రాయపర్తి : ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మెరుగైన విద్యాబోధన జరుగుతున్నదని కలెక్టర్ డాక్టర్ సత్య శారద తెలిపారు. మండలంలోని కొండూరు జిల్లా ప్రజా పరిషత్ సెకండరీ ఉన్నత పాఠశాలలో సోమవారం పాఠశాల వార్షికోత్సవ వేడుకలకు జిల్లా విద్యాశాఖ అధికారి మామిండ్ల జ్ఞానేశ్వర్, మండల స్థాయి అధికారుల బృందంతో కలిసి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఏటా ప్రభుత్వ విద్యా రంగం సమగ్ర అభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలలో అనుభవం, అంకితభావం, సుశిక్షితులైన ఉపాధ్యాయులు విద్యాబోధన చేస్తున్నట్లు చెప్పారు. అంతేగాక సర్కార్ బడుల్లో చదువుకుంటున్న విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్, మధ్యాహ్న భోజనం ఉచితంగా అందజేస్తున్నట్లు వివరించారు. అనంతరం విద్యార్థులు, ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కొనతం పద్మలత, తాసిల్దార్ ముల్కనూరి శ్రీనివాస్, ఎంపీడీవో గుగులోతు కిషన్ నాయక్, ఎంపీఓ కూచన ప్రకాష్, అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ ఉండ్రాతి సృజన్ తేజ, డీసీఈబి కార్యదర్శి గారె కృష్ణమూర్తి, పాఠశాల ఆదర్శ కమిటీ చైర్మన్ మహ్మద్ అబిదా బేగం, గ్రామపంచాయతీ కార్యదర్శులు నిమ్మల రాజు, దామెరుప్పుల శాంతి రాజు, పాఠశాల స్థల దాత కుందూరు రత్నాకర్ రెడ్డి, కర్ర రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.