దుగ్గొండి, జూన్,24 : ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసింది అని బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు సూకినే రాజేశ్వర్ రావు విమర్శించారు. మంగళవారం గిర్నిబావి సెంటర్లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రైతాంగానికి ప్రతి ఎకరాకు 19,000 వేల రూపాయలు చెల్లించకుండా ప్రభుత్వం బాకి పడిందన్నారు. గత శాసన సభ ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీ మేరకు ప్రతి ఎకరాకు రూ.15,000 ఇస్తామని చెప్పి రైతులను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందన్నారు. ప్రతి రైతుకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని గొప్పలు చెప్పి సగం మంది రైతులకు కూడ రుణ మాఫీ వర్తించలేదని ఎద్దేవా చేశారు.
సన్నాలకు బోనస్ కూడా ఇప్పటి వరకు ఒక్క రైతుకు ఇవ్వలేదని అలాంటప్పుడు ఎలా సంబురాలు చేసుకుంటారని ప్రశ్నించారు. రాష్ట్రంలోనే ప్రతి కౌలు రైతుకు ఎకరాకు 12,000 రూపాయలు ఎక్కడ ఇవ్వలేదని తెలంగాణ రైతాంగాన్ని నట్టేట ముంచిన కాంగ్రెస్ పార్టీని రాబోవు స్థానిక సంస్థల ఎన్నికల్లో రైతులు తగిన గుణపాఠం చెబుతారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పొన్నం మొగిలి, నర్సంపేట యూత్ కన్వీనర్ శానబోయిన రాజకుమార్, మాజీ ఎంపీపీ కాట్లా కోమల భద్రయ్య, క్లస్టర్ ఇంచార్జి కంచారకుంట్ల శ్రీనివాస్ రెడ్డి, గుండేకారి రంగరావు, భుంపెల్లి రజినీకర్ రెడ్డి, నాయకులు కార్యకర్తలు తదితరుల పాల్గొన్నారు.