జయశంకర్ భూపాలపల్లి, జూలై 5 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయాన్ని పండగ చేయాలనే ఉద్దేశంతో ముందుగా చెరువుల అభివృద్ధిపై దృష్టి సారించారు. మిషన్ కాకతీయ పేరుతో రాష్ట్రంలోని అన్ని చెరువుల పూడికతీత, నూతన చెరువుల నిర్మాణంపై దృష్టి సారించి నీటి నిల్వ సామర్థ్యాన్ని, భూగర్భ జలాలను పెంచారు. అన్నదాతల కళ్లలో ఆనందం నింపారు. దీంతో దో పసల్ పంటలు పండాయి. ‘మిషన్ భగీరథ’ పథకం ద్వారా ఇంటింటికీ శుద్ధి చేసిన జలాలు అందించారు.
ప్రస్తుతం సింగరేణి సంస్థలో అదే తరహాలో సీ అండ్ ఎండీ బలరాంనాయక్ ‘నీటి బిందువు.. జల సింధువు’ పేరుతో స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు. బొగ్గు గనుల నుంచి వృథాగా బయటికి వెళ్లే నీటిని ఇప్పటికే అధికారులు సమీప పంట పొలాలకు అందిస్తున్నారు. అయినా చాలా వరకు వృథాగా పోతున్నాయి. కాగా, ఈ నీటిని నిల్వ చేసి రైతులకు మరింత ఉపయోగకరంగా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసి అమలుపరుస్తున్నారు. కోల్‌బెల్ట్ వ్యాప్తంగా 11 ఏరియాల గనుల పరిసరాల్లో 62 చెరువుల నిర్మాణం, 40 చెరువుల్లో పూడికతీతకు సంస్థ శ్రీకారం చుట్టగా పనులు చివరి దశకు చేరుకున్నాయి.
సింగరేణి వ్యాప్తంగా గనులు, ఓసీల సమీపంలో భూగర్భ జలాల పెంపే లక్ష్యంగా సింగరేణి సీ అండ్ ఎండీ బలరాంనాయక్ ‘నీటి బిందువు.. జల సింధువు’ అనే కార్యక్రమాన్ని చేపట్టారు. సింగరేణి వ్యాప్తంగా చెరువుల నిర్మాణం పనులు దాదాపుగా పూర్తయ్యాయి. భూపాలపల్లి ఏరియాలో ఐదు చెరువుల తవ్వకాలు చేపట్టాం. ఇందులో నాలుగు పూర్తి కాగా ఒక చెరువు పనులు కొనసాగుతున్నాయి. అలాగే కోమటికుంట (జంగేడు), రంగ సముద్రం (గణపురం) చెరువుల పూడికతీతకు ప్రతిపాదనలు పంపాం. అనుమతి రాగానే పనులు ప్రారంభిస్తాం.
– ఏనుగు రాజేశ్వర్‌రెడ్డి, జీఎం, భూపాలపల్లి
కాకతీయులు గుట్టలపై నుంచి, ఊటల ద్వారా వచ్చే నీటిని ఒడిసిపట్టేలా చెరువులను నిర్మించి నాటి ఇంజినీరింగ్ నైపుణ్యతను మన ముందుంచారు. కాగా ప్రస్తుతం సింగరేణి వ్యాప్తంగా ఓపెన్‌కాస్టు గనుల వద్ద ఓవర్ బర్డెన్ గుట్టలను తలపిస్తున్నాయి. ఓవర్ బర్డెన్ను ఆనుకొని సమీపంలోని రైతులు, ప్రజల అవసరాలకనుగుణంగా అనువైన చోటు గుర్తించి చెరువుల నిర్మాణాన్ని సింగరేణి సంస్థ చేపట్టింది. ప్రస్తుతం వానకాలం కావడంతో తవ్విన చెరువుల్లోకి నీరు చేరి నిల్వ ఉంటుంది.
గనుల పరిసర ప్రాంతాల్లో పంటలకు సాగునీరందే అవకాశం ఉండదు. భూగర్భ జలాలు అడుగంటిపోతాయి. అలాగే తాగునీటికీ ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ క్రమంలో కోల్‌బెల్ట్ ప్రాంతాల్లో చేపట్టే చెరువుల నిర్మాణం రైతులు, ప్రజలకు ఉపశమనం కలిగించనుంది. ప్రస్తుతం ఆర్జీ-1లో 5, ఆర్జీ-2లో 5, ఆర్జీ-3లో 4, ఎన్టీపీసీలో 5, బెల్లంపల్లిలో 5, శ్రీరాంపూర్‌లో 5, మణుగూరులో 5, ఇల్లందులో 5, భూపాలపల్లిలో 5, కొత్తగూడెంలో 8, మందమర్రిలో 10 చెరువుల నిర్మాణం చేపట్టి ఇప్పటికే 90 శాతం పనులు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు.
అలాగే గనులకు రెండు కిలోమీటర్ల దూరంలో ఇప్పటికే ఉన్న 40 చెరువుల్లో పూడికతీత పనులు నిర్వహిస్తున్నారు. భూపాలపల్లి ఏరియాలోని మాధవరావుపల్లి సమీపంలో ఒకటి, పరశురాంపల్లి ఎస్వీ క్యాంపు సమీపంలో ఒకటి, రామప్పకాలనీ సమీపంలో మూడు చెరువుల నిర్మాణ పనులు చేపట్టారు. ఇందులో నాలుగు చెరువులు పూర్తి కాగా ఒకటి కొనసాగుతున్నది. మరో రెండు చెరువుల పూడికతీతకు ప్రతిపాదనలు పంపించారు.