నర్సంపేట, డిసెంబర్ 2: నర్సంపేట నియోజకవర్గంలో రెండేళ్లుగా నిలిచిపోయిన అభివృద్ధి పనులపై సీఎం రేవంత్‌రెడ్డి సంబంధిత అధికారులతో వెంటనే రివ్యూ చేయాలని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం నర్సంపేటలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మొంథా తుఫాన్ ప్రభావంతో నియోజకవర్గంలో లక్ష ఎకరాల్లో పంట నష్టం జరిగితే, అధికారులు కేవలం 19,500 ఎకరాల్లో మాత్రమే అని చెప్పడం సరికాదన్నారు.
2023లో బీఆ ర్ఎస్ హయాంలో ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు నర్సంపేట ప్రభుత్వ మెడికల్ కళాశా లకు రూ.183 కోట్లతో శంకుస్థాపనలు చేశారని, దానికే మళ్లీ సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేయడానికి రావడం హాస్యాస్పదమన్నారు. రెండేళ్లుగా అభివృద్ధి ఎరుగని నర్సంపేట నియోజక వర్గ ప్రజలకు ముఖ్యమంత్రి న్యాయం చేయాలని కోరారు. రూ.7కోట్లతో పట్టణంలో గత బీఆర్ ఎస్ హయాంలో చేపట్టిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అభివృద్ధి పనులు ప్రస్తుతం కుంటుపడ్డాయని, రూ.5కోట్ల ఆడిటోరియంలో పనులు కూడా నిలిచిపోయాయని మండిపడ్డారు.
శంకుస్థాపనలే తప్ప ప్రారంభోత్సవాలు లేవని అన్నారు. 15 వేల మంది రైతుల కోసం 154 రకాల పైలట్ ప్రా జెక్ట్ చేపడితే అది ప్రస్తుత ఎమ్మెల్యే ఫిర్యాదు చేసి ఆపాడని తెలిపారు. గోదావరి జలాలతో పాకాల , మాధన్నపేట, రంగయ్య చెరువులను నింపామని, పాకాల కాల్వల ఆధునీకరణ కోసం రూ. 160 కోట్లతో ప్రతిపాదనలను సిద్ధం చేశామని పేర్కొన్నారు. మాధన్నపేట చెరువు మినీ ట్యాంక్ బండ్ కోసం కేసీఆర్ ప్రభుత్వం నిధులు ఇస్తే కేవలం మట్టి పనులు మాత్రమే చేసి బిల్లులు ఎత్తుకున్నది ప్రజలకు తెలుసని చెప్పారు. నర్సంపేటకు మెడికల్ కాలేజీ తెచ్చిన ఘనత బీఆర్ఎస్దే అని, అదేవిధంగా జిల్లా ఆస్పత్రి నిర్మాణం చేపట్టామని పేర్కొన్నారు. సీఎం మాటలు కాకుండా నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
సీఎంకు, నర్సంపేట ఎమ్మెల్యేకు మాటలు కలిసినవని చెప్పుకోవడం కోసమే ఈ పర్యటన అని పెద్ది విమర్శించారు. మహిళలకు నెలకు రూ.2500ల చొప్పున కాంగ్రెస్ ప్రభుత్వం 24 నెలలకు రూ. 60 వేలు బాకీ పడిందన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా నాయకులు రాయిడి రవీందర్ రెడ్డి, నల్లా మనోహర్‌రెడ్డి, ముని గాల వెంకట్‌రెడ్డి, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు నాగెళ్లి వెంకటనారాయణగౌడ్, బీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు గోనె యువరాజ్, మాజీ కౌన్సిలర్లు మండల శ్రీనివాస్, శివరాత్రి స్వామి, గంధం చంద్రమౌళి, పట్టణ ఉపాధ్యక్షుడు పెండ్యాల యాదగిరి, నాయకులు దేవోజు సదానందం, సాంబయ్య, అనిల్, నాగరాజు, దొమ్మాటి సంతోష్, దేవోజు హేమంత్ తదితరులున్నారు.