వరంగల్ చౌరస్తా, ఆగస్టు 16: ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కుగా ఉన్న ఎంజీఎం దవాఖానలో పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్య శారద వైద్యాధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆమె ఎంజీఎంహెచ్తోపాటు కాకతీయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ను సందర్శించారు. దవాఖానల్లో మౌలిక వసతులు, మందుల నిల్వలు, రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఎంజీఎం ఇన్చార్జి సూపరింటెండెంట్ డాక్టర్ చిలుక మురళి, ఆర్ఎంవో డాక్టర్ కోడం మురళి, విభాగాధిపతులను అడిగి తెలుసుకున్నారు.
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అన్ని ప్రభుత్వ హాస్పిటళ్లలో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు సమన్వయంతో ముందుకెళ్లాలని కలెక్టర్ వైద్యులకు సూచించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాతోపాటు ఉత్తర తెలంగాణవ్యాప్తంగా డెంగ్యూ, మలేరి యా, టైఫాయిడ్, విషజ్వరాలు ఏ ప్రాంతం నుంచి ఎక్కువగా నమోదవుతున్నాయనే వివరాలను అందించాలన్నారు. దవాఖానల్లో సరిపడా మందుల నిల్వలను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. హాస్పిటల్ విస్తీర్ణం ప్రకారం 120 కెమెరాలు అవసరం ఉన్నాయని, ప్రస్తు తం 45 కెమెరా లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
త్వరలో నే నిధులు మం జూరు చేస్తామన్నారు. దవాఖాన ఆస్తుల రక్షణ, రోగుల భద్రతా విషయంలో సెక్యూరిటీ సంస్థ బాధ్యత వహించాలని, జూనియర్ డాక్టర్లతోపాటు సెక్యూరిటీ, శానిటరీ, పేషెంట్ కేర్ సిబ్బందికి వేర్వేరుగా భద్రతా అంశాలపై కౌన్సెలింగ్ నిర్వహించాలని ఆదేశించారు. అనంతరం కేఎంసీ, కాకతీయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని సందర్శించి వైద్య సేవలపై ఆరా తీశారు. ఎంజీఎంహెచ్‌లో ల్యాబ్‌లో యంత్రాల కొరత తీర్చేందుకు విభాగాల వారీ గా ల్యాబ్ సేవలను సూపర్ స్పెషాలిటీకి మార్చడానికి గల అవకాశాలను పరిశీలించాలని ఆదేశించారు.