జనగామ, జనవరి 23 (నమస్తే తెలంగా ణ) : జనగామలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రౌడీల్లా రెచ్చిపోయారు. మద్యం మత్తులో డీసీసీ మాజీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి కుమారుడు ప్రశాంత్‌రెడ్డి అనుచరులు మంత్రి సీతక్క సమక్షంలోనే ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డిపై దాడికి య త్నించారు. శుక్రవారం పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం, శంకుస్థాపనకు వచ్చిన మంత్రి సీతక్క పలుసార్లు వారించినా పట్టించుకోకుండా కొమ్మూరి తనయుడు అత్యుత్సాహం ప్రదర్శించి ఎమ్మెల్యే పల్లా గోబ్యాక్ నినాదాలు చేసి ఆసాంతం ఉద్రిక్తతకు కారణమయ్యాడు.
దీంతో ఆగ్రహించిన బీఆర్ఎస్ శ్రేణులు భారీగా చేరుకొని ప్రతి నినాదాలతో కౌంటర్ అటాక్ చేయడంతో ఇరు పార్టీల నాయకుల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. మద్యం మత్తులో ఎమ్మెల్యేపై దాడికి ప్రయత్నించిన కాంగ్రెస్ నాయకుడిని పోలీసులు పక్కకు తీసుకెళ్లి గట్టిగా పట్టుకున్నారు. అయినప్పటికీ పోలీసులను తోసుకుంటూ పెనుగులాటకు దిగాడు.
అధికారికంగా జరుగుతున్న మంత్రి సీతక్క పర్యటనలో అడుగడుగునా కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి, చేర్యాల మాజీ ఎమ్మెల్యే కుమారుడు కొమ్మూ రి ప్రశాంత్‌రెడ్డి తన మార్క్ గూండాగిరి ప్రదర్శించా రు. బచ్చన్నపేట, నర్మెట మండలాల నుంచి రెండు, మూడు వాహనాల్లో యువ నాయకుడి కాన్వాయ్ లో పాల్గొన్న పదుల సంఖ్యలో ఉన్న కాంగ్రెస్ నాయకులకు మద్యం తాగించి స్థానిక ఎమ్మెల్యే ప ల్లాను, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్, కేటీఆర్‌ను దూషిస్తూ దొంగ ఓట్లతో గెలిచిన ‘పల్లా గోబ్యాక్’ నినాదాలు చేయిస్తూ రెచ్చగొట్టారు. కాంగ్రెస్ నాయకులు కావాలని గొడవ సృష్టించేందుకు ప్రయత్నిసున్నారని గ్రహించిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి బీఆర్ఎస్ శ్రేణులను పలుమార్లు సమూదాయించారు.
తొలుత పట్టణ ముఖ ద్వారం జనగామ బైపాస్ వద్ద దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మ, సర్వాయి పాప న్నగౌడ్ విగ్రహాలను ప్రారంభించే ముందు బీఆర్ఎస్ పార్టీకి చెందిన మున్సిపల్ మాజీ చైర్పర్సన్లు, మాజీ కౌన్సిలర్లు మద్యం మత్తులో ఉన్న కొమ్మూరి వర్గం నాయకులు అడ్డుకొని ఎమ్మెల్యేను నిందిస్తూ నినాదాలు చేశారు. అక్కడి నుంచి పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల సమయంలోనూ మంత్రి సీతక్క సమక్షంలోనే అల్లరిమూక చెలరేగిపోయింది. సమీకృత మార్కెట్ ప్రారంభ సమయంలో కొమ్మూ రి తనయుడు కొబ్బరికాయ కొట్టేందుకు చేసిన ప్రయత్నాన్ని మంత్రి సీతక్క వారించారు.
అంతకు ముందు చౌరస్తా వద్ద ఆకృతుల ప్రారంభోత్సవం సందర్భంగా శిలాఫలకం వద్దకు వచ్చి నిల్చున్న కొమ్మూరి ప్రశాంత్‌రెడ్డిని నీకేం ప్రొటోకాల్ ఉంది.. ఇక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ స్థానిక ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి హెచ్చరించి మంత్రి సీతక్కకు ఫిర్యాదు చేయడంతో అత డు మరోసారి రెచ్చిపోయి దూషణకు దిగారు. దీంతో మంత్రి సీతక్క జోక్యం చేసుకొని ఇక్కడి నుంచి వెళ్లాలని సూచించినా వినకపోవడంతో అర్బన్ సీఐ సత్యనారాయణరెడ్డి కలుగజేసుకొని పక్కకు తీసుకెళ్లారు. ఆ తర్వాత కూడా సమీకృత మార్కెట్ వద్ద తన అనుచరగణాన్ని ఉసిగొల్పాడు.