వరంగల్, మార్చి20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఆశలు గల్లంతయ్యాయి. రాష్ట్ర బడ్జెట్ మీద వరంగల్ ఉమ్మడి జిల్లా పెట్టుకున్న ఆశలు.. పెండింగ్ ప్రాజెక్టులు గాల్లో మేడలుగా పటాపంచలయ్యాయి. పిలిస్తే పలికే ముఖ్యమంత్రి… ఎంత అడిగితే అంత ఇస్తాడు. ఈసారి బడ్జెట్ చూసుకోండి.. జిల్లా ఎగిరి గంతేయాలి. లెక్కబెట్టలేక చేతులే నొప్పి పెట్టాలి.. అన్నంతలా మాట్లాడిన నేతలకు శుక్రవారం రాష్ట్ర అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రసంగం చూసిన తర్వాత నోటి మాటరాని పరిస్థితి ఎదురైంది.
గత నెల 22న దేవాదుల ప్రాజెక్టును సందర్శించి ప్రాజెక్టు పూర్తికి డెడ్‌లైన్ విధించి, నిధులెన్ని కావాల్నో చెప్పండి.. ఇచ్చిపారేస్తామన్నట్టుగా మాట్లాడిన సీఎం మాటకే బడ్జెట్లో దిక్కులేకుండాపోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. దేవాదుల ప్రాజెక్టు పూర్తి కావడానికి రూ.18,500 కోట్ల నిధులు కావాలని అధికారులు చెప్తే, ఈ సారి బడ్జెట్లో వాటిని విడుదల చేస్తామని హామీ ఇచ్చి తీరా దేవాదులకు చేసిన కేటాయింపులు అన్ని పద్దులు కలిపి రూ.1566 కోట్లు.
అన్ని పద్దులు కలిపి ఒక్క దేవాదులకే సర్కార్ అంతమొత్తం కేటాయించడం అంటే మాటలు కాదు కదా! ఆ మొత్తంలో భూసేకరణ, పెండింగ్ పనుల పూర్తి, నిర్వహణ వంటి అనేకానేక కాంపోనెంట్స్ కింద అదీ ఒక్క ఉమ్మడి వరంగల్ జిల్లాకు మాత్రమే కాకుండా దేవాదుల ప్రాజెక్టు ప్రాయోజిత జిల్లాలకు పంపిణీ చేయాల్సి ఉంటుందనే విషయాన్ని సర్కార్ నర్మగర్భంగా వివిధ పద్దుల కింద సెలవు ఇచ్చింది. దేవాదుల పద్దు కింద కేటాయించిన ఆ ఒక్క కేటాయింపు తప్ప చెప్పుకోవడానికి మరో పద్దు ఉంటే ఒట్టు అన్నట్టే భట్టి బడ్జెట్ ఉందనే విమర్శలున్నాయి.
చైతన్యం అంటే వరంగల్దే. పోరుఖిల్లా, ఉద్యమాల గడ్డ వంటి పడికట్టు పదాలతో వరంగల్ చైతన్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. తెలంగాణ ఉద్యమానికి నాభీకేంద్రంగా ఉన్న వరంగల్ జిల్లా భావోద్వేగాన్ని సొమ్ము చేసుకోవడం మినహా రేవంత్ సర్కార్ చేసింది ఏమీలేదని శుక్రవారం అసెంబ్లీ వేదికగా ఉన్నత విద్యకు చేసిన కేటాయింపులే సాక్ష్యమని మేధావి వర్గం విమర్శిస్తున్నది. సందర్భం వచ్చిన ప్రతిసారి సీఎం రేవంత్‌రెడ్డి సహా మంత్రులందరూ ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాల కీర్తిని ఆకాశానికి ఎత్తుతూనే ఉన్నారు. కానీ, బడ్జెట్ కేటాయింపుల్లో కాకతీయను యూనివర్సిటీని పాతాళంలోకి తొక్కిపడేశారని వర్సిటీ వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.
