ఖిలావరంగల్, డిసెంబర్ 31: వ్యవసాయ సాగులో పంట మార్పిడికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ సత్య శారద రైతులను కోరారు. కలెక్టరేట్లో మంగళవారం జిల్లాస్థాయి ప్రణాళిక కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పంట మార్పిడిపై రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు. జిల్లాలో 28,84,866 ఎకరాల్లో రైతులు పంటలు పండిస్తున్నారన్నారు. కార్యక్రమంలో సీపీవో గోవిందరాజన్, వరంగల్, నర్సంపేట ఆర్డీవోలు సత్యపాల్‌రెడ్డి, ఉమారాణి, హెచ్‌వో సంగీతలక్ష్మి, డీఏవో అనురాధ పాల్గొన్నారు.
ఎగుమతులకు అనుకూలమైన మిరప, కాటన్, మామిడి తదితర పంటలు పండించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశం జరిగింది. జిల్లాలోని రైతులకు అవగాహన కల్పించి ఎగుమతులు పెంచేవిధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. సమీక్షలో వరంగల్ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి, డీఏవో అనురాధ, డీహెచ్‌వో సంగీతలక్ష్మి, లీడ్ బాంక్ మేనేజర్ రాజు, నాబార్డ్ డీడీఎం రవి పాల్గొన్నారు. అలాగే, హైదరాబాద్ నుంచి పలు ట్రేడర్స్, ఎంటర్ ప్రైజెస్ ప్రతినిధులు జూమ్ ద్వారా హాజరయ్యారు. రీజనల్ అథారిటీ డైరెక్టర్ ఆఫ్ జనరల్ ఫారెన్ ట్రేడర్స్ శైలజ, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ శ్రీనివాసరావు తదితరులు హాజరయ్యారు.
పోచమ్మమైదాన్: వరంగల్ ఆటోనగర్ రోడ్డులోని జువైనల్ హోం సమీపంలో సఖీ సెంటర్ భవన నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించారు. కొంతకాలంగా నిర్మాణ పనులు ఆగిపోయినందున సంబంధిత అధికారులను పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇదే ప్రాంతంలో నిర్మిస్తున్న మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి సంబంధించిన వంద ఫీట్ల రహదారి సఖీ భవనం ప్రాంతం ద్వారా వెళ్తున్న నేపథ్యంలో ఆర్అండ్బీ అధికారుల వద్ద మ్యాప్‌ను పరిశీలించారు.
సఖీ సెంటర్, జువైనల్ హోమ్‌కు ఇబ్బందులు కలుగకుండా సాధ్యమైనంత వరకు రోడ్డు మార్గాన్ని పక్కకు మళ్లించే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసేలా ప్రతిపాదనలు చేసి, ఉన్నతాధికారులకు పంపించాలని రోడ్లు భవనాల శాఖ అధికారికి కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి రాజమణి, సఖీ కేంద్రం సూపరిటెండెంట్ శ్రీలత, తహసీల్దార్ ఎండీ ఇక్బాల్, ఆర్అండ్బీ ఏఈ శ్రీకాంత్ పాల్గొన్నారు.