వరంగల్ చౌరస్తా: సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణ పనుల్లో వేగం పెంచి నిర్దేశిత గడువులోగా పనులు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు. ఆదివారం కలెక్టర్ వరంగల్ నగరంలో కొనసాగుతున్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణ పనులైన హాస్పిటల్ బ్లాక్లు, యుటిలిటి బ్లాక్, ధర్మశాల, కిచెన్, డైనింగ్, సెక్యురిటీ, లాండ్రి, ఎక్విప్మెంట్, తదితర పనుల పురోగతిని అధికారులతో సమీక్షించారు. పనులు 78 శాతం పనులు పూర్తయ్యాయని, అధికారులు కలెక్టర్ కు వివరించగా, సంబంధిత శాఖల అధికారులు సమన్వయం చేసుకొని పనుల్లో మరింత వేగం పెంచి ఎట్టిపరిస్థితుల్లోనూ వచ్చే డిసెంబర్ చివరి నాటికి పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
వివిధ మెడికల్ విభాగాలను ఏర్పాటు చేయుటకు అవసరమైన స్థలం, మెడికల్ పరికరాలు ఎక్కడ అమర్చాలో సంబంధిత మెడికల్ విభాగాల అధిపతులు క్షేత్ర స్థాయిలో భవనంలో పరిశీలించి ఖరారు చేయాలని ఎంజిఎం పర్యవేక్షకులను కలెక్టర్ ఆదేశించారు. ఈ సమీక్షలో ఆర్ అండ్ బి ఎస్ఈ నాగేంద్ర, ఎంజీఎం, కేఎంసీ సూపరింటెండెంట్లు కిషోర్, రాంకుమార్ రెడ్డి, టిజిఎంఎస్ ఐడిసి ఈఈ ప్రసాద్, డిఎం హెచ్ ఓ సాంబశివరావు, ఎల్ అండ్ టి అధికారులు తదితరులు పాల్గొన్నారు.