జయశంకర్ భూపాలపల్లి, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ) : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో బొగ్గు అన్వేషణకు బ్రేక్ పడింది. సింగరేణి బొగ్గు అన్వేషణ విభాగం(ఎక్స్‌ప్లోరేషన్) ఆధ్వర్యంలో తాడిచెర్ల అడవుల్లో బొగ్గు నిక్షేపాల కోసం చేసే డ్రిల్లింగ్ పనులను అటవీ అధికారులు అడ్డుకోవడంతో గత నెల రోజులుగా పనులకు ఆటంకం ఏర్పడింది. దీని వల్ల బొగ్గు నిల్వలను గుర్తించడమే గాక ఉద్యోగులకు వేతనాల రూపేనా సంస్థకు తీవ్ర నష్టం వాటిల్లుతున్నది. ఈ విషయమై సింగరేణి, అటవీ అధికారుల మధ్య చర్చలు జరిగినప్పటికీ సమస్య కొలిక్కి రాలేదు. అంతేకాదు స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు జోక్యం చేసుకుని అటవీ శాఖ అధికారులతో మాట్లాడినా ఫలితం లేదని తెలుస్తోంది.
యాజమాన్యం సింగరేణివ్యాప్తంగా 11 డివిజన్లలో సంస్థకు చెందిన అన్వేషణ విభాగంతో బొగ్గు నిల్వల అన్వేషణ పనులు కొనసాగిస్తుంది. ప్రస్తుతం 11 డ్రిల్లింగ్ యంత్రాలతో బొగ్గు నిల్వలను అన్వేషించి సంస్థకు నివేదిక ఇస్తుంది. దీని ఆధారంగా గనులను ఏర్పాటు చేస్తూ బొగ్గు వెలికితీత ప్రక్రియను ప్రారంభిస్తుంది. అయితే ప్రస్తుతం భూపాలపల్లి ఏరియాలో అన్వేషణ విభాగానికి చెందిన ఐదు డ్రిల్లింగ్ యంత్రాలు తాడిచెర్ల బ్లాక్-2లో అన్వేషణ పనులు కొనసాగిస్తున్నాయి. అయితే అడవుల్లోని చెట్లను తొలగిస్తున్నారంటూ గత నెల 7న భూపాలపల్లి డీఎఫ్‌వో వసంత వెలికితీత పనులను నిలిపివేశారు. అప్పటినుంచి పనులు ముందుకుసాగడం లేదు.
వెలికితీత పనులు నిలిపివేయడంతో పలుమార్లు స్థానిక సింగరేణి అధికారులు అటవీ శాఖ అధికారులను కలిసినా ఫలి తం లేకుండా పోయింది. దీంతో స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావును ఆశ్రయించినట్లు తెలిసింది. ఎమ్మెల్యే చెప్పి నా అటవీ అధికారులు స్పందించలేదని స మాచారం. ఈక్రమంలో అటవీశాఖ, సిం గరేణి ఉన్నతాధికారుల సమావేశం హనుమకొండ, హైదరాబాద్‌లలో జరిగినట్లు తెలిసింది. అయినప్పటికీ సమస్య పరిష్కారానికి నోచుకోలేదు. సింగరేణివ్యాప్తంగా ఏళ్ల తరబడి అన్వేషణ విభా గం పనులు కొనసాగుతున్నాయని, ఎప్పు డూ ఇలా జరుగలేదని, అడవుల్లో అన్వేషణ విభాగం పనులు కొనసాగిస్తున్న క్ర మంలో కొన్నిచెట్లు తొలగిస్తామని, అందుకుగాను అటవీ శాఖకు డబ్బులు చెల్లిస్తున్నామని సింగరేణి అధికారి ఒకరు చెప్పా రు. నెల రోజులుగా అన్వేషణ విభాగం పనులు నిలిచిపోవడంతో సంస్థకు సుమారు రూ.30 లక్షల నష్టం వాటిల్లడంతో పాటు సంస్థ నిర్దేశిత డ్రిల్లింగ్ టార్గెట్లను చేరుకోలేకపోతున్నది.
సింగరేణి సంస్థ అనుమతి లేకుండా అడవుల్లో బొగ్గు అన్వేషణ పనులు చేపడుతున్నది. ఈ క్రమం లో తాడిచెర్ల బ్లాకులో ఐదు సింగరేణి డ్రిల్లింగ్ యంత్రాలు బొగ్గు అన్వేషణ పనులు అటవీ శాఖ అనుమతి లేకుండా కొనసాగిస్తున్నాయి. దీంతో పనులు నిలిపివేశాం. ఈ విషయమై పైఅధికారులతో చర్చలు జరుగుతున్నాయి.