లింగాలఘనపురం, ఏప్రిల్ 21 : ఇప్పుడు.. అప్పుడు అంటూ రైతు భరోసాపై కాలం వెల్లదీసిన సీఎం రేవంత్‌రెడ్డి చివరికి అరచేతిలో స్వర్గం చూపించాడని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెండో విడత రైతు భరోసా నిధులు విడుదల చేశానంటూ సీఎం ప్రకటించగానే రైతులు ఎంతో సంబురపడ్డారు. మొదటి విడతలో ఎకరంలోపు భూమి ఉన్న రైతులకు నిధులు వేయ గా, రెండో విడతలో 5 ఎకరాలలోపు భూమి ఉన్న రైతులకు భరోసా నిధులు వేస్తామని ప్రకటించారు. దీంతో 5 ఎకరాల భూములున్న రైతు లు తమకు రూ.30వేలు వస్తాయని ఎంతో ఆశ తో ఎదురు చూశారు.
సీఎం ప్రకటన వెలువడగానే రైతులంతా ‘ఎప్పుడు తెల్లారుతుందా.. బ్యాంకులు తెరవగానే పైసలు తెచ్చుకుందామని తెగ సంతోషపడ్డారు. కానీ, తీరా బ్యాంకుకు వెళ్లగా, ఎకరానికి రూ.6వేలు మాత్రమే జమవడంతో తీవ్రంగా కలతచెందారు. నాకే ఇలా అయ్యిందా.. అంటూ పక్క రైతులను ఆరా తీసి మౌనంగా రోదించారు. ‘కేసీఆర్ ఉన్నప్పుడు గిట్ల చేయలేదు… ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు ఒకేసారి రైతుబంధు డబ్బులు వేశా రు’ అని కాంగ్రెస్ పార్టీకి చెందిన రైతులే రేవంత్‌రెడ్డిపై నిప్పులు చెరుగుతున్నారు.
ఓటు వేసి.. వేయించి తప్పుచేశాం..
రేవంత్‌రెడ్డి గిట్ల చేస్తడంటే నేను ఓటు వేసేవాడినేకాదు.. ఓటు సైతం వేయించేవాడినేగాదు. నాకు 4.36 ఎకరాల భూమి ఉన్నది. 5 ఎకరాలలోపు ఉన్న భూమికి రూ.29,4 00 వస్తాయనుకున్నా.. ఎకరానికే నిధులుపడడంతో కంగుతిన్నా. రుణమాఫీ రూ.2లక్షలు అన్నడు. ఇప్పటి వరకు కాలేదు. కేసీఆరే బాగుండె.. ఎన్ని ఎకరాలుంటే అన్ని ఎకరాలకు ఒకేసారి డబ్బులు ఇచ్చిండు. ఓ దొంగను తీసుకొచ్చి కుర్చీపై కూసోబెట్టినం. ముందుముందు ఇంకెలా ఉంటుందో..
– గంగుల మల్లారెడ్డి, రైతు, లింగాలఘనపురం
కోతల డబ్బులు తీరుతాయనుకున్నా..
వరి కోతలకు మిషన్‌కు గంటకు రూ.2500 చొప్పున ఖర్చు చేశా. ధాన్యం కొనుగోలు కేంద్రానికి తరలించేందుకు ట్రాక్టర్లకు కిరాయి ఇచ్చా. దాదాపు రూ.20 వేలు అప్పులు తెచ్చి ఖర్చుచేశా. ధాన్యం ఇంకా అమ్ముడు పోలేదు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో ఇంకా కొనుగోళ్లు ప్రారంభం కాలేదు. ఈ పరిస్థితిలో రైతు భరోసా అండగా ఉంటుందనుకున్నా.. కానీ, ఎకరానికే డబ్బులు వేశాడు.
– మంద సత్తిరెడ్డి, రైతు, లింగాలఘనపురం