వరంగల్ నగరానికి ముఖద్వారంగా ఉన్న కాజీపేటలో నిర్మిస్తున్న ఫాతిమా సమాంతర బ్రిడ్జి పూర్త య్యేదెప్పుడనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ రోడ్డు మీదుగా వాహనాల రద్దీ రోజురోజుకూ విపరీతంగా పెరుగుతున్నది. వంతెన పనులకు అడుగుపడి ఐదేళ్లు గడస్తున్నా నత్తనడకన సాగుతున్నాయి. ఒక ఆర్క్కే ఏడాది పట్టగా, మరోటి ఎప్పుడు పూర్తవుతుందని, తమ ట్రాఫిక్ సమస్యలు ఎప్పుడు తీరుతాయోనని త్రినగరివాసులు ఎదురుచూస్తున్నారు. త్వరగా పనులు పూర్తి చేసి అందుబాటలోకి తీసుకురావాలని కోరుతున్నారు.
కాజీపేట, సెప్టెంబర్ 10 : కాజీపేట ఫాతిమా బ్రిడ్జితో నగర ప్రజలు ఎదుర్కొంటున్న ట్రాఫిక్ సమస్యలను చూసి చలించిన మాజీ సీఎం కేసీఆర్ సమాంతర బ్రిడ్జికి శంకుస్థాపన చేసి రూ. 78 కోట్ల నిధులు విడుదల చేశారు. రెండేళ్ల కు పైగా జాప్యంతో 2020 మేలో పనులకు మోక్షం క లిగింది. షెడ్యూల్డ్ ప్రకారం 2021 డిసెంబర్ నాటికి బ్రిడ్జి పూర్తి కావాల్సి ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం కోల్పోయే నాటికి దాదాపు 60 శాతం పనులు జరుగగా, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పనులు వేగంగా ముందుకు సాగడం లే దనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
బ్రిడ్జి నిర్మాణానికి రైలు పట్టాల మీదుగా అమర్చే రెండు ఇనుప ఆర్క్ గర్డర్లు గతేడాది ఆగస్టులో ఛత్తీస్గఢ్ నుంచి రా గా,ఒక ఆర్క్ నిర్మాణం చివరి దశకు చేరుకుంది. రెండో ఆర్క్ నిర్మాణ పనులు ఇప్పుడే ప్రారంభమయ్యాయి. ఇవి పూర్తయి రైలు పట్టాలపైకి ఎక్కేందుకు, ఫాతిమా బ్రిడ్జి అందుబాటులోకి రావడానికి మరో ఏడాది పట్టేటట్లుంది. పనుల్లో మరింత వేగం పెంచాల్సిన అవసరం ఉందని, త్వరగా పూర్తి చేసి ట్రాఫిక్ సమస్య నుంచి కాపాడాలని నగరవాసులు కోరుతున్నారు.
పాలకుల నిర్లక్ష్యం..
దాదాపు ఐదు దశాబ్దాల క్రితం అప్పటి జనాభాకు అనుగుణంగా ఏర్పాటు చేసిన ఫాతిమా బ్రిడ్జి, ఇరుకుగా మారిపోయింది. బ్రిడ్జిపై ఏదైనా వాహనం మొరాయిస్తే ఇరువైపులా కిలోమీటర్ల పొడవునా ట్రాఫిక్ స్తంభించిపోతున్నది. దాదాపు ఐదేళ్ల క్రితమే బ్రిడ్జి పనులు ప్రారంభమైనప్పటికీ పాలకుల నిర్ల క్ష్యం, అధికార యంత్రాంగం పట్టింపులేని కారణంగా నిర్మాణంలో జాప్యం జరుగుతున్నది. త్వరితగతిన బ్రిడ్జి పనులు పూర్తి చేస్తామని పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ప్రకటించినప్పటికీ పనులు నత్తనడకన నడుస్తున్నాయే తప్ప, ఇంకా చివరి దశకు చేరుకోలేదు. త్వరగా బ్రిడ్జి పనులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకరావాలని ప్రజలు కోరుతున్నారు.