పరకాల, నవంబర్ 16 : ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం పరకాలకు సీఎం కేసీఆర్ రానున్నారు. పట్టణంలోని వెల్లంపల్లి రోడ్డులో నిర్వహించనున్న ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొననున్నారు. సీఎం సభ కోసం పట్టణ శివారులో 12 ఎకరాల స్థలంలో ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి. సభకు సుమారు 70 వేల నుంచి లక్ష మంది బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలు రానున్న నేపథ్యంలో వారికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. పెద్దఎత్తున వేదికను సిద్ధం చేస్తున్నారు. సభా స్థలం పక్కనే హెలిప్యాడ్‌ను నిర్మించారు.
వాహనాల పార్కింగ్‌కు దామెర చెరువు కట్ట, పశువుల సంత, వెల్లంపల్లిలోని ప్రైవేట్ స్థలాన్ని నిర్వాహకులు ఎంపిక చేసి చదును చేశారు. కాగా, బహిరంగ సభ ఏర్పాట్లను వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా పరిశీలించి, అధికారులు, నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. సీపీ సీఎం సభ కోసం ప్రత్యేక బందోబస్తు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏసీపీ కిశోర్‌కుమార్, సీఐ జూపల్లి వెంకటరత్నం పాల్గొన్నారు.