తొర్రూరు, మే 18 : ఆరుగాలం కష్టపడి పండించిన వడ్లను అమ్ముకునేందుకు మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం చీకటాయపాలెం గ్రామ రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. 40 రోజులుగా గ్రామంలోని కోనుగోలు కేంద్రంలో పడిగాపులుగాస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం రైతులు గన్నీ బ్యాగులు ఇవ్వాలని కొనుగోలు కేంద్రం ఇన్చార్జిని అడుగగా, రైతులు తామే సొంత వాహనాలు సమకూర్చుకొని ధాన్యాన్ని మిల్లులకు తరలిస్తేనే గన్నీ బ్యాగులు ఇస్తామని చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడున్న అధికారులతో వాగ్వాదానికి దిగారు.
సమాచారం అందుకున్న తొర్రూరు తహసీల్దార్ శ్రీనివాస్ కొనుగోలు కేంద్రానికి చేరుకొని రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. లారీలో ధాన్యం తరలించేటప్పుడు లారీ డ్రైవర్ బస్తాకు రూ.5 అక్రమంగా వసూలు చేస్తున్నారని, లారీ ఊడ్చేవారు ఒక్కరు రూ.100 చొప్పున తీసుకుంటున్నారని అన్నారు. ఒకవేళ తామే ట్రాక్టర్ల ద్వారా వడ్లను తరలిస్తే లారీ కాంట్రాక్టర్ బస్తాకు రూ.8 చొప్పున ఇస్తున్నారని, అయినా తమపై అదనంగా రూ.5 వేల వరకు భారం పడుతున్నదని రైతులు వాపోయారు. కాంటాలు, ధాన్యం తరలింపులో జాప్యంతో విసుగు చెందిన కొందరు రైతులు అధికారుల సమక్షంలోనే దళారులకు ధాన్యాన్ని అమ్ముకుంటున్నారని అన్నారు.
వెంటనే అధికారులు స్పందించి లారీలను పంపించి ధాన్యాన్ని తరలించి, పెండింగ్ లో ఉన్న కొనుగోళ్లు పూర్తి చేయాలని రైతులు డిమాండ్ చేశారు. కొనుగోలు కేంద్రాల్లో 40 రోజులుగా రైతులు ఇబ్బంది పడుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని తొర్రూరు మండల బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. సోమవారం చీకటాయపాలెం గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఓట్ల కో సం వచ్చిన కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు రైతుల సమస్యలను ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు పసుమర్తి సీతారాములు, మాజీ జడ్పీటీసీ మంగళపల్లి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి నలమాస ప్రమోద్, మాజీ కో ఆప్షన్ సభ్యులు అంకూస్, సీనియర్ నాయకులు రాయిశెట్టి వెంకన్న, రైతులు పాల్గొన్నారు.
తొర్రూరులోని పీఏసీఎస్ గోదాము వద్ద హమాలీల కొరతతో రైతులు 4 రోజులుగా ఎండలో పడిగాపులుగాస్తున్నారు. సోమవారం గోదాము వద్ద వందకు పైగా మకజొన్న బస్తాలతో ట్రాక్టర్లు బారులు తీరాయి. వెంటనే హమాలీల సంఖ్య పెంచి బస్తాలు అన్లోడ్ చేయాలని రైతులు అధికారులను కోరారు.