ఖిలావరంగల్, ఫిబ్రవరి 25: వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా సరఫరా చేయాలని కలెక్టర్ డాక్టర్ సత్య శారద(Satya Sarada) అధికారులను ఆదేశించారు. మంగళవారం గ్రేటర్ వరంగల్ 34వ డివిజన్ శివనగర్‌లో జరుగుతున్న వరద కాలువ నిర్మాణ పనులను బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాఖాడేతో కలిసి పరిశీలించారు. పనుల కారణంగా తలెత్తున్న తాగునీటి సమస్యను అదిగమిస్తున్న తీరును అధికారులను, స్థానికులను అడిగి తెలుసుకున్కనారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. డ్రైన్ నిర్మాణ పనుల కారణంగా చివరి పాయింట్ వరకు నీటి సరఫరాలో కొంత అంతరాయం జరిగినప్పటికీ స్థానికుల అవసరాల మేరకు బల్దియా నుండి ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తామన్నారు.
స్ట్రాం వాటర్ డ్రైన్ నిర్మాణ పనులు జరుగుతున్న తరుణంలో నీటి సరఫరాను పునరుద్ధరణ చేశామన్నారు. ప్రస్తుత నీటి సరఫరా తీరుపై ఎప్పటికపుడు అధికారులను అడిగి తెలుసుకుంటున్నామని వివరించారు. స్ట్రాం వాటర్ డ్రైన్ నిర్మాణ పనులు పూర్తయితే శివనగర్ ప్రాంతంలో నీటి సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని కలెక్టర్ ఆశాభావం వ్యక్తం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జీ సంధ్యారాణి, బల్దియా ఎస్ఈ ప్రవీణ్‌చంద్ర, సీఎంహెచ్వో డాక్టర్ రాజారెడ్డి, డీఈ రాజ్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.