ఖిలావరంగల్: వరంగల్ కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి పెద్ద సంఖ్యలో వినతి పత్రాలు, ఫిర్యాదులు వచ్చాయి. జిల్లాకు చెందిన ముగ్గురు వృద్ధులు తమ కుమారులు పట్టించుకోకుండా వేధిస్తున్నారని కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దుగ్గొండి మండలం మహ్మదాపురం గ్రామానికి చెందిన యెలకంటి రాజమ్మ (75) తన ఇద్దరు కుమారులు పట్టించుకోకుండా వేధిస్తూ కొడుతున్నారని కలెక్టర్‌కు ఫిర్యాదు చేసింది. తనకున్న 3.15 ఎకరల చెలక, 36 గుంటల పొలంను ఇద్దరు కొడుకుల పేరు మీద మార్చినప్పటి నుంచి తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, తిరిగి తన పేరు మీద భూమిని రిజిస్టర్ చేయాలని ఫిర్యాదులో కోరింది. అలాగే సంగెం మండలం గవిచర్ల గ్రామానికి చెందిన ఎండీ మహబూబ్అలీ, ఇమాంబీ దంపతులు తన కుమారుడు ఎండీ రహీమోద్దీన్ మంచి చెడ్డలు చూసుకోకుండా నగరంలో నివాసముంటున్నారని ఫిర్యాదు చేశారు.
తమకున్న 4 ఎకరాల భూమిని కుమారుడి పేరు మీద పట్టా చేయించానని తెలిపారు. ప్రస్తుతం గవిచర్లలో నివాసముంటున్న ఇంటిని కూడా రిజిస్టేషన్ చేపించాలని వేధిస్తున్నట్లు తెలిపారు. ఇటీవల భార్యభర్తల మిద్దరం చనిపోయినట్లు అధికారులకు తప్పుడు సమాచారం ఇస్తూ ఇంటిని తన పేరున మార్చుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు ఫిర్యాదులో తెలిపారు. అలాగే దుగ్గొండి మండలం కేశవాపురంకు చెందిన రాంరెడ్డి (73) తన కుమారుడు తాను సంపాదించుకున్న 3.05 ఎకరాల భూమిని అక్రమంగా పట్టా చేసుకొని తన బాగోగులు పట్టించుకోవడం లేదని కలెక్టర్‌కు తెలిపారు. వయోవృద్ధుల చట్టం ప్రకారం తన కష్టార్జితమైన భూమిని తన పేరు మీద పట్టా చేయాలని కలెక్టర్‌ను కోరారు.
ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ సత్య శారద మాట్లాడుతూ గ్రీవెన్స్ సెల్లో స్వీకరించిన దరకాస్తులను సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజావాణికి వచ్చిన మొత్తం 150 దరఖాస్తులలో అధికంగా రెవెన్యూ శాఖకు చెందినవి 58 కాగా పీడీ హౌసింగ్‌కు 25, జీడబ్ల్యూఎంసీ 13, ఇతర శాఖలకు సంబంధించినవి 54 దరఖాస్తులు స్వీకరించినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జెడ్పీ సీఈవో రాంరెడ్డి, డీఆర్డీవో సల్యాదేవి, ఆర్డీవో ఉమారాణి, హౌసింగ్ పీడీ గణపతి, డీఏవో అనురాధ, డీసీవో నీరజ, డీబీసీడీవో పుష్పలత, ఏవో విశ్వప్రసాద్, వరంగల్, ఖిలావరంగల్ తహసీల్ధార్లు ఎండీ ఇక్బాల్, బండి నాగేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు.