నర్సంపేట/నల్లబెల్లి, అక్టోబర్24 : దళారుల దోపిడీ కోసమే సీసీఐ కపాస్ కిసాన్ యాప్‌ను ఆవిష్కరించిందని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నా రు. పంటకు మద్దతు ధర రాకుం డా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర చేసున్నాయని విమర్శించారు. కపాస్ యాప్ డౌన్లోడ్ చేసుకొని పట్టా పాసు పుస్తకం కలిగిన రైతులు మాత్రమే పత్తిని అమ్ముకోవాలని, అది కూడా మూడు సార్లు మాత్రమే అవకాశం ఇచ్చారని అన్నా రు.
యాప్‌ను వాడని రైతులను బ్లాక్ లిస్టులో పెడతామని చెప్పడం బాధాకరమన్నారు. యాప్‌లో వివరాలు నమోదు చేయడానికి రైతులేమైనా ఐటీ ఉద్యోగులా అని ఆయన ప్రశ్నించారు. కౌలు రైతుల గుర్తింపు ప్రక్రియ చేపట్టకుండానే వ్యవసాయ అధికారుల ద్వారా సర్టిఫికెట్ తీసుకోవాలని చెప్పడం వింతగా ఉందన్నారు. 70 శాతం రైతులు పత్తిని ఇప్పటికే ప్రైవేట్ మార్కెట్లో అమ్ముకున్నారని, సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాలను ఇప్పటికీ గుర్తించలేదని పేర్కొన్నారు. రైతులకు ఈ యాప్‌పై అవగాహన కల్పించకుండానే కొనుగో లు ప్రక్రియ చేస్తామంటూ ఆందోళన కు గురిచేస్తున్నారని చెప్పారు. గతం లో సీసీఐ పత్తి కొనుగోళ్లలో టెంపరరీ రిజిస్ట్రేషన్ల పేరుతో 137 కేంద్రాల్లో భారీ కుంభకోణం జరిగిందని, రైతుల పేరుతో దళారులు, దోపిడీదారులు, ప్రైవేటు వ్యక్తులు పత్తి అమ్మి పెద్ద ఎత్తు న అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు.
రూ. 3000 కోట్ల కుంభకోణంలో ప్రభుత్వ పెద్దలకు వాటాలు ఉన్నాయని, ఇందులో ఎలాంటి దర్యాప్తు చేయకుండా 134 మంది పంచాయతీ కార్యదర్శులను సస్పెండ్ చేసి సర్కారు చేతులు దులుపుకుందని విమర్శించారు. అధిక వర్షాలు, యూరియా కొరతతో పత్తి దిగుబడి బాగా తగ్గిందని, వచ్చిన కొద్దిపాటి సరుకును అమ్ముకుందామంటే నిబంధనల పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతు ను అరిగోస పెడుతున్నాయని అన్నారు. ఇప్పటికైనా నిబంధనలు సవరించి సులువుగా సీసీఐకి పత్తిని అమ్ముకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు.