గతేడాది తక్కువ పెట్టుబడితో రెట్టింపు ఆదాయం రావడంతో పాటు పలు కంపెనీలు ‘మీరు సాగు చేయండి, మేము కొనుగోలు చేస్తాము’ అంటూ ప్రోత్సహించడంతో రైతులు ఆశపడి భారీ ఎత్తున పొగాకు పంటను సాగు చేశారు. ప్రస్తుతం కొనుగోళ్ల సమయం వచ్చే వరకు వ్యాపారులు ముఖం చాటేశారు. రాష్ట్రంలో సుమారు 80 వేల టన్నుల పొగాకు రైతుల వద్దే పేరుకుపోగా, కేవలం 30 వేల టన్నుల వరకే కొనుగోళ్లు జరిగినట్లు చెబుతున్నారు. ఇటు అధికారులు గానీ, అటు ప్రభుత్వం గానీ పట్టించుకోకపోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. – హనుమకొండ సబర్బన్, జూన్ 1
రాష్ట్రంలోని ఉమ్మడి వరంగల్, కరీంనగర్, మహబూబ్‌నగర్, సిద్దిపేట, ఆదిలాబాద్ జిల్లాల్లో భారీగా పొగాకు పంటను సాగు చేస్తున్నారు. గత సంవత్సరం క్వింటాల్‌కు రూ. 15 నుంచి 16వేలు ధర పలుకగా, ఎకరాకు నికరంగా ప్రతి రైతుకు రూ. లక్షా 50 నుంచి లక్షా 80వేల వర కు గిట్టుబాటయ్యాయి. దీనికి తోడు పలు పొగాకు కంపెనీలు తామే కొంటాం, మీరు ఎన్ని ఎకరాలైనా సాగు చేయండని చెప్పడంతో సాధారణ విస్తీర్ణం కంటే ఈ సారి మూడు రెట్లు సాగు పెరిగింది. కోతులు ముట్టకపోవడం, తెగుళ్లు, పురుగు తక్కువగా ఉండడంతో ఈ పంట వైపు రైతులు మొగ్గు చూపారు. తీరా పంట పండిన తర్వాత కొనుగోళ్ల విషయంలో ఆయా కంపెనీలు మొఖం చాటేశాయి. ప్రధానంగా రాష్ట్రంలో బర్లీ, వర్జీనియా, కేఎఫ్‌సీ లాంటి రకాలను సాగు చేసిన రైతులు మొత్తం సంక్షోభంలోకి వెళ్లిపోయారు. గత సంవత్సరం డెక్కన్, వీఎస్టీ, జీఫై, వెంకటసాయి టొబాకో కంపెనీలు పోటీ పడి రైతుల నుంచి పొగాకును కొనుగోలు చేశాయి.
ఈసారి వీఎస్టీ మాత్రం కొంత మేరకు తీసుకుంది. అది కూడా ధరలో దగా చేసినట్లుగా రైతులు ఆరోపిస్తున్నారు. మంచి నాణ్యత ఉన్న పొగాకు ఆకులను సైతం మూడు నుంచి 5 వేల లోపే కొనుగోలు చేస్తున్నారని వాపోతున్నారు. కొనుగోళ్ల విషయంలో పలు ప్రాంతాల్లో రైతులు ఇప్ప టికే పోలీసు స్టేషన్లను ఆశ్రయిస్తున్నారు. అయితే తమకు కావాల్సిన అవసరానికంటే రైతుల వద్ద పెద్ద మొత్తంలో నిల్వలు ఉన్నాయని, తాము కొనుగోళ్లు చేయలేమని కంపెనీ ప్రతినిధులు చెబు తున్నారు. పొగాకు కొనుగోళ్ల విషయంలో మార్కెటింగ్ శాఖకు కూడా ఎలాంటి ఆదేశాలు లేకపో వడంతో వారు దీనిపై చర్యలు తీసుకోలేకపోతున్నారు.
సాధారణంగా చైనా, జర్మనీ, జింబాబ్వే లాంటి దేశాలకు మన దేశం నుంచి స్థానిక అవసరాలు పోను ఎగుమతి అవుతుంటాయి. అయితే పలు దేశాల్లో సైతం పొగాకు విస్తీర్ణం పెరగడంతో ఎగుమతులు ఉండడం లేదని కంపెనీ ప్రతినిధులు అంటున్నారు. పొగాకు సాగు విషయంలో టొబాకో బోర్డు ఉన్నప్పటికి ఎలాంటి పనితీరు ను కనబర్చడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. పలు ప్రాంతాల్లో రైతులు ఆందోళనలు చేస్తున్న ప్పటికి ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన కనిపించడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం పంటను కొనుగోలు చేసి వచ్చే ఏడాది రైతులు ఎక్కువ మొత్తంలో పంట సాగు చేయకుండా చూస్తే సరిపో తుందని పలువురు రైతు సంఘాల నాయకులు అంటున్నారు.
గత సంవత్సరం మా చుట్టాలు పొగాకు పంట వేస్తే మంచి లాభాలు వచ్చాయని చెబితే నేను కూడా ఈ సారి పంట వేసి మంచి దిగుబడులు తీసిన. ఆకు కత్తిరించి రెండు నెలలు అవుతుంది. తోటను కూడా తీసివేసి మళ్లీ వర్షాకాలం పంట కోసం సిద్ధం చేసిన. ఇప్పటి వరకు పొగాకును మాత్రం కొనలేదు. ధర పూర్తిగా అధ్వానంగ ఉంది. పోయినేడు మంచి ధర పలికిందంటే ఆశతో పంట వేస్తే కంపెనీలు రైతులను నిండా ముంచాయి. ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి.
– ఎడెల్లి లింగారెడ్డి, రైతు, ఎల్కతుర్తి
నేను రెండెకరాల్లో పొగాకు పంట యేసిన. దిగుబడి మంచిగనే వచ్చింది. ఎకరానికి లచ్చ యాభై వేలు వత్తయనుకున్న. తీరా ఇప్పుడు అమ్ముదామనుకుంటే అగ్గువకు అడుగుతాన్లు. కొన్ని దిక్కుల రూ.10 వేల నుంచి 12 వేలు పెట్టి కొంటున్నరట. మాదగ్గర మాత్రం అడ్డికి పావుశేరు అన్నట్లుగ జేత్తాన్లు. కట్టలు కట్టి రెండు నెలలు అయితాంది. పొగాకు మాత్రం కొంటలేరు. పోలీసు ఠాణాకు బోయినం. అయిన మాకు న్యాయం జరుగుతలేదు. సర్కారు ముందటికొచ్చి మా దగ్గర ఉన్న పొగాకు కొనె టట్లు చెయ్యాలె. మళ్లేడు పెట్టకున్న మంచిదే గని ఈసారి అయితే కొనేటట్లు సూడున్లి. లేకపోతె సావుమర్ణమే అయితది. అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టిన.
– వలిగె సాంబయ్య, రైతు, చింతలపల్లి