లోక్‌సభకు సన్నద్ధం
ఈ సారి ఎండాకాలం లోక్‌సభ ఎన్నికలతో మరింత వేడెక్కనుంది. రాజకీయ పార్టీల పోటాపోటీ కార్యక్రమాలు, అభ్యర్థుల ప్రకటనలతో ప్రచార ప్రక్రియ ఊపందుకుంటున్నది. ఇప్పటికే వరంగల్, మహబూబాబాద్‌కు అభ్యర్థులను ప్రకటించి బీఆర్ఎస్ ఒక అడుగు ముందుండగా, మహబూబాబాద్‌కు మాత్రమే కాంగ్రెస్, బీజేపీలు తమ అభ్యర్థులను ఖరారు చేశాయి.
- ఇటు రాజకీయ పార్టీలు, అటు అధికార యంత్రాంగం సమాయత్తం
- వరంగల్, మహబూబాబాద్‌కు బీఆర్ఎస్ అభ్యర్థుల ఖరారు
- మహబూబాబాద్‌కు మాత్రమే ప్రకటించిన బీజేపీ, కాంగ్రెస్
- వరంగల్ అభ్యర్థిపై తేల్చని రెండు పార్టీలు.. బీజేపీకి అభ్యర్థులు దొరకని దుస్థితి
- వరంగల్ సీటుపై కాంగ్రెస్‌లో అయోమయం
ఈ సారి ఎండాకాలం లోక్‌సభ ఎన్నికలతో మరింత వేడెక్కనుంది. రాజకీయ పార్టీల పోటాపోటీ కార్యక్రమాలు, అభ్యర్థుల ప్రకటనలతో ప్రచార ప్రక్రియ ఊపందుకుంటున్నది. ఇప్పటికే వరంగల్, మహబూబాబాద్‌కు అభ్యర్థులను ప్రకటించి బీఆర్ఎస్ ఒక అడుగు ముందుండగా, మహబూబాబాద్‌కు మాత్రమే కాంగ్రెస్, బీజేపీలు తమ అభ్యర్థులను ఖరారు చేశాయి. ఇక వరంగల్ విషయంలో బీజేపీకి అభ్యర్థులే దొరక్కపోగా, హస్తం పార్టీలో అయోమయం నెలకొంది.
– వరంగల్, మార్చి 18(నమస్తే తెలంగాణ ప్రతినిధి)
ఎవరూ లేని బీజేపీ…
లోక్‌సభ ఎన్నికల్లో అభ్యర్థులు దొరక్కపోవడంతో బీజేపీ ఆగమవుతున్నది. ఇతర పార్టీల నుంచి వచ్చే నాయకుల కోసం వేచి చూస్తున్నది. బీఆర్ఎస్ నుంచి ఇటీవలే పార్టీలో చేరిన మాజీ ఎంపీ అజ్మీరా సీతారాంనాయక్‌ను మహబూబాబాద్ లోక్‌సభ అభ్యర్థిగా బీజేపీ ప్రకటించింది. వరంగల్ లోక్‌సభ సెగ్మెంట్ అభ్యర్థిత్వం కోసం ఎవరూ లేకపోవడంతో ఇతర పార్టీల నాయకుల కోసం ప్రయత్నిస్తున్నది. బీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న అరూరి రమేశ్‌ను రెండు రోజుల క్రితం బీజేపీలో చేర్చుకున్నది. వరంగల్ లోక్‌సభ అభ్యర్థిగా అరూరి రమేశ్‌ను బీజేపీ రెండుమూడు రోజుల్లో ప్రకటించే అవకాశం ఉన్నది. ఇదే సెగ్మెంట్లో టికెట్ కోసం రిటైర్డ్ ఐపీఎస్ అధికారి కృష్ణ ప్రసాద్, మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్, బీజేపీ రాష్ట్ర నాయకుడు చింతా సాంబమూర్తి ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రంలోని మొత్తం 17 సీట్లలో 15 స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. ఎవరూ లేకపోవడంతో వరంగల్ సీటును పెండింగ్‌లో పెట్టింది.
