హనుమకొండ, డిసెంబర్ 10 : తెలంగాణ స్వరాష్ట్ర స్వప్నం ఎలాగో కోచ్ ఫ్యాక్టరీ కూడా వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రజల 40 ఏండ్ల ఆకాంక్ష అని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌కు తెలిపారు. మంగళవారం ఢిల్లీలో రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్రతోపాటు రైల్వే శాఖ మంత్రిని కలిసి కోచ్ ఫ్యాక్టరీ, రైల్వే డివిజన్ ఏర్పాటు తదితర డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని దాస్యం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రిని శాలువాతో సతరించారు. ఈ సందర్భంగా కోచ్ ఫ్యాక్టరీకి కావాల్సిన స్థలాన్ని మాజీ సీఎం కేసీఆర్ హయాంలోనే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి అప్పగించిందని రైల్వే మంత్రికి దాస్యం తెలిపారు.
కాజీపేట రైల్వే జంక్షన్‌ను డివిజన్ స్థాయికి త్వరితగతిన అప్‌గ్రేడ్ చేయాలని, అన్ని రైళ్లకు హాల్టింగ్ కల్పించాలని, ప్లాట్‌ఫామ్స్ పెంచాలని, ఎకువ బడ్జెట్ కేటాయించాలని కోరారు. వరంగల్‌లోని రైల్వే స్టేడియాన్ని అభివృద్ధి చేయాలన్నారు. కోచ్ ఫ్యాక్టరీతో పాటు డివిజన్ ఏర్పాటును సాధ్యమైనంత త్వరగా చేపట్టాలని, అలాగే స్థానికులకే 60 శాతం ఉద్యోగాలు ఇవ్వాలని కోరారు. కాజీపేట ఐటీఐ విద్యార్థులకు స్థానికంగా అప్రెంటిస్‌షిప్ కల్పించాలన్నారు.
చిరువ్యాపారులకు వెండింగ్ జోన్లు కట్టించాలని, బోడగుట్ట ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మించాలన్నారు. ఫాతిమా వద్ద నిర్మాణంలో ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు త్వరగా పూర్తయ్యేలా చూడాలని కోరారు. కేంద్ర మంత్రిని కలిసిన వారిలో కార్పొరేటర్ సంకు నర్సింగ్, నాయకులు నార్లగిరి రమేశ్, కొండ్ర శంకర్, దువ్వ కనకరాజు, బరిగెల వినయ్, గబ్బెట శ్రీనివాస్ తదితరులున్నారు.