ఉస్మానియా వర్సిటీకి రూ.1000 కోట్లు, చాకలి ఐలమ్మ మహిళా వర్సిటీకి రూ.400 కోట్లు కేటాయించినప్పుడు కాకతీయ యూనివర్సిటీకి కనీసం ఓ రూ. 100కోట్లు అయినా కేటాయించడానికి కాంగ్రెస్ సర్కార్‌కు ‘చేయి’ రాలేదా? అని పరిశోధక విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ వర్సిటీలకు ఇవ్వాల్సిందే.. అదే సమయంలో తమ వర్సిటీకి కూడా ఇవ్వాలి కదా! అని, కాంగ్రెస్ పార్టీకి కాకతీయ యూనివర్సిటీ చేసిన పాపం ఏంది? అని ప్రశ్నిస్తున్నారు. కాకతీయ వర్సిటీకి రూ. 40 కోట్లు, కాళోజీ హెల్త్ వర్సిటీకి రూ. 60 కోట్లు రెండు వర్సిటీలకు కలిపి రూ. 100 కోట్లా? ఆ కేటాయింపులు సిబ్బంది జీతభత్యాల కోసం కాక పరిశోధనకు, మౌలిక సదుపాయాల విస్తరణకు ఏది? అని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పాలక మండలి గడువు వచ్చే మే 7తో ముగుస్తుంది. హైదరాబాద్ తర్వాత అతిపెద్ద మహానగరం అని ఊదరగొట్టే సర్కార్ ఆ స్థాయిలో కాకపోయినా అందులో కనీసం 50వ వంతు అయినా మన వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌కు కేటాయింపులు ఉంటాయని ఆశించిన వారికి ఆశాభంగమే ఎదురైందని స్వయానా కాంగ్రెస్ నేతలే వాపోతున్నారు. మంచిర్యాల, మహబూబ్‌నగర్, కొత్తగూడెం, పాల్వంచ మున్సిపల్ కార్పొరేషన్లకు ప్రభుత్వం రూ.1000కోట్లు ప్రత్యేకంగా కేటాయించింది కానీ, వరంగల్ కార్పొరేషన్ కేటాయించేందుకు మాత్రం చేతులు రాలేదని విమర్శలు వినిపిస్తున్నాయి.
వరంగల్ చౌరస్తా, మార్చి 20: కాంగ్రెస్ ప్రభుత్వం వరంగల్‌కు మళ్లీ మొండి చెయ్యి ఇచ్చింది. వరంగల్‌లో ఇటీవల ముఖ్యమంత్రి, మంత్రుల పర్యటనలో కీలక ప్రాజెక్టులకు సంబంధించి కోట్ల రూపాయల హామీలు ఇచ్చినా ఈ బడ్జెట్లో మాత్రం ఒక్క రూపాయి కేటాయింపులు లేవు. దీనిని పరిశీలిస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి వరంగల్ నగర అభివృద్ధిపై ఉన్న చిత్తశుద్ధి ప్రజలకు కనిపిస్తుంది. తెలంగాణకే తలమానికంగా వరంగల్‌లో నిర్మిస్తున్న మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా రోడ్డు రవాణాలో కీలకంగా వ్యవహరించే ఆర్టీసీ మోడల్ బస్టాండ్‌కు, ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న మామునూరు ఎయిర్‌పోర్టులో మౌలిక వసతులకు నిధులు కేటాయింపు లేదు.
2025-26 బడ్జెట్లో వరంగల్‌ను ఎలా వెనక్కి నెట్టారో, ఇప్పటి 2026-27 బడ్జెట్లో సైతం అదే తీరును కొనసాగించి, మొండి చెయ్యిని వరంగల్ వాసులకు ఇచ్చారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 5,257 కోట్ల వ్యయంతో చేపట్టనున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ప్రాజెక్టుకు లైన్ ఐటమ్‌గా ఒక్క రూపాయి కేటాయించకపోవడం విడ్డూరం. దీనిపై స్పష్టత లేకపోవడంతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ప్రాజెక్ట్ ప్రకటనల కోసమేనా అనే సందేహాలు కలుగుతున్నాయి.
