హైదరాబాద్, ఫిబ్రవరి 15(నమస్తే తెలంగాణ) : అధికారం కోసం కాంగ్రెస్ అడ్డదారులు తొక్కుతున్నదని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ధ్వజమెత్తారు. క్యాంపులకు వెళ్లిన బీఆర్ఎస్ కౌన్సిలర్ల ఫోన్లను ట్యాపింగ్ చేయించి అక్కడికి పోలీసులను పంపుతున్నదని దుయ్యబట్టారు. కొన్నిచోట్లకు మఫ్టీలో కూ డా పంపారంటూ విమర్శించారు. తెలంగాణ భవన్లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. సోమవారం చైర్మన్, వైస్ చైర్మన్ల ఓటింగ్ జరుగుతున్న నేపథ్యంలో క్యాంపుల నుంచి బస్సుల్లో తిరిగి వచ్చే కౌన్సిలర్లను తనిఖీల పేరుతో పోలీసులు అడ్డగించి, బలవంతంగా కాంగ్రెస్‌కు అనుకూలంగా ఓటు వేయించే కుట్రలు పన్నినట్టు తెలిసిందని చెప్పారు. ఈ నేపథ్యంలో హంగ్ ఏర్పడిన మున్సిపాలిటీల్లో మేయర్, చైర్మన్ ఎన్నికల ప్రక్రియ అత్యంత పారదర్శకంగా, సజావుగా జరుపాలని డిమాండ్ చేశారు.
మున్సిపోల్లో కాంగ్రెస్ అరాచకం
మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ అరాచకాలకు పాల్పడిందని, డబ్బు మూటలు పంపిణీ చేసినా కేవలం 51శాతం వార్డుల్లోనే ఆ పార్టీ గెలిచిందని ప్రవీణ్‌కుమార్ స్పష్టం చేశారు. కానీ ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ను ప్రజలు ఆదరించారని, ప్రజాసమస్యల కోసం పోరాడినందుకు 788 వార్డుల్లో విజయం కట్టబెట్టారని పేర్కొన్నారు. బీఆర్ఎస్కు ఓట్లేసిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. 2020 ఎన్నికల్లో బీఆర్ఎస్ 110 మున్సిపాలిటీలు గెలిస్తే, కాంగ్రెస్ పార్టీకి నాలుగంటే నాలుగే వచ్చాయని గుర్తుచేశారు.
జగ్గారెడ్డి, అరవింద్‌లను ఎందుకు అరెస్టు చేయలేదు
మున్సిపల్ ఎన్నికల సందర్భంగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్.. పోలీసులను పచ్చి బూతులు తిట్టినా కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు కేసులు నమోదు చేయలేదని ప్రవీణ్‌కుమార్ ప్రశ్నించారు. అధికార కాంగ్రెస్, బీజేపీ కలిసి పనిచేస్తున్నాయని చెప్పేందుకు ఇదే నిదర్శనమని ఆరోపించారు. ఈ విషయం లో ఐఏఎస్, ఐపీఎస్, ఉద్యోగ సంఘాలు ఎందుకు మౌ నంగా ఉన్నాయని ఆయన ప్రశ్నించారు. ఎన్నో దశాబ్దాల నుంచి హోంగార్డులుగా సేవలందిస్తున్న వారిని జగ్గారెడ్డి బూతులు తిట్టినా ఎన్నికల సంఘం మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. సీఎం రేవంత్‌రెడ్డి ఏం కోరుకుంటున్నారో ఏమో కానీ, కొన్ని పత్రికలు మా త్రం విషం చిమ్ముతున్నాయని ఆరోపించారు. ఫార్ములా ఈ-రేసులో మళ్లీ లీకులు ఇస్తున్నారంటూ మండిపడ్డారు.
ఏమైనా చేసి, హంగ్ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ గెలువాలని రేవంత్‌రెడ్డి ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. చేర్యాలలో భార్య బీఆర్ఎస్ నుంచి కౌన్సిలర్‌గా పోటీ చేస్తే, భర్తను సస్పెండ్ చేయడాన్ని ఆయన తప్పుపట్టారు. కాగజ్‌నగర్‌లో ఎమ్మెల్సీ దండే విఠల్ ఓటు వేయకపోయినా, అతనికి అక్కడే ఎక్స్ అఫీషియో ఓటు హక్కు ఎలా కల్పించారని ఆశ్చర్యం వ్యక్తంచేశారు. విఠల్‌కు వాస్తవంగా సనత్‌నగర్‌లో ఓటు ఉన్నదని, రాత్రికి రాత్రే ఎక్స్అఫీషియో ఓటు ఎలక్టోరల్‌లో ఎలా యాడ్ చేస్తారని ప్రశ్నించారు. విప్ జారీ చేసినా పరిగణనలోకి తీసుకోవడం లేదని మండిపడ్డారు. వికారాబాద్‌లో అధికారిక సమావేశంలో హస్తం గుర్తుకే ఓటు వేయాలని స్వయంగా సీఎం చేసిన ప్రచారంపై ఈసీ ఎందుకు చర్య తీసుకోలేదని మండిపడ్డారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నేత పల్లె రవికుమార్, గాయకుడు సందీప్ పాల్గొన్నారు.