దేవరుప్పుల/తొర్రూరు/పాలకుర్తి/రాయపర్తి, మే 2: ఓట్ల కోసమే కాంగ్రెస్ సర్కారు రైతులను మోసం చేస్తున్నదని, ఇందులో భాగంగానే గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాహుల్‌గాంధీతో సభ నిర్వహించి రైతు డిక్లరేషన్ ప్రకటించి అమలు చేయలేదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు విమర్శించారు. శనివారం జనగామ జిల్లా దేవరుప్పుల, పాలకుర్తి మండల కేంద్రాలతోపాటు మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండల కేంద్రం, వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో బీఆర్ఎస్ కార్యకర్తలతో నిర్వహించిన సమావేశాల్లో ఆయన మాట్లాడారు.
అనంతరం ఎర్రబెల్లి విలేకరులతో మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు వరంగల్ సభలో కాంగ్రెస్ పార్టీ అధినేత రాహూల్‌గాంధీ రైతు డిక్లరేషన్ పేర అనేక హామీలు ఇచ్చి చేతులు దులుపుకున్నారని మండిపడ్డారు. రాహూల్‌గాంధీ రైతు డిక్లరేషన్ ప్రకటించిన 6వ తేదీనే బీఆర్ఎస్ పార్టీ నేతృత్వంలో రైతులను సంఘటిత పరిచి ఈ నెల 6న హనుమకొండ హంటర్ రోడ్డులో రైతు సదస్సు నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి 30 వేల మంది రైతు ప్రతినిధులు సదస్సుకు హాజరవుతారని వెల్లడించారు. రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలనలో రైతులు అష్టకష్టాలు పడుతున్నారని, పండించిన ధాన్యం, మక్కలను కొనుగోలు చేయడంలో సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదన్నారు.
మరోవైపు సాగునీరందక, ఎరువులు లభించక పంటలు ఎండిపోయినా సీఎం రేవంత్‌రెడ్డి పట్టించుకోవడం లేదని విమర్శించారు. బీఆర్ఎస్ పాలనలో గత సీఎం కేసీఆర్ వ్యవసాయాన్ని పండుగలా మార్చారని, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతో లక్షలాది ఎకరాలు సాగులోకి వచ్చాయన్నారు. రైతులు పండించిన ధాన్యం, మక్కలను వెనువెంటనే కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించి డబ్బులను సైతం వారి అకౌంట్లలో జమ చేయించారని గుర్తు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రైతుబంధు, రైతుబీమా అమలు కావడంలేదన్నారు. ఈ నేపథ్యంలో రైతుల సమస్యలపై బీఆర్ఎస్ సమరశంఖం పూరించేందుకు ఈ నెల 6న నిర్వహించే రైతు సదస్సుకు వేలాదిగా రైతులు తరలిరావాలని ఎర్రబెల్లి కోరారు.