స్టేషన్‌ఘన్‌పూర్, మార్చి 21: అరచేతిలో వైకుంఠం చూపించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు సాగునీరివ్వకుండా పట్టపగలే చుక్కలు చూపిస్తున్నదని, వారి ఉసురు తప్పకుండా తగులుతుందని స్టేషన్‌ఘన్‌పూర్ మాజీ ఎమ్మెల్యే రాజయ్య అన్నారు. శుక్రవారం ఆయన స్టేషన్‌ఘన్‌పూర్ మండలం తాటికొండ గ్రామంలోని మేకల వెంకటయ్య, గిద్దెబండతండాలో బానోత్ రాముకు చెందిన ఎండిపోయిన పంటపొలాలను పరిశీలించారు.
సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అ నంతరం రాజయ్య మాట్లాడుతూ.. మేకల వెంకటయ్యకు చెందిన 4 ఎకరాల పొలం, గిద్దెబండతండాలో బానోత్ రాముకు చెందిన 8ఎకరాల పొలం సాగునీరు లేక ఎండిపోయిందని తెలిపారు. సాగునీరు లేక పంటలు ఎండి నియోజకవర్గంలోని రైతులు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. గత బీఆర్ఎస్ పాలనలో అధికారులే పనులు చేపట్టి, రైతులకు సాగునీరు అందించేవారని, కానీ, నేడు తమ స్వార్థం, పేరు కోసం అధికారులను పనులు చేపట్టనీయకుండా, తామే సాగునీటిని విడుదల చేయాలని చూస్తూ జాప్యం చేయడంతో రైతుల పంటలు ఎండుతున్నాయని అన్నారు.
ఇందుకు ఉదాహరణే దేవన్నపేట వద్ద ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రొటోకాల్ పాటించకుండా మంత్రులు పొంగులేటిని, ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని బ్లాక్మెయిల్ చేసి సాగునీటి విడుదల కోసం తీసుకొచ్చాడని రాజయ్య విమర్శించారు. వ్యవసాయం తప్ప మరో ఆదెరువు లేక, భూమిని నమ్ముకొని కష్టపడే రైతుల పొ లాలు ఎండిపోవడం చూస్తుంటే పానం తరుక్కుపోతున్నదని, గత పదేళ్లలో సాగునీరు, కరెంటు సమస్య లేకుండా రైతులు సంతోషంగా ఉన్న ట్లు తెలిపారు.
అబద్ధాల కాంగ్రెస్ వచ్చిన తర్వాతనే వారి జీవితాల్లో చీకట్లు నిండాయన్నారు. ఇప్పటివరకు 468 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. సమ్మక్క, సారలమ్మ బరాజ్ వద్ద 7.5 టీఎంసీల నీరు నిల్వ ఉందని, దేవాదుల ఫేస్- 1, ఫేస్- 2, ఫేస్-3 ద్వారా రైతులకు నీరు అందించే అవకాశమున్నా, ప్రభు త్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదన్నారు. 31 మెగావాట్ల సామర్థ్యం ఉన్న మూడు మోటర్లను ఆస్ట్రియా నుంచి తీసుకొచ్చి బిగించారని, వాటిని ప్రారంభించడానికి ప్రభుత్వం ముందుకు రావడం లేదన్నారు.
రేపటిలోగా దేవాదుల పంప్‌హౌస్ మోటర్లను ఆన్ చేసి ధర్మసాగర్ నుంచి స్టేషన్‌ఘన్‌పూర్ రిజర్వాయర్‌కు సాగునీరు అందించాలని, లేకపోతే దేవన్నపేట పంప్‌హౌస్‌ను ముట్టడించి, పెద్దఎత్తున ధర్నా చేపడతామని రాజయ్య ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గండిరామారం కుడి కాల్వ ద్వారా నీరు విడుదల చేయాలని, వల్లభరాయుని చెరువు కింద ఎమ్మెల్యే కడియం అనుచరులు తమ పొలాలకు నీరు పెట్టుకుంటూ, కింది రైతులకు వెళ్లకుండా అపుతున్నారని, వీరిపై అధికారులు చర్యలు తీసుకోవలని డిమాండ్ చేశారు.
కేసీఆర్ పదేళ్ల పాలనలో అన్ని వర్గాల ప్రజలతోపాటు రైతులు సైతం సంతోషంగా ఉన్నారని, రైతులకు 24 గంటల నాణ్యమైన కరెంటు, సాగునీరు, ఎరువులు, రైతుబంధు, రైతుబీమా ఎలాంటి సమస్యలు లేకుండా అందాయన్నారు. కాంగ్రెస్ వచ్చిన ఏడాదిలోనే అనేక సమస్యలను రైతులు ఎదుర్కొంటున్నారని, మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని, గత పదేళ్ల పాలనే మళ్లీ రాబోతున్నదన్నారు.
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి కర్రు కాల్చి వాత పెట్టాలని, బీఆర్ఎస్కు అండగా నిలిచి సమస్యల పరిష్కారానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాజయ్య కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మాచర్ల గణేశ, మాజి జడ్పీటీసీ మారపాక రవి, గ్రామశాఖ అధ్యక్షుడు పొన్నం శ్రీనివాస్ గౌడ్, బీఆర్ఎస్వీ నియోజకవర్గ ఇన్చార్జి లకావత్ చిరంజీవి, నూనవత్ జయపాల్, బానోతు రవీందర్, అక్కనపల్లి వెంకటయ్య, అక్కనపల్లి సత్తయ్య, అక్కనపల్లి బాలరాజు, బానోత్ టాను, అక్కనపల్లి రాజు, గోడుగు సంజీవ, శ్రీధర్, కుంబోజి గౌరిష్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
నాకు నాలుగు ఎకరాల పొలం ఉంది. నా ఇద్దరు కొడుకులు, నేను సాగు చేసుకుంటానం. ఈ పొలంపైనే మూడు కుటుంబాలు ఆధారపడి ఉన్నయి. ఇప్పుడు సాగునీరు లేక ఈనిన వరి ఎండిపోతున్నది. రెండు వారాలపాటు సాగునీరు అందితే కొంతవరకు పంటలను కాపాడవచ్చు. లాభాలు కాకున్నా, పెట్టుబడిలో కొంతవరకైనా వచ్చే అవకాశం ఉంది. లేదంటే లాభంతోపాటు పెట్టుబడికి పెట్టిన రూ. లక్ష నష్టపోతాం. ప్రభుత్వం స్పందించి ఎండిపోతున్న పంటలకు సావుగంజి పోసి కాపాడాలి.
– మేకల వెంకటయ్య, తాటికొండ రైతు