ధాలుగా మో సం చేస్తున్నది. ఈసారి కూడా రిజర్వేషన్ పేరి ట మోసపోయారు. జీ వో నిలబడదని తెలిసీ ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చి బీసీలను కాంగ్రెస్ ప్రభుత్వం వంచించింది. కాంగ్రెస్, బీజీపీలు బీసీలను రాజకీయంగా ఎదగకుండా కుట్ర పన్నాయి. కేవలం ఓట్ల కోసమే ఏండ్లుగా వాడుకుంటున్నాయి. ఇప్పటికే గ్రామాల్లో పరిస్థితి అధ్వానంగా మారింది. 20 నెలలుగా పాలన అస్తవ్యస్తంగా తయారైంది. పారిశుధ్యం లేక పల్లెలు విషజ్వరాలతో మూలుగుతున్నాయి. ఈ సమయంలో ఎన్నికలు నిర్వహిస్తే ఓట్లు పడవని కాంగ్రెస్ పార్టీనే బీసీలను మోసం చేసి ఎన్నికలను వాయిదా వేసింది.
-బాదె నాగయ్య, బీఆర్ఎస్ బీసీ నాయకుడు
హనుమకొండ : బీసీలు రాజ్యాధికార స్థానంలోకి వస్తారనే అగ్రవర్ణాలు 42 శాతం రిజర్వేషన్‌కు అడ్డుపడుతున్నారు. బీసీలంతా ఏకమై రిజర్వేషన్ల కోసం మరింత ఉధృతంగా ఉద్యమిస్తాం. ఇంకా అగ్రవర్ణాల పాలన వద్దు. ఇక ముందు బీసీల పాలన కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. అన్ని రాజకీయ పార్టీలు బీసీల పక్షాన ఉంటాయా? వ్యతిరేకుల పక్షానా ఉంటాయో ఆలోచించుకోవాలి. తమిళనాడులో బీసీ రిజర్వేషన్లు సాధ్యమైనప్పుడు తెలంగాణలో ఎందుకు కాదు? రిజర్వేషన్లపై ఒకరినొకరు నిందించుకునే పార్టీల నేతలను బీసీ వ్యతిరేకవాదులుగా భావించాల్సి వస్తుంది. బీసీలకు మద్దతు తెలిపే పార్టీలు మాత్రమే తెలంగాణలో నిలబడతాయి.
– సుందర్రాజు యాదవ్, కుడా మాజీ చైర్మన్