ఉమ్మడి జిల్లాలో నేడు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. వరంగల్ నగరంలో రూ.3కోట్లతో నిర్మించిన దేవాదాయ శాఖ సమీకృత భవన సముదాయం, ములుగులో రూ.15లక్షలతో నిర్మించిన డీఏవో, ఏడీఏ, ఎంఏవో కార్యాలయాలను రాష్ట్ర మంత్రులు అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్ ప్రారంభించనున్నారు. మేడారంలో రూ. 6 కోట్లతో పరిపాలనా భవనం, వీవీఐపీ గెస్ట్ హౌస్, రూ. 2కోట్లతో డార్మెటరీ హాల్, రూ.1.50కోట్లతో పూజారి గెస్ట్ హౌస్, రూ.1.06 కోట్లతో శుభధ మండపం, రూ.94లక్షలతో కన్నెపల్లిలోని సారలమ్మ పూజా మందిరం, రూ.50లక్షలతో జంపన్న వాగు పరిసర ప్రాంతంలో ఉన్న దేవాదాయ శాఖ స్థలంలో పాఠశాల భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు అధికారులు సర్వం సిద్ధం చేశారు.
వరంగల్, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి జిల్లాలో నేడు అభివృద్ధి పనుల ప్రారంభ పండుగ కొనసాగనుంది. వరంగల్ నగరంలో నిర్మించిన ధార్మిక భవన్, ములుగు జిల్లా కేంద్రంలో వ్యవసాయ శాఖ అధికారి కార్యాలయాన్ని మంత్రులు అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతిరాథోడ్, ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్ నేడు ప్రారంభించనున్నారు. మేడారంలో రూ.13.24 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
వరంగల్‌లో ధార్మిక భవన్
రాష్ట్ర ప్రభుత్వం వరంగల్ నగరంలో రూ.3 కోట్లతో 1040 చదరపు గజాల విస్తీర్ణంలో ధార్మిక భవన్‌ను నిర్మించింది. నాలుగు అంతస్తుల ఈ భవనంలో దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్, మేడారం సమ్మక్క-సారలమ్మ ఈవో, సంబంధిత శాఖ ఇంజినీరింగ్ విభాగం కార్యాలయాలు, పెద్ద కాన్ఫరెన్స్ హాలు ఏర్పాటు చేసింది. మల్టీజోన్ పరిధిలోని 19 జిల్లాల దేవాదాయ శాఖ పరిపాలన వ్యవహారాలు ఇక్కడి నుంచే జరుగనున్నాయి. ఈ భవనాన్ని నేడు మంత్రులు, చీఫ్‌విప్ ప్రారంభించనున్నారు.
ములుగులో వ్యవసాయ శాఖ కార్యాలయాలు
సీఎం కేసీఆర్ వ్యవసాయ శాఖను బలోపేతం చేశారు. ములుగు జిల్లా ఏర్పడిన తర్వాత అన్ని శాఖల కార్యాలయాలకు భవనాలను నిర్మిస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లా కేంద్రంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి కార్యాలయం, అదేశాఖకు చెందిన వివిధ స్థాయిల అధికారుల కార్యాలయాలను ఒకే ప్రాంగణంలో ప్రభుత్వం కట్టించింది. ములుగు జిల్లా ఏర్పడక ముందు బండారుపల్లి రోడ్డులో అరెకరం భూమిలో ఫైర్ స్టేషన్ పక్కన మండల వ్యవసాయ శాఖ కార్యాలయం, ఒక గోదాం ఉండేది. జిల్లా ఏర్పాటు తర్వాత ఒక్కో శాఖకు పక్కా భవనాలు అందుబాటులోకి వస్తున్నాయి. రూ.15లక్షల కలెక్టర్ ఫండ్‌లో రూ.10లక్షలతో డీఏవో కార్యాలయాన్ని నిర్మించారు. ఏడీఏ, ఏంఏఓ కార్యాలయాల మరమ్మతులను పూర్తి చేశారు. రూ.5లక్షలతో కార్యాలయాల చుట్టూ ప్రహరీ కట్టారు. నేడు ఈ కార్యాలయాల సముదాయాన్ని మంత్రులు ప్రారంభిస్తారు.
వ్యవసాయ అధికారుల సేవలు చేరువ
ములుగు జిల్లా కేంద్రంలో ఒకే ప్రాంగణంలో వ్యవసాయ శాఖ కార్యాలయాలు అందుబాటులోకి రావడంతో రైతులకు వ్యవసాయ శాఖ సేవలు మరింత చేరువయ్యాయి. రైతు బంధు, రైతు బీమా వంటి పథకాల్లో లబ్ధిదారులుగా చేరేందుకు రైతులు గతంలో ఒక్కో దిక్కున ఉన్న కార్యాలయాలకు పరుగులు పెడుతుండేవారు. ప్రస్తుతం అన్నీ ఒకే ప్రాంగణంలో ఉండడంతో రైతులకు సులువు కానుంది. ప్రతి వారం రైతులు, పురుగు మందుల డీలర్లు, అధికారులకు ఇప్పటివరకు జిల్లా కేంద్రంలోని రైతువేదికలోనే సమావేశాలు జరుగుతున్నాయి. ఇక నుంచి కార్యాలయాల ప్రాంగణంలోనే ప్రత్యేక సమావేశాలు, సమీక్షలు నిర్వహించుకునే సౌలతు కలిగింది.
మహాజాతరపై నేడు రివ్యూ
తాడ్వాయి : మేడారం మహాజాతరపై మంత్రులు అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, సత్యవతి రాథోడ్, దయాకర్‌రావు నేడు సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ములుగు జిల్లా పరిషత్ చైర్ పర్సన్, ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి, బీఆర్ఎస్ ములుగు జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్బాబుతో కలిసి జాతర ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో ఐటీడీఏ క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించనున్నారు.
మేడారంలో శంకుస్థాపనలు
మేడారం మహా జాతరలో అభివృద్ధి పనులను ప్రభు త్వం ఇప్పటినుంచే మొదలు పెట్టింది. ఇక్కడ రూ.13. 24 కోట్లతో చేపట్టే పలు అభివృద్ధి పనులకు మం త్రులు నేడు శంకుస్థాపన చేయనున్నారు. రూ.6కోట్ల తో పరిపాలనా భవనం, వీవీఐపీ గెస్ట్ హౌస్, రూ. 2కోట్లతో డార్మెటరీ హాల్, రూ.1.50కోట్లతో పూజారి గెస్ట్‌హౌస్, రూ.1.06 కోట్లతో శుభధ మండపం, రూ. 94లక్షలతో కన్నెపల్లిలో సారలమ్మ పూజా మందిరం, రూ. 50లక్షలతో జంపన్న వాగు పరిసర ప్రాంతంలోని దేవాదాయ శాఖ స్థలంలో పాఠశాల భవన నిర్మాణానికి ప్రభుత్వం పరిపాలనా అనుమతులు ఇచ్చింది.