జయశంకర్ భూపాలపల్లి, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ)/భూపాలపల్లి రూరల్/గణపురం: ‘గనుల్లో చిన్నచిన్న సమస్యలు పరిష్కరించలేరా?.. ఇంత అలసత్వ మా?’అని సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ బలరాంనాయక్ అధికారుల తీరుపై మండిపడ్డారు. శుక్రవారం ఆయన భూపాలపల్లి ఏరియాలోని బొగ్గు గనుల్లో పర్యటించారు. కేటీకే 5 ఇైంక్లెన్ గనిని పరిశీలించారు. అదేవిధంగా గణపురం మండలంలోని కేటీకే ఓసీ-3, 8 ఇైంక్లెన్ గనులను తనిఖీ చేశారు. అనంతరం అధికారులు, కార్మికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బలరాంనాయక్ మాట్లాడుతూ ఇక్కడి సమస్యలు తనకు ఎవరూ చెప్పలేదని, ఇవి జీఎం స్థాయిలోనే పరిష్కరించుకోవచ్చన్నారు.
తనకు చెప్తే నిధులకు అప్రూవల్ ఇస్తానని అన్నారు. సాండ్ స్టౌవింగ్కు 1000 క్యూబిక్ మీటర్ల ఇసుక కావాలంటున్నారు.. పక్కనే గోదావరిని పెట్టుకొని ఇసుక కొరత అంటే ఇది ముమ్మాటికీ అధికారుల పొరపాటేనని ఆగ్రహం వ్యక్తం చేశా రు. అలాగే బాటం యాష్ గురించి కేటీపీపీ ఉన్నతాధికారులతో మాట్లాడానని, మీరు ట్రాన్స్‌పోర్టింగ్, యాడ్ ఏర్పాట్లు చేశారా అని ప్రశ్నించగా అధికారుల నుంచి సరైన సమాధా నం రాకపోవడంతో ‘మీతో చాలా మాట్లాడాలి.. ఇక్కడ కాదు’ అని ఫైర్ అయ్యారు.
సింగరేణి వైద్యశాలల్లో డాక్టర్లు రిసెప్షనిస్టులుగా మారారని, కనీసం రోగుల చేయికూడా పట్టుకోవడం లేదని, వైద్యం కోసం ఏటా రూ. 500 కోట్లు ఖర్చు పెడుతున్నామని, ఇందులో నుంచి రూ. 100 కోట్లు ఖర్చు పెట్టినా అపోలో, కిమ్స్ లాంటి హాస్పిటల్‌ను హైదరాబాద్‌లో మనమే ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. ఒక ఆర్మీ డాక్టర్‌ను నియమించుకొని సింగరేణి హాస్పిటల్స్ అడ్మినిస్ట్రేషన్ బాధ్యతలను అప్పగించే ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. సింగరేణిలో కార్మికుల గైర్హాజరు శాతం పెరిగిపోతుంటే, మళ్లీ డిస్మిస్డ్ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలనే డిమాండ్ వస్తుందని, వారికి బదులుగా డైరెక్టు రిక్రూట్మెంట్ పెట్టి కొత్త వాళ్లకి ఇస్తే బాగుంటుందన్నారు.
భూపాలపల్లి ఏరియా గనులు ఏటా రూ.500 కోట్ల నష్టాల్లో కొనసాగుతున్నాయని, లోపాలను సరిదిద్దుకుంటే నష్టాలను అధిగమించవచ్చన్నారు. యంత్రాల వినియోగా న్ని పెంచి నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలని చెప్పారు. అధికారులు విధుల్లో అలసత్వాన్ని వీడి చిత్తశుద్ధితో పనిచేయాలని కోరారు. సింగరేణిలో మహిళా కార్మికులు పెరిగిపోతున్నారని, బదిలీ ఫిల్లర్ నుంచి అధికారి స్థాయి వరకు వాళ్లు అన్ని డ్యూటీలు చేస్తున్నారని, అమ్మాయిలతో సంస్థకు కొత్త కళ వచ్చిందన్నారు. అనంతరం సీఎండీ నందనవనాన్ని ప్రారంభించి, మొక్క నాటారు. సమావేశంలో డైరెక్టర్లు సూర్యనారాయణ, వెంకటేశ్వర్లు, సత్యనారాయణ, భూపాలపల్లి జీఎం రాజేశ్వర్‌రెడ్డి, కార్పొరేట్ జీఎం మనోహర్ తదితరులు పాల్గొన్నారు.