సుబేదారి, జూన్ 26 : కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ కార్పొరేటర్ దొంగనోట్ల కేసులో ఇరుక్కున్నాడు. వాటాల పంపకం లో తలెత్తిన పంచాయతీతో అతడి నకిలీ నోట్ల దందా మరోసారి వెలుగులోకి వచ్చింది. పోలీసులకు చిక్కకుండా వారం రోజులుగా అజ్ఞాతంలోకి వెళ్లాడు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ కార్పొరేటర్, హైదరాబాద్‌లో తెలిసి వ్యక్తి ద్వారా నకిలీ కరెన్సీ నోట్లు చెలామణి చేస్తుండగా, ఇద్దరి మధ్య కమిషన్ వాటాల్లో తేడాలు రావడంతో కార్పొరేటర్ హైదరాబాద్‌కు చెందిన వ్యక్తిని బెదిరింపులకు గురిచేశాడు. దీంతో అతడు పోలీసులను ఆశ్రయించినట్లు తెలిసింది.
పోలీసుల విచారణలో దొంగ నోట్ల చెలామణి వెనకాల ఉన్న ప్రధాన వ్యక్తి వరంగల్ నగరానికి చెందిన అధికార కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్‌గా వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. దీంతో అతడి కోసం హైదరాబాద్ పోలీసులు గాలిస్తున్నారు. కాగా, ఈ కేసులో ఇరుక్కున్న అధికార పార్టీ కార్పొరేటర్‌కు గ్రేటర్ వరంగల్ శివారులోని అధికార పార్టీ ఎమ్మెల్యే అండదండలు అందిస్తున్నారు.
అతడు పోలీసులకు చిక్కకుండా ఎ మ్మెల్యే అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారు. కాగా, ఈ కేసులో ఇరుక్కున్న కార్పొరేటర్‌పై గతంలో వరంగల్ జిల్లా నర్సంపేట సబ్ డివిజన్ పరిధిలో నకిలీ కరెన్సీ నోట్ల చెలామణి కేసు నమోదైంది. కొంతకాలం సైలెంట్‌గా ఉన్న అతడు తిరిగి దొం గనోట్ల దందాను సాగిస్తుండగా, తాజాగా హైదరాబాద్‌లో అతడి బాగోతం మరోసారి వెలుగులోకి వచ్చింది. వరంగల్ నగరంలో ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో చర్చకు దారితీసింది. సోషల్‌మీడియాలో వైరల్ కావడంతో వరంగల్ పశ్చిమలో హాట్‌టాపిక్‌గా మారింది.