హనుమకొండ చౌరస్తా, జూన్ 29 : కాకతీయ యూనివర్సిటీలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్‌పై రచ్చ రోజురోజుకు ముదురుతోంది. ఈ నెల 17న హైదరాబాద్‌లో జరిగిన కేయూ పాలకమండలి సమావేశంలో స్కూల్ ఏర్పాటుకు ఆమోదం తెలుపడంపై భగ్గుమంటున్న విద్యార్థి సంఘాలు.. వర్సిటీ భూముల జోలికొస్తే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 119 నియోజకవర్గాలకు గాను 40 నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ సూళ్లు మంజూరు కాగా.. ఎక్కడ కూడా ఇలా యూనివర్సిటీ భూములు కేటాయించలేదు.
కేయూ చరిత్రలో పాలకవర్గంలో భూకేటాయింపులు చేసిన దాఖలాల్లేవు. కాంగ్రెస్ సర్కారు స్కూల్ పేరుతో భూములు కేటాయించడం కబ్జా కోసమేనని, స్థానిక ఎమ్మెల్యే యూనివర్సిటీ భూముల్లో స్కూల్ ఏర్పాటుకు కుట్రలు చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. కేయూ వీసీ సైతం ప్రభుత్వానికి తొత్తుగా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. ఎక్కడా ప్రభుత్వ భూమి లేనట్లు కాకతీయ యూనివర్సిటీ భూములను ఎంచుకోవడంపై మండిపడుతున్నారు. వీసీ ప్రతాపరెడ్డి తన సొంత నిర్ణయంతో భూ కేటాయింపులు ఎలా చేస్తారని ప్రశ్నిస్తున్నారు.
కాకతీయ యూనివర్సిటీకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్నని దానికి అనుగుణంగానే కొత్త కోర్సులకు, కొత్త హాస్టళ్లను, కొత్త ఆవిష్కరణలకు భూ అవసరాలు ఉంటాయి. చుట్టూ ప్రహరీ లేకపోవడం వల్ల ఇప్పటికే ఎన్నో ఎకరాలు అన్యాక్రాంతమయ్యాయి. భూముల కబ్జాపై చేసిన విజిలెన్స్ సర్వేను ఎందుకు బయట పెట్టడం లేదని ప్రశ్నిస్తున్నారు. మళ్లీ సూల్ పేరుతో సుమారు రూ.100 కోట్ల విలువైన భూమిని అప్పనంగా కట్టబెట్టాలని నిర్ణయం తీసుకోవడం సిగ్గుమాలిన చర్య అని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
భూములను కేటాయించడాన్ని అన్ని విద్యార్థి సంఘాలు, మేధావులు, అధ్యాపకులు పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయని ప్రభుత్వానికి, యూనివర్సిటీ అధికారులకు ప్రజాప్రతినిధులకు చిత్తశుద్ధి ఉంటే విద్యార్థులకు అవసరమయ్యే ప్రాంతంలో నిర్మించాలని డిమాండ్ చేశారు. యూనివర్సిటీ భూములను పోలీస్‌స్టేషన్, సీఆర్పీఎఫ్ క్యాంపులకు ఇతర ప్రభుత్వ వినియోగాలకు వాడుకుంటూనే ఉన్నారు. ఇది కేవలం తాతాలికంగా ఉపయోగించుకునే వెసులుబాటును మాత్రమే కల్పించినా, వారు పూర్తిస్థాయిలో నిర్మాణాలు చేసుకొని ఉంటూ, రోజురోజుకు యూనివర్సిటీ భూములను సీఆర్పీఎఫ్ గ్రౌండ్ నెపంతో శుభ్రం చేసుకొని, వారి పరిధిని విస్తరించుకుంటున్నారు.
సీఆర్పీఎఫ్ క్యాంపు తరలించిన తర్వాత ఆ స్థలం నిరుపయోగంగా ఉంటుందని, యూనివర్సిటీ అధికారులు వెంటనే స్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా ఇంటిగ్రేటెడ్ సూల్ అంశాన్ని వెనకి తీసుకోవాలని, ప్రభుత్వ భూముల్లోనే సూల్ నిర్మించాలని పట్టుబడుతున్నారు. కేయూ వీసీ విద్యార్థుల పక్షమా లేక కాంగ్రెస్ ప్రభుత్వ పక్షమా తేల్చుకోవాలని అల్టిమేటం జారీ చేశారు. మొండిగా వ్యవహరిస్తే విద్యార్థుల ఆగ్రహానికి గురిగాక తప్పదని హెచ్చరిస్తున్నారు. వీసీ తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని యూనివర్సిటీల విద్యార్థులు వ్యతిరేకరించాలని డిమాండ్ చేస్తున్నారు.
కేయూ భూములను వీసీ ప్రతాపరెడ్డి తన సొంత నిర్ణయంతో భూకేటాయింపులు ఎలా చేస్తారు. స్థానిక ఎమ్మెల్యేతో కలిసి తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి. రూ.100 కోట్ల భూమిని ఇచ్చేయాలని నిర్ణయం తీసుకోవడం సిగ్గుమాలిన చర్య. ప్రభుత్వం మొండివైఖరిని అవలంబిస్తే దశలవారీగా ఉద్యమిస్తాం. ప్రభుత్వ భూములు ఉన్నప్పటికీ యూనివర్సిటీ భూముల్లో నిర్మాణాలు చేపడితే సహించబోం.
– జెట్టి రాజేందర్, బీఆర్ఎస్వీ కేయూ ఇన్చార్జి
కాకతీయ యూనివర్సిటీలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు విషయం ప్రభుత్వం చేతుల్లోనే ఉంది. విద్యార్థులు కూడా వ్యతిరేకిస్తున్నారు. భూములు ఇవ్వాలా వద్దా..? అనేది ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. అందరితో చర్చించి అనుకూలమైన నిర్ణయం తీసుకుంటాం.
– వల్లూరి రామచంద్రం, కేయూ రిజిస్ట్రార్