వరంగల్, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ‘ఉన్నది కాస్త ఊడింది.. సర్వమంగళం పాడింది’ అన్నట్టే ఉన్నది. బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ సర్కారు అనుసరిస్తున్న వైఖరి. ఆ పార్టీ దిగ్విజయంగా కామారెడ్డి డిక్లరేషన్‌కు పాతరేసింది. ఎవరే మి అనుకున్నా.. అనుకోకపోయినా స్థానిక సంస్థల్లో 42శాతం రిజర్వేషన్లు కల్పించి తీరుతం అని గంభీర ప్రకటనలు చేసిన రేవంత్‌రెడ్డి సర్కారు బీసీ స్థానాల్లో భారీగా కోత విధించింది. జీవో నంబర్ 46తో జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్ ప్రక్రియ పూర్తి చేసి గెజిట్ ప్రచురించింది. 2019 కన్నా దారుణంగా బీసీలను నిలువు దోపిడీకి గురిచేసింది. సర్పంచ్ స్థానాల లెక్కలు చూస్తే బీసీ సీట్లకు భారీగా కోత పడిందనే విషయం స్పష్టంగా
అర్థమవుతున్నది.
ఉమ్మడి వరంగల్ జిల్లా విభజిత ఆరు జిల్లాలోనూ బీసీలకు గతంలో కేసీఆర్ హయాంలో దక్కిన రిజర్వేషన్లు కూడా దక్కడం లేదు. ఒక్కమాటలో చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని నమ్మబలికి బీసీ వర్గాలను రాజకీయంగా సమాధి చేసింది. 42 శాతం రిజర్వేషన్లు దక్కుతాయని, డ్రా తీసి, నోటిఫికేషన్ విడుదల చేసి తీరా కోర్టు తీర్పు నెపంతో ఎన్నికలను ఆపినట్టే ఇప్పుడూ అసంబద్ధ, పరస్పర విరుద్ధ ఆధారాల (ఎస్సీ, ఎస్టీలకు 2011 జనాభాలెక్కలు, బీసీలకు సీప్ (ఎస్ఈఈ ఈపీ గణాంకాలు)తో జీవో నంబర్ 46 జారీ చేశారని, న్యాయస్థానంలో అది నిలిచే అవకాశం లేదనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. అలా కాకుండా ఒకవేళ ఎన్నికలు నిర్వహించినా సరే, హామీ ఇచ్చిన మేరకు 42 శాతం రిజర్వేషన్ కల్పించకపోగా, కనీసం 2019 ఎన్నికల సమయంలో బీసీలకు
జిల్లాల వారీగా కేటాయించిన రిజర్వేషన్లను చూస్తే ములుగు, మహబూబాబాద్ జిల్లాలో సహజంగానే బీసీలకు రిజర్వ్స్థానాలు తక్కువగా వస్తాయి. ఏజెన్సీ ఏరియా (షెడ్యూల్), నూటికి నూరుశాతం ఎస్టీ జనాభా ఉన్న గ్రామాల సంఖ్య ఎక్కువగా ఉండడం ఆ జిల్లాల్లో మినహా యిం పు ఉందనుకున్నా వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాల్లో దక్కినస్థానాలను పరిశీలిస్తే కాంగ్రెస్ పార్టీ తమకు ఏ విధంగా ద్రోహం చేసిందో అర్థం అవుతుందని బీసీ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
బీసీలకు నిలువునా ముంచడంలో తమకు సాటి మరెవ్వరూ లేరని కాంగ్రెస్ పార్టీ తనకు తానే నిరూపించుకున్నదని బీసీ వర్గాలు మండిపడుతున్నాయి. గ్రామపంచాయతీ సర్పంచ్, వార్డుల సభ్యుల రిజర్వేషన్లకు సంబంధించి జారీ చేసిన మార్గదర్శకాలు, వాటిని అనుసరించి అధికార యంత్రాంగం బీసీ రిజర్వేషన్ స్థానాలను తేల్చింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏ లెక్కల ప్రకారం చూసినా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసిన రిజర్వేషన్లు విపరీత కోతకు గురయ్యాయి. తమ ఆత్మగౌరవాన్ని కాంగ్రెస్ పార్టీ కించపరిచిందని బీసీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రిజర్వేషన్ల కల్పనపై సర్కారు చెప్తున్న లెక్కలకు, వాస్తవ లెక్కలకు మధ్య పొంతనే కుదరడం లేదు. సుప్రీంకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా రిజర్వేషన్లు కేటాయించాలని, అవి 50 శాతం స్లాబ్ దాటకూడదని జీవో 46 స్పష్టం చేసింది. అంటే రాజ్యాంగ పరంగా ఎస్సీ, ఎస్టీ స్థానాల్లో ఏ తేడా ఉండదు. ఈ లెక్కన బీసీ కోటాలో తేడా ఉండకూడదు. రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లు బీసీ రిజర్వేషన్లు (బీసీ ఈతో సహా) 29 శాతం. కానీ, జీవో నంబర్ 46 ప్రకారం గ్రామ సర్పంచ్, వార్డు సభ్యులకు తేల్చిన రిజర్వేషన్లలో బీసీలకు దక్కిన వాటా ఎంత? అధికారులు కేటాయించి న సీట్ల సంఖ్య చెప్తున్నారే తప్ప ఇచ్చిన వాటా ఎంత అంటే చెప్పేందుకు నిరాకరిస్తున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రిజర్వేషన్ల విషయంలో బీసీలను నిలువుదోపిడీ చేసిందని జరుగుతున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. జిల్లాల్లో కేటాయించిన స్థానాల సంఖ్యను చూసి బీసీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరంగల్, హన్మకొండ, ము లుగు, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, జనగామ ఇలా ఏ జిల్లాలోనూ సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్ కనీసం 20 శాతం స్థానాలైనా దక్కకపోవటం దారుణమని ఉదహరిస్తున్నారు. ఈ లెక్కన చూస్తే.. వరంగల్ జిల్లాలో మొత్తం గ్రామ పంచాయతీల సంఖ్య 317.
ఇందులో 47 గ్రామాల సర్పంచ్‌స్థానాలు బీసీలకు (ఇందులో 21 మహిళలు, 26 పురుషుడు/మహిళ) కేటాయించారు. అం టే జిల్లాను యూనిట్‌గా చూస్తే ఇక్కడ బీసీలకు దక్కింది కేవలం 14.82 శాతం అన్నమాట. అట్లాకాకుండా షెడ్యూల్ ఏరియా, 100 శాతం ఎస్టీ జనాభా ఉన్న గ్రామ పంచాయతీలు ఆ వర్గాలకే కేటాయించాలనే నిబంధన ప్రకారమే చూసినా… ఇదే వరంగల్ జిల్లా లో షెడ్యూల్ ఏరియాలో 13 జీపీలు, 100 శాతం ఎస్టీ జనాభా ఉన్నవి74. మొత్తం 317 జీపీ ల్లో 87 పోను 230 జీపీలు ఉన్నాయి. ఒకవేళ ఈ 230 జీపీల్లో బీసీలకు 47 దక్కాయి. అంటే ఇట్లా చూసినా బీసీలకు దక్కిన వాటా కేవలం 20.43 శాతమే. ఈ లెక్కన పరిశీలిస్తే ఏ జిల్లా లోనూ బీసీలకు లోగడ 2019 ఎన్నికల్లో దక్కిన స్థానాలు కూడా ఈసారి దక్కకపోవడం గమనార్హం.
