హనుమకొండ, జూన్ 4 : హనుమకొండ బాలసముద్రంలోని అంబేద్కర్‌నగర్‌లోని డబుల్ బెడ్ రూం ఇండ్ల పంపిణీలో ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా సర్కారు మీనమేషాలు లెక్కిస్తున్నది. లబ్ధిదారులకు గత ప్రభుత్వం ప్రొసీడింగ్స్ ఇచ్చినా ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు ఇళ్లు కేటా యించకపోవడంతో వారంతా మంగళవారమే ఇండ్లలోకి వెళ్లారు. రాత్రంతా చీకటిలో గడిపారు. బుధవారం కుటుంబసభ్యులందరు కలిసి పెట్టేబేడా సర్దుకొని ఇళ్లను శుభ్రం చేసుకొని, ముగ్గులు వేసుకున్నారు.
వంటలు వండుకొని భోజనం చేశారు. అంబేద్కర్‌నగర్, జితేందర్నగర్కు చెందిన బాధితులు స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డిని కలువగా ‘నేను ఆగమని చెబితే వినడం లేదు కదా.. ప్రభుత్వం, కలెక్టర్ చూసుకుంటారు.. మీ ఇష్టం’ అంటూ వెళ్లిపోయారని వాపోయారు. 2018లో గత ప్రభుత్వం 117 మందికి డబుల్ బెడ్రూం ఇళ్లకు సంబంధించి ప్రొసీడింగ్స్ ఇచ్చినప్పటికీ ఇండ్లు కేటాయించకపోవడంతో గుడిసెలు వేసుకొని ఉంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎట్టి పరిస్థితుల్లో డబుల్ బెడ్ రూం ఇండ్లను తమకే పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న సుబేదారి పోలీసులు అంబేద్కర్‌నగర్‌కు చేరుకొని బాధితులతో మాట్లాడారు. అయినప్పటికీ ఇక్కడి నుంచి వెళ్లేది లేదని వారు భీష్మించుకు కూర్చున్నారు. మళ్లీ గురువారం ఎమ్మెల్యేను కలుస్తామని, అప్పటికీ స్పందించకపోతే తమ నిరసన కొనసాగిస్తామని స్పష్టం చేశారు.