కరీమాబాద్, జూలై 22 : పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా పని చేయాలని కలెక్టర్ ప్రావీణ్య సూచించారు. శనివారం కరీమాబాద్‌లోని ప్రభుత్వ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం-ఎస్‌ఆర్‌ఆర్‌తోట సెంటర్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది సమయపాలన పాటించాలని సూచించారు. రోగులకు మెరుగైన వైద్య సేవలను అందించాలన్నారు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రజలకు వ్యాధులపై అవగాహన కల్పించాలచి, ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వసతులు ఉండేలా చూసుకోవాలన్నారు. వైద్య పరికరాలను ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు. విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆరోగ్య కేంద్రం లో అందుతున్న వైద్యంపై రోగులను అడిగి తెలుసుకున్నారు. డీఎంహెచ్‌వో వెంకటరమణ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
గొర్రెకుంటలో రైస్ మిల్లుల తనిఖీ..
గీసుగొండ: సీఎంఆర్ రైస్ సరఫరాపై మిల్లర్లు వహిస్తున్న నిర్లక్ష్యంపై కలెక్టర్ ప్రావీణ్య సీరియస్ అయ్యారు. గ్రేటర్ వరంగల్ 15వ డివిజన్ గొర్రెకుంట పూర్ణసాయి, వాసంతి రైస్ మిల్లులను శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రెండు మిల్లర్లు సీఎంఆర్‌కు రైస్ సరఫరా ఎందుకు చేయడం లేదని కలెక్టర్ వారిని ప్రశ్నించారు. రెండు మిల్లు యాజమాన్యాలకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని కలెక్టర్ సివిల్ సప్లయ్ డీఎంకు ప్రసాద్‌ను ఆదేశించారు. వారం రోజుల్లో మిల్లర్లు సీఎంఆర్‌కు రైస్ సరఫరా చేయాలన్నారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా మిల్లుర్లు నడుచుకోవాలని వివరించారు. సివిల్ సప్లయ్ అధికారులు సీఎంఆర్‌కు రైస్ సరఫరా చేస్తున్న మిల్లులపై పర్యవేక్షణ ఉండాలని సూచించారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లర్లకు పంపిణీ చేసిన వడ్ల మిల్లులో ఉన్నాయో లేదో అధికారులు పరిశీలించాలన్నారు. ప్రతి మిల్లును అధికారులు తనిఖీ చేయాలన్నారు. బియ్యం పరఫరా విషయంలో నిర్లక్ష్యంగా ఉండొద్దన్నారు. అ నంతరం గొర్రెకుంట శివారులోని హౌసింగ్ బోర్డు కాలనీలో రేషన్ దుకాణాన్ని తనిఖీ చేశారు. షాపు లో స్టాక్ వివరాలను డీలర్ కామగోని రవిని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లయ్ డీఎం ప్రసాద్, ఆసిస్టెంట్ సవిల్ సప్లయ్ అధికారి విక్రమ్, గీసుగొండ తహసీల్దార్ విశ్వనారాయణ పాల్గొన్నారు.
పక్కా ప్రణాళికతో ‘హరితహారం’
ఖిలావరంగల్: హరితహారం లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు అన్ని శాఖల అధికారులు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారని కలెక్టర్ పీ ప్రావీణ్య అన్నారు. నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు ఇచ్చిన గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా శనివారం వరంగల్ కలెక్టరేట్లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో 25,25,150 మొక్కలు నాటేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో వివిధ శాఖల ద్వారా 12,43,170 మొక్కలు నాటామని చెప్పారు. 12 ఫారెస్ట్ నర్సరీలు, 323 గ్రామపంచాయతీ నర్సరీల్లో 43, 96, 265 మొక్కలను పెంచినట్లు తెలిపారు. ఈ సీజన్‌తో పాటు వచ్చే సీజన్‌కు సరిపడా మొక్కలు అందుబాటులో ఉన్నాయన్నారు. వానకాలం పూర్త య్యే లోపు లక్ష్యానికి అనుగుణంగా మొక్కలను నాటడం పూర్తి అవుతందన్నారు. అదనపు కలెక్టర్ అశ్వినితానాజీ వాకాడే, డీఆర్డీవో పీడీ సంపత్‌రావు, ఆర్డీవో వాసుచంద్ర తదితరులు పాల్గన్నారు.