ఏటూరునాగారం, మే 14: ఆ రైతులు రాత్రి వరకు తమ ధాన్యం కుప్పల మధ్యనే గడిపారు. 20 రోజులుగా ఆరబోసిన వడ్లు ఎండడంతో తెల్లారినంక బస్తాల్లో నింపాలనుకున్నరు. కొందరు రైతులు కాంటాలైన బస్తాలను లోడ్ చేయాలనుకున్నరు. మరికొందరు తమ విత్తన వడ్లను కంపెనీలకు అమ్ముకోవాలనుకున్నరు. ఇంటికి వెళ్లి నిద్రపోయారు. ఉదయం కొనుగోలు కేంద్రానికి వచ్చేసరికి పరిస్థితి అంతా తలకిందులైంది.
తెల్లవారుజామున కురిసిన అకాల వర్షానికి పక్కనే ఉన్న వాగు ఉప్పొంగడంతో కేంద్రంలోని వడ్లన్నీ నీటిలో మునిగిపోయాయి. కొన్ని ధాన్యం కుప్పలు మొత్తం కొట్టుకుపోయాయి. ఈ దృశ్యాన్ని చూసిన రైతులు లబోదిబోమన్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట వరదపాలు కావడంతో కన్నీరు పెట్టుకున్నారు. కొట్టుకుపోగా మిగిలిన వడ్లను పోగు చేసుకునేందుకు అష్టకష్టాలు పడ్డారు. అన్నదాతకు తీరని నష్టం మిగిల్చిన ఈ ఘటన ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం గోగుపల్లిలో బుధవారం చోటుచేసుకుంది.
మండలంలో బుధవారం తెల్లవారుజామున ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ అకాల వర్షానికి గోగుపల్లిలోని ఊర వాగు ఉప్పొంగి పక్కనే ఉన్న కొనుగోలు కేంద్రంలోకి వరద చేరింది. దీంతో అక్కడ నిల్వ ఉన్న సుమారు 30 మంది రైతులకు సంబంధించిన రెండు వేల బస్తాల ధాన్యం వరదలో మునిగిపోయింది. ఇందులో కొంత మంది రైతుల వడ్లు వరదలో కొట్టుకుపోయాయి. రాత్రి వరకు అక్కడే ఉన్న రైతులు ఉదయం వచ్చి నీటిలో కొట్టుకుపోతున్న వడ్లను చూసి హతాశులయ్యారు. మధ్యాహ్నం వరకు వరద తగ్గుముఖం పట్టడంతో నీటిలో కొట్టుకుపోగా మిగిలిన వడ్లను పోగు చేసుకునేందుకు రైతులు అష్టకష్టాలు పడ్డారు.
ఇందుకోసం కొనుగోలు కేంద్రంలో చిన్న కాల్వలు తీసి నీటిని బయటకు తరలించారు. మండలంలోని గోగుపల్లి రైతులు ఊరవాగు సమీపంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేం ద్రంలో పది, ఇరవై రోజుల నుంచి ధాన్యాన్ని ఆరబోసుకోగా, కొందరు బస్తాల్లో నింపుకున్నారు. మరికొందరి రైతుల బస్తాల కాంటా పూర్తయినప్పటికీ మిల్లులకు తరలించలేదు. మరి కొందరు రైతులు విత్తన వడ్లను కంపెనీలకు అమ్ముకునేందుకు అక్కడ నిల్వ చేసుకోగా నీటిలో తడిసిపోయాయి. కొనుగోలు కేంద్రంలో క్వింటాకు ఆరు నుంచి పది కేజీల తరుగు తీస్తున్నారని, సకాలంలో ధాన్యం నింపుకునేందుకు బస్తాలు కూడా ఇవ్వడం లేదంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పుడు అకాల వర్షానికి అంతా నష్టపోయామని కన్నీరుమున్నీరవుతున్నారు. విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు గోగుపల్లి కొనుగోలు కేంద్రానికి వచ్చి జేసీబీలతో మట్టి కట్టలు వేయడంతో పాటు కాల్వలు తీయించారు. నీట మునిగిన సెంటర్ను ఐటీడీఏ పీవో చిత్రామిశ్రా సందర్శించి బాధిత రైతులతో మాట్లాడారు. నష్టపరిహారం అందించేందుకు సిఫారసు చేస్తామన్నారు. సాయంత్రంలోగా జరిగిన నష్టంపై అంచనా వేయాలని, రోడ్డు, విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కాగా, మండల వ్యాప్తంగా కురిసిన వర్షానికి రైతులు కొనుగోలు కేంద్రాలు, కల్లాల్లో ఆరబోసుకున్న ధాన్యం తడిసిపోయింది. ఐదు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.
నేను ఆరు ఎకరాల్లో వరి సాగు చేసిన. పది రోజుల క్రితం ధాన్యం తీసుకొచ్చి ఆరబోసిన. తేమ రావడంతో కుప్ప చేసి బుధవారం బస్తాలిస్తే నింపుదామనుకున్న. రాత్రి కురిసిన అకాల వర్షానికి వాగు ఉప్పొంగి కొనుగోలు కేంద్రంలోకి వరద రావడంతో వడ్ల కుప్ప మొత్తం మునిగిపోయింది. సుమారు 200 బస్తాల వరకు పంట వచ్చింది. వరదలో కొట్టుకుపోగా కొంత ధాన్యం మిగిలింది. సెంటర్లో బస్తాలు సరిగా ఇవ్వడం లేదు. బయట అప్పులు చేసి సాగు చేసినం. ధాన్యం కొట్టుకుపోవడంతో తీరని నష్టం వాటిల్లింది. రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి.
– ఈసం రమేశ్, రైతు, గోగుపల్లి