ధర్మసాగర్ : ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలను హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రంతో పాటు దేవునూర్, ముప్పారం గ్రామాలలో జరిగిన నష్టాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. మొంథా తుపాన్ కారణంగా ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ధర్మసాగర్ రిజర్వాయర్ కు వరద ఉధృతి పోటెత్తింది. కాగా రిజర్వాయర్ గేట్లను అధికారులు ఎత్తివేయాగ రిజర్వాయర్ ఆయకట్టు కింద ఉన్న పంట పొలాలు వరద ఉధృతికి తీవ్రంగా దెబ్బతిన్నాయి.
దేవునూర్ గ్రామానికి చెందిన రైతులు చాలా మంది నష్టపోయారు. దీనితో రైతుల నష్టాన్ని అంచనా వేయడానికి జిల్లా కలెక్టర్ ఆయా గ్రామాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వర్షాలకు దెబ్బతిన్న పంటల నష్టాన్ని పూర్తిగా నమోదు చేయలని అధికారులను ఆదేశించారు. అనంతరం ముప్పారం చెరువు కింద రోడ్డు కొట్టుకపోవడంతో వెంటనే మరమ్మతులు చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ సదానందం, ఎంపీడీఓ అనిల్ కుమార్, ఏవో రాజేష్, ఏడీవో ఆదిరెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.