జయశంకర్ భూపాలపల్లి, (నమస్తే తెలంగాణ)/మహాముత్తారం, మే 20 : కొనుగోలు కేంద్రాల్లో వడ్లను కాంటా పెట్టకపోవడంతో ఆగ్రహించిన రైతులు కన్నెర్ర చేశారు. ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ బుధవారం జయశంకర్భూపాలపల్లి జిల్లా కాటారం మండలం గుమ్మళ్లపల్లి గ్రామానికి చెందిన రైతులు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా కాటారం-మంథని ప్రధాన రహదారిపై మంత్రి శ్రీధర్‌బాబు స్వగ్రామమైన ధన్వాడ వద్ద పెద్ద ఎత్తున రాస్తారోకో చేపట్టారు. ధాన్యం కొనుగోళ్లలో జాప్యంపై ధ్వజమెత్తారు. లారీలు పంపకుండా, ధాన్యాన్ని మిల్లులకు తరలించకుండా కొనుగోలు కేంద్రంలో నిల్వ ఉంచడంతో వడ్ల బస్తాలు చెదలు పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
నెల రోజుల క్రితం కేంద్రంలో ధాన్యం ఆరబోసి నిరీక్షిస్తున్నామని వారు వాపోయారు. వర్షాలు కురిస్తే తీవ్రంగా నష్టపోయే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్, అధికారులకు తమ సమస్యను విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ధాన్యం కొనుగోళ్లు చేపట్టకుంటే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటామని మందు డబ్బాతో హెచ్చరించారు. కాంగ్రెస్ సర్కారు గారడీ మాటలతో మోసపోయి గోస పడుతున్నామని చెప్పులతో కొట్టుకుంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. చేతగాని ప్రభుత్వం దిగిపోవాలని పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఇప్పటికైనా మంత్రి శ్రీధర్‌బాబు స్పందించి ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు.
ధాన్యం బస్తాలను తగులబెట్టేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. కాటారం ఎస్సై శ్రీనివాస్ నచ్చచెప్పినా రైతులు ఆందోళన ఆపలేదు. పరిస్థితి తీవ్ర స్థాయికి చేరుకోవడంతో జిల్లా కలెక్టర్ కార్యాలయ సిబ్బంది రైతులతో మాట్లాడి వెంటనే లారీలను పంపించి కొనుగోళ్లను వేగవంతం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. గంటకు పైగా జరిగిన ఆందోళనతో కాటారం-మంథని ప్రధాన రహదారిపై ఇరువైపులా పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. ఆందోళనలో రైతులు కంకణాల సురేందర్, కంకణాల పోచిరెడ్డి, తోడె రవీందర్, కంకణాల మహేశ్వర్, రేగొండ రాజేంద్రప్రసాద్, తాళ్ల గౌరయ్య, శనిగరపు రాజన్న, మడె వెంకన్న, కంకణాల లక్ష్మారెడ్డి, తాళ్ల శేఖర్, నగేశ్ పాల్గొన్నారు.
కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యాన్ని కాంటా వేసి మిల్లులకు తరలించాలని డిమాండ్ చేస్తూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహముత్తారం మండలం బోర్లగూడెంలో రైతులు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా కాటారం-మేడారం ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. వారం రోజుల నుంచి కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం ఉందని, లారీలను టెండరుదారు పంపకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నాడని మండిపడ్డారు. కుల సంఘాల జేఏసీ జిల్లా కన్వీనర్ అజ్మీరా పూల్సింగ్నాయక్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ స్పందించి వెంటనే లారీలను పంపాలని డిమాండ్ చేశారు. మరోవైపు తహసీల్దార్ దండు శ్రీనివాస్ స్పందిస్తూ సాయంత్రం వరకు లారీలను పంపి కొనుగోలు చేపడుతామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో రైతులు ఠాకూర్ లక్ష్మణ్, వెంకట్రాజం, బానోత్ దేవుసింగ్, ఠాకూర్ రవి, మొగిలి రమేశ్, సురెడ్డి నర్సింహారెడ్ది,శ్రీధర్, సింగన వేణి తిరుపతి, లావుడ్య రమేశ్ పాల్గొన్నారు.