– నన్నపునేని నరేందర్, వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే
నర్సంపేట, మార్చి 20 : వాస్తవ పరిస్థితులకు భిన్నంగా కాంగ్రెస్ సర్కారు బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ చిత్తశుద్ధిలేని, పచ్చి అబద్ధాల కూర్పుగా ఉంది. రాజీవ్ యువ వికాసం పేరుతో రాష్ట్ర నిరుద్యోగ యువతను సర్కారు మోసం చేసింది. ఇందిరమ్మ ఆత్మీ య భరోసా పథకాన్ని బడ్జెట్లో ప్రస్తావిస్తున్నారే తప్ప కనీసం అమలుకు నోచుకోవడం లేదు. వ్యవసాయ కూలీలకు బడ్జెట్లో ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. గత రెండు బడ్జెట్లలో ప్రవేశపెట్టిన అంశాలనే మళ్లీ ప్రస్తావించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా సాగునీటి ప్రాజెక్టులైన దేవాదులకు ఈ బడ్జెట్లో నిధుల కేటాయింపు లేకపోవడం దారుణం. వ్యవసాయ రంగానికి ప్రోత్సాహం లేని బడ్జెట్ ఇది. రైతులు, వ్యవసాయ కూలీలు, కార్మికులను సర్కారు మోసం చేసింది. సన్నవడ్లకు బోనస్ ప్రస్తావన లేదు. ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధిని ఈ బడ్జెట్ నిరాశ పర్చింది. ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రజాప్రతినిధులు దీనిపై ఆత్మ పరిశీలన చేసుకోవాలి.
– పెద్ది సుదర్శన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, నర్సంపేట
హనుమకొండ : రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టివిక్రమార్క శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ వట్టి బడ్జెట్.. అది లొట్టపీసు బడ్జెట్. ఇది బడాయి బడ్జెట్, బోగస్ బడ్జెట్. బుకాయింపుల బడ్జెట్, భ్రమల బడ్జెట్. రాష్ట్ర బడ్జెట్లో విజన్ లేదు. విషయం లేదు. క్లారిటీ లేదు. కమిట్మెంట్ లేదు. సరుకు లేదు, సురుకు లేదు. ఈ బడ్జెట్‌కి రేవు లేదు, తావు లేదు. రీతి లేదు, రివాజు లేదు. ఈ బడ్జెట్ సామాన్య ప్రజలు, పెట్టుబడిదార్లకు, మారెట్కి విశ్వాసం కల్పించడంలో ఘోరంగా ఫెయిల్ అయింది. ఓటు వేసిన వాళ్లకు వెన్నుపోటు పొడిచారు. ఆరు గ్యారెంటీలకు మంగళం పాడారు. డిక్లరేషన్లకు నీళ్లు వదిలారు.
జాబ్ లేనివారి పట్ల జాలి కూడా లేదని ప్రకటించిన బడ్జెట్ ఇది. యువత బతుకుదెరువుకు సమాధి కడుతూ భవిష్యత్తును శాశ్వతంగా దెబ్బతీసే బడ్జెట్. పాత గోడకు కొత్తగా రంగు వేసినట్టు బ్రేక్‌ఫాస్ట్ లాంటి అనేక పథకాలకు పేర్లు మార్చి మేము కొత్తగా ప్రవేశపెడుతున్నట్లు గొప్పలు చెప్పారు. దోపిడీకి దారులు వేసే విధంగా హైదరాబాద్‌ను మూడు ముకలు చేసి ఏదో ఘనకార్యం చేసినట్టు చెప్పుకుంటున్నారు. దీనిపై ఇగ ప్రజలే కథానాయకులు కావాలి. ప్రజలు పోరాటం చేస్తే తప్ప ఈ ప్రభుత్వం మేలొనేలా లేదు. ఈ బడ్జెట్లో ఆరు గ్యారెంటీల ఊసే లేదు. పింఛన్ల పెంపు ప్రస్తావన లేదు. బడ్జెట్ కేటాయింపుల్లో కాకతీయ యూనివర్సిటీని పట్టించుకోలేదు. ఉస్మానియా యూనివర్సిటీకి రూ. వెయ్యి కోట్లు, చాకలి ఐలమ్మ యూనివర్సిటీకి రూ.400 కోట్లు కేటాయించినప్పుడు కేయూకు కనీసం రూ.వంద కోట్లు కేటాయించరా.
-బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్‌రెడ్డి
హనుమకొండ చౌరస్తా, : తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి మొండి చెయ్యి చూపింది. రూ.3,24,234 కోట్ల బడ్జెట్లో విద్యారంగానికి కేటాయించింది కేవలం రూ.26,674 కోట్లు మాత్రమే. 2026-27 ఆర్ధిక సంఘం కేటాయింపుల్లో విద్యారంగానికి బడ్జెట్లో కేటాయించిన నిధులు 8.22 శాతం మాత్రమే. 2025-26 ఆర్థిక సంఘంలో 7.6 శాతం కేటాయించగా ఈసారి కేటాయింపులు కేవలం 8.22 శాతం మాత్రమే ఈ రెండు బడ్జెట్లలో వ్యత్యాసం 0.6 శాతం మాత్రమే. కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మ్యానిఫెస్టోలో విద్యారంగానికి 15 శాతం నిధులు కేటాయిస్తామనే ప్రతిపాదనకు మళ్లీ వెన్నుపోటు పొడిచింది. ఈ బడ్జెట్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం.
-గడ్డం నాగార్జున, ఏఐఎఫ్డీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
ములుగు జిల్లాలో నాడు బీఆర్ఎస్ హయాంలోనే జాకారం వద్ద గిరిజన యూనివర్సిటీని నెలకొల్పేందుకు భూమి కేటాయించడం, తరగతులు ప్రారంభం కావడం తెలిసిందే. అయితే, బడ్జెట్లో సర్కార్ ‘ములుగు జిల్లాలో సమ్మక-సారలమ్మ సెంట్రల్ యూనివర్సిటీ స్థాపన, వివిధ గిరిజన వర్గాల అభివృద్ధి కోసం మూడుప్రత్యేక కార్పొరేషన్ల ఏర్పాటు, జీసీసీ, గిరి బ్రాండ్ ఉత్పత్తుల ప్రోత్సాహం, గిరిజన గ్రామాల్లో ఆదివాసీ సేవా కేంద్రాల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం’ అని ప్రకటించింది. నిజానికి గిరిజన సహకార సంస్థ ఆధ్వర్యంలో ఎప్పుటి నుంచో గిరి బ్రాండ్ ఉత్పత్తులు మార్కెట్లోకి వచ్చాయి. కాకపోతే మూడు అవుట్లెట్లను ఏర్పాటు చేసే అంశాన్ని కూడా అంతగొప్పగా చెప్పుకోవాలా? అని గిరిజన ప్రతినిధులు ముక్కున వేలేసుకుంటున్నారు.
దుప్పట్ల ప్రస్థావన సరే : రాష్ట్రంలో హ్యాండ్లూమ్స్, పవర్‌లూమ్స్ రంగాలు దేశంలోనే ప్రత్యేక స్థానాన్ని సంపాదించాయని పేర్కొంటూ వరంగల్ దుప్పట్లను ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రస్తావిస్తున్నప్పుడు చేనేత కార్మికులు కేటాయింపులు ఉంటాయని భావించారు. కానీ, బడ్జెట్ ప్రతులన్నీ జల్లెడ పట్టినా పైసా కనిపించకపోవడం గమనార్హం.
బడ్జెట్లో విద్య, మానవ వనరులకు కేటాయించింది రూ.26,674 కోట్లు మాత్రమే. ఇది మొత్తం బడ్జెట్లో 8.2 శాతం. గత సంవత్సరం కంటే రూ.3,566 కోట్లు అదనంగా కేటాయించినప్పటికీ పెంచిన మొత్తం బ్రేక్ ఫాస్ట్, ఇంటర్ వరకు మధ్యాహ్న భోజన పథకం విస్తరణ, తెలంగాణ పబ్లిక్ సూల్స్ ఏర్పాటు కోసమే సరిపోవచ్చు. అన్ని స్కూళ్లలో మౌలిక వసతులు మెరుగుపర్చి మధ్యాహ్న భోజనంలో నాణ్యత పెంపునకు అదనపు నిధుల కేటాయింపు ప్రస్తావనలేదు. విద్యకు 15 శాతం కేటాయిస్తామని ఎన్నికల మ్యానిఫెస్టోలో పేరొన్న కాంగ్రెస్ హామీ వరుసగా 3వ బడ్జెట్లో కూడా నెరవేరలేదు.
మరి పీఆర్సీ సంగతేంటి? తెలంగాణ రెండో పీఆర్సీ అమలు గురించి గానీ, అదనపు నిధుల కేటాయింపు గురించి ఈ బడ్జెట్లో మాట మాత్రంగానైనా ప్రస్తావించకపోవడం ఉద్యోగ, ఉపాధ్యాయులను నిరాశకు గురిచేసింది. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో మంచి పీఆర్సీ అమలు చేస్తామని మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీని 27 నెలలు గడుస్తున్నా నిలబెట్టుకోకపోవడం విచారకరం. పెండింగ్ డీఎలు, పెండింగ్ బిల్లులు, 2024 మార్చి నుంచి ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు గురించి ప్రస్తావనే లేదు. వాస్తవికత లేని బడ్జెట్ ఇది.
-సుజన్ ప్రసాదరావు, యూటీఎఫ్ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి
హనుమకొండ, మార్చి 20: 2024 మార్చి నుంచి రిటైరైన ఉద్యోగుల పెండింగ్ బకాయిల చెల్లింపుపై ఈ బడ్జెట్లో ప్రస్తావన లేకపోవడం శోచనీయం. రిటైర్మెంట్ (బెనిఫిట్స్) బకాయిలు అందక రాష్ట్రంలో అనేక మంది ఉద్యోగులు మరణిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం కనికరం చూపించక పోవడం అత్యంత దుర్మార్గం. ఇప్పటికే 82 మంది ఉద్యోగులు చనిపోయారు. వందలాది మందికి పైగా ఆసుపత్రి పాలయ్యారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌ను సమీక్షించి రిటైర్డ్ ఉద్యోగుల బకాయిల చెల్లింపులకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాం.
వాస్తవికతకు దూరంగా ఉన్న జనాకర్షణ బడ్జెట్ ఇది. 2026-27 ఆర్థిక సంవత్సరానికిగాను ప్రభుత్వం ప్రతిపాదించిన రూ.3,24,234 కోట్ల బడ్జెట్లో విద్య, మానవ వనరులకు కేటాయించింది రూ. 26,674 కోట్లు. ఇది బడ్జెట్ లో 8.2 శాతం మాత్రమే. ఇది గత బడ్జెట్ కంటే కేవలం 0.6 శాతం మాత్రమే పెరిగింది. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం తన ఎన్నికల మ్యానిఫెస్టోలో విద్యారంగానికి బడ్జెట్ లో 15 శాతం నిధులు కేటాయిస్తామని ఇచ్చిన హామీని విస్మరించింది. పీఆర్సీ, పెండింగ్ డీఏల ప్రస్తావన లేకపోవడం విచారకరం. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో రెండో పీఆర్సీ అమలు చేస్తామని ఇచ్చిన హామీని 27 నెలలు గడుస్తున్నా అమలు చేయలేదు. ఈ బడ్జెట్ ముమ్మాటికీ ఉద్యోగులను వంచించడమే.
– కడారి భోగేశ్వర్, ఉమ్మడి వరంగల్ జిల్లా రిటైర్డ్ ఎంప్లాయీస్, బకాయిల సాధన కమిటీ ప్రధాన కార్యదర్శి