కాంగ్రెస్‌లో అయోమయం
రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ సైతం వరంగల్ లోక్‌సభ సెగ్మెంట్ అభ్యర్థిపై తేల్చడం లేదు. మహబూబాబాద్ అభ్యర్థిగా మాజీ మంత్రి పోరిక బలరాంనాయక్‌ను కాంగ్రెస్ ప్రకటించింది. వరంగల్ అభ్యర్థిత్వంపై స్పష్టత ఇవ్వడం లేదు. గెలుపు అవకాశాలపై ధీమా ఉన్న నాయకుడు లేకపోవడంతోనే ఈ పరిస్థితి ఉన్నదని కాంగ్రెస్ నాయకుల్లో చర్చ జరుగుతున్నది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓడిపోయిన దొమ్మాటి సాంబయ్య, స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ ఇన్చార్జి శనిగపురం ఇందిర, మరో నాయకుడు రామగళ్ల పరమేశ్వర్ టికెట్ ఆశిస్తున్నారు. రెండు రోజుల క్రితం బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన వరంగల్ సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్ అధికార పార్టీ టికెట్‌పై ధీమాతో ఉన్నారు. కాంగ్రెస్ అధిష్ఠానం ఎవరిని అభ్యర్థిగా ప్రకటిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకారం మే 13న వరంగల్, మహబూబాబాద్ లోక్‌సభ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఎన్నికల నోటిషికేషన్ ఏప్రిల్ 18న వెలువడనుంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు ఉండనున్నది. ఈ మేరకు ఎన్నికల నిర్వహణ కోసం అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తున్నది. ఎన్నికల్లో గెలుపు కోసం ప్రధాన పార్టీలు ముమ్మరంగా కసరత్తు చేస్తున్నాయి. సన్నాహక సమావేశాలతో శ్రేణులను సిద్ధం చేస్తున్నాయి. ఎన్నికల ప్రక్రియలో బీఆర్ఎస్ మిగిలిన రాజకీయ పార్టీల కంటే ముందున్నది. వరంగల్ లోక్‌సభ అభ్యర్థిగా డాక్టర్ కడియం కావ్య, మహబూబాబాద్ లోక్‌సభ అభ్యర్థిగా మాలోత్ కవితను షెడ్యూల్‌కు ముందే ప్రకటించింది. ఇద్దరు అభ్యర్థులు బీఆర్ఎస్ శ్రేణులతో సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ అధిష్ఠానం ఆదేశాల మేరకు పార్టీ ముఖ్యనేతలు ప్రచార వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో బీఆర్ఎస్ వరంగల్, మహబూబాబాద్ సీట్లను భారీ ఆధిక్యంతో గెలుచుకున్నది. ప్రస్తుత ఎన్నికల్లోనూ గెలుపే లక్ష్యంగా గులాబీ పార్టీ వ్యూహాలు అమలు చేస్తున్నది.
పెరిగిన ఓటర్లు 4,28,806
వరంగల్, మహబూబాబాద్ లోక్‌సభ సెగ్మెంట్ల పరిధిలో కొత్త ఓటర్లు పెరిగారు. 2019 ఎన్నికలతో పోల్చితే రెండు సెగ్మెంట్లలో కలిపి 4,28,806 మంది ఓటర్లు పెరిగారు. 2019 ఎన్నికలప్పుడు వరంగల్ లోక్‌సభ పరిధిలో 15,78,335 ఓటర్లు ఉంటే ఇప్పుడు 18,16,428 ఓటర్లు ఉన్నారు. ఐదేండ్లలో ఈ సెగ్మెంట్లో 2,38,094 ఓటర్లు పెరిగారు. మహబూబాబాద్ లోక్‌సభ సెగ్మెంట్ పరిధిలో 2019లో 13,36,286 ఓటర్లు ఉంటే ఇప్పుడు 15,26,998 ఓటర్లు ఉన్నారు. గత ఎన్నికల కంటే ఈసారి 1,90,712 ఓటర్లు పెరిగారు.

Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
- Tags
- BJP
- BRS
- brs candidates
- Congress
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

