వరంగల్, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో కాంగ్రెస్ సర్కార్ ఎంత మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించినా ప్రజానిరసన ఏ రూపాన్ని సంతరించుకుంటుందో అనే ఆందోళన క్షేత్రస్థాయిలో కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. ఇప్పటికీ యూరియా కోసం నెలల తరబడి అవస్థలు పడుతున్న అన్నదాతలు.. కాంగ్రెస్ నేతలు కనిపిస్తే కడిగిపారేయాలన్నంత ఆగ్రహంతో పల్లెల్లో సిద్ధంగా ఉన్న వాతావరణం నెలకొన్నది. అసెంబ్లీ ఎన్నికల ముందు ఆరు గ్యారెంటీలు, 420 హామీల్లోని కొన్ని ప్రధానమైన వాటిని తీసుకొని బీఆర్ఎస్ ‘బాకీ కార్డు’ను విడుదల చేసింది.
రైతు భరోసా, యువ వికాసం, గృహజ్యోతి, మహిళా భరోసా, పింఛన్ పెంపు ఇలా అనేక అంశాల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీల్లో అంశాల వారీగా లెక్కలేస్తూ ఓటు కోసం ఇంటికి వచ్చే నాయకులను నిలదీయాలంటూ బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చింది. దీంతో వరంగల్ ఉమ్మడి జిల్లా పరిధిలో ఎమ్మెల్యే, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గాల్లోని అన్ని గ్రామాల్లో ఇంటింటికీ బాకీ కార్డులను పంపిణీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఎంగిలిపూల నుంచి సద్దుల బతుకమ్మ దాకా ఊరూరా ‘గులాబీల జెండలమ్మా.. గులాబీల జెండలమ్మ, సారే కావాలంటున్నరే.. తెలంగాణ పల్లెలల్లా.., ఛల్ దేఖ్లేంగే..’ అనే పాటలతో ఆడబిడ్డలు దుమ్మురేపారు. అన్ని వర్గాలను విస్తృతంగా ఆకర్షిస్తున్న బాకీ కార్డుతో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో నెలకొన్న అసంతృప్తిని పట్టుకోవడంలో బీఆర్ఎస్ సఫలమైందనే వాదన వినిపిస్తున్నది.
బీఆర్ఎస్ విడుదల చేసిన బాకీ కార్డు జనం చేతిలో పాశుపతాస్త్రం కానుందని కాంగ్రెస్ గ్రహించిందా? అంటే జరుగుతున్న పరిణామాలు అవుననే అంటున్నాయి. ఈ క్రమంలోనే గాంధీభవన్లో అందుబాటు లోని వర్గాలతో అత్యవసర భేటీ నిర్వహించి ‘మనమూ ఏ కారటు వదలాలి. లేకపోతే అసలుకే మోసం వచ్చేటట్టు ఉన్నది’ అని జిల్లాలకు వదిలింది. దీంతో బీఆర్ఎస్ విడుదల చేసిన బాకీ కార్డుకు విరుగుడుగా తా మూ ఒక కారటు విడుదల చేస్తామని కాంగ్రెస్ నాయకులు ప్రకటిస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఇటీవల ఆ పార్టీకి తగిలిన దెబ్బ నుంచి ఎలా బయటపడాలా? ఆలోచిస్తూ ఏకంగా బాకీ కార్డుకు వ్యతిరేకంగా తాము నిరసన వ్యక్తం చేస్తామని ప్రకటించటం గమనార్హం. అయితే, స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో అధికార పార్టీ నిరసనకు పిలుపునివ్వడంలోని ఆంతర్యం డైవర్షన్ పాలి‘ట్రిక్స్’లో భాగమేననే అభిప్రాయం వ్యక్తం అవుతున్నది.
కాంగ్రెస్ పార్టీ 22 నెలల క్రితం అధికారంలోకి రావడానికి ఇచ్చిన హామీల్లో భాగంగా ఆయా వర్గాలకు చెల్లించాల్సిన మొత్తం ఎంత అనే అంశాన్ని ఫోకస్ చేసిన బీఆర్ఎస్.. కాంగ్రెస్ బాకీ కార్డు ను విడుదల చేసింది. ఉదాహరణకు నాలుగు ఎకరాల రైతులకు రైతు భరోసా కింద ఎంత బాకీ పడింది? మహిళలకు నెలకు రూ. 2,500 చొప్పున ఎంతవుతుంది? చేయూత ఎంత చెల్లించాల్సి ఉంది? దివ్యాంగులకు నెలకు రూ. 6 వేల చొప్పున చెల్లిస్తే ఎంతవుతుంది? కల్యాణలక్ష్మి/షాదీముబారక్తోపాటు తులం బంగా రం, విద్యా భరోసా కార్డుకు ఎంత? కౌలు రైతులకు చెల్లించాల్సిన మొత్తం ఎంత? రైతు కూలీలకు ఇప్పటి వరకు ఎంతైంది? వంటి వివరాలను పొందుపరిచింది. బీఆర్ఎస్ పంపిణీ చేసిన బాకీ కార్డు రైతులు, మహిళలు, వృద్ధులు, పింఛన్దారుల్లోకి విస్తృతంగా వెళ్లి కాంగ్రెస్ శ్రేణులకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నది.