హనుమకొండ, నవంబర్ 18 : ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషితోనే దేశం నేటికీ ఐక్యతతో ఉందని హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. మంగళవారం హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ(కేడీసీ) ప్రాంగణంలో కేంద్ర యువజన సర్వీసులు, క్రీడా వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆదేశాల మేరకు మై భారత్, ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ సంస్థల ఆధ్వర్యంలో సర్దార్@150 ఐక్యత పాదయాత్రను నిర్వహించారు. ఈ సందర్భంగా ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి కలెక్టర్ స్నేహ శబరీష్ పూలమాల వేశారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ భారత దేశంలో స్వేచ్ఛ కోసం తపించేవారని, ఎన్ని భాషలు మాట్లాడిన ఎన్ని ప్రాంతాలు ఉన్న మనమందరం ఒకటేనని చాటి చెప్పేవారని వివరించారు.
స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా సంస్థానాలుగా విడివిడిగా ఉన్న దేశాన్ని ఒక్కటి చేయడంలో సర్దార్ పటేల్ కృషి చేశారన్నారు. అనంతరం కలెక్టర్ జెండాఊపి పాదయాత్రను ప్రారంభించారు.
కార్యక్రమంలో మేరా యువభారత్ వరంగల్ జిల్లా డిప్యూటీ డైరెక్టర్ చింతల అన్వేష్, సూపరింటెండెంట్ బానోతు దేవిలాల్, కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ రామ్‌కుమార్ రెడ్డి, కేడీసీ ప్రిన్సిపల్ గుర్రం శ్రీనివాస్, కేయూ స్టూడెంట్స్వెల్ఫేర్ డీన్ ప్రొఫెసర్ ఇస్తారి, డిస్ట్రిక్ వెల్ఫేర్ ఆఫీసర్ జయంతి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ డాక్టర్ అప్పయ్య, ప్రభుత్వంచే నామినేట్ అయిన మెంబర్స్ జయంత్‌లాల్, సాంద్ర మధు, తీగల భరత్, మై భారత్ వాలంటీర్లు, కేయూ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ఈసం నారాయణ పాల్గొన్నారు.