తరిగొప్పుల , నవంబర్ 27 : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులనే గెలిపించి గులాబీ జెండాను ఎగురవేయాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి శ్రేణులకు పిలుపునిచ్చారు. జనగామ జిల్లా తరిగొప్పుల మండల కేంద్రంలో గురువారం పార్టీ మండలాధ్యక్షుడు పింగిళి జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనుల వివరాలను ప్రతి గడపకు చేరవేయాలన్నారు.
అబద్ధాలు, అలవికాని హామీలతో గద్దెనెక్కిన రేవంత్‌రెడ్డి రెండేళ్లు పూర్తయినా ఒక్కటి కూడా అమలు చేయలేదన్నారు. ఆరు గ్యారెంటీలన్నీ పచ్చి బూటకమన్నారు. బీఆర్ఎస్ హయాంలో ప్రతి ఇంటికి సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అందాయన్నారు. రైతుబంధు, కేసీఆర్ కిట్, కల్యాణలక్ష్మి, రైతుబీమా, పంటల కొనుగోలు వంటి ఎన్నో పథకాలు సమర్థవంతంగా అమలయ్యాయన్నారు. అలాగే చెరువులు, కుంటలను గోదావరి జలాలతో పదేళ్లు నింపినట్లు గుర్తు చేశారు.
రేవంత్‌రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలను బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు ప్రజలకు వివరించి ప్రతి గ్రామంలో బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులనే సర్పంచులుగా గెలిపించుకోవాలన్నారు. ప్రతి కార్యకర్త పార్టీ అభివృద్ధికి పాటుపడాలన్నారు. పక్కా ప్రణాళికతో, ప్రజలకు అర్థమయ్యే రీతిలో ప్రచారం నిర్వహించాలని పల్లా సూచించారు. అనంతరం తరిగొప్పుల సీనియర్ కార్యకర్త బూస రామస్వామి కుటుంబాన్ని పరామర్శించారు. సమావేశంలో నాయకలు జూంలాల్, పద్మజా వెంకట్‌రెడ్డి, రాజారాం, శ్రీనివాస్‌రెడ్డి, రాజయ్య, రవి, రాజేశ్వర్‌గౌడ్, నర్సింహులు, రాజయ్య, సారయ్య, కనకయ్య, సంపత్, మొగిలి, కొమురయ్య, కుమార్, రాజు పాల్గొన్నారు.