జయశంకర్ భూపాలపల్లి, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ) : సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రుల మేడిగడ్డ టూర్లో కొత్తదనమేమీ లేదు. గతంలో రెండుసార్లు వచ్చినప్పుడు పాడిన పాటే పాడారు. సోమవారం మంత్రులు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, వివేక్‌తో కలిసి సీఎం మేడిగడ్డ బరాజ్‌ను సందర్శించారు. గోదావరిలో దిగి దెబ్బతిన్న పియర్లను పరిశీలించారు. సుమారు అరగంటపాటు వాటి చుట్టూ తిరిగారు. అక్కడి నుంచి మేడిగడ్డ వద్ద గల ఎల్ అండ్ టీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి మాట్లాడారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో రూ. లక్షల కోట్ల అవినీతి, అక్రమాలు జరిగాయని, మేడిగడ్డ బరాజ్ మొత్తం కుప్పకూలిపోయిందని, పనికి రాకుండాపోయిందని నోటికి వచ్చిన కూతలు కూశారు. ఇరిగేషన్ శాఖ అధికారులు కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ. 93 వేల కోట్లు ఖర్చు చేశామని ఆధారాలతో పలుమార్లు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అయినా సీఎం, మంత్రులు మళ్లీ పాత పాటే పాడుతూ బీఆర్ఎస్ను అభాసుపాలు చేసేందుకు అష్టకష్టాలు పడ్డారు. చివరికి బరాజ్‌ను రిపేరు చేసి వినియోగంలోకి తీసుకొస్తామంటూ ముగించారు.
కాగా సీఎం మాట్లాడడం పూర్తయ్యాక విలేకరులు ప్రశ్నలు అడిగేందుకు సిద్ధంకాగా ఏమీ మాట్లాంకుండా అక్కడి నుండి జారుకున్నారు. ఎల్ అండ్ టీ అతిథి గృహంలో సమావేశం కోసం ఏర్పాటు చేసిన తాత్కాలిక గది సరిపోకపోవడంతో అధికారుల వైఖరిపై కొద్దిసేపు విలేకరులు ఆందోళన చేశారు. ఇదిలా ఉండగా శనివారం బీఆర్ఎస్ బృందం మేడిగడ్డ సందర్శనకు వెళ్లగా కేవలం 5 కార్లకు మాత్రమే అనుమతినిచ్చిన పోలీసులు సీఎం పర్యటలో ఇష్టారాజ్యంగా వాహనాలకు అనుమతినివ్వడంపై బీఆర్ఎస్ నాయకులు మండిపడుతున్నారు.
సీఎం రేవంత్‌రెడ్డి తన మంత్రులతో కాళేశ్వరం, మేడిగడ్డ టూర్‌కు ఇలా వచ్చి.. అలా వెళ్లిపోయారు. బరాజ్ రిపేరుకు సంబంధించి ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కేవలం మరమ్మతు చేస్తామంటూ దాటవేశారు. సాయంత్రం 4 గంటలకు కాళేశ్వరం చేరుకున్న సీఎం అక్కడ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. 4:51 గంటలకు మేడిగడ్డకు చేరుకొని బరాజ్‌ను పరిశీలించిన అనంతరం అక్కడే విలేకరుల సమావేశంలో మాట్లాడి కాటారం మండలం నస్తూర్పల్లిలో నిర్వహించిన బహిరంగ సభకు హాజరయ్యారు. సుమారు రెండు గంటలు ఆలస్యంగా సభకు సీఎం హాజరుకావడంతో జనం వెనుదిరిగి వెళ్లిపోయారు. తాగునీటి కోసం జనం ఇబ్బందులు పడ్డారు.