వరంగల్, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ): వరంగల్ జిల్లాలో రైతుల నుంచి మక్కలను కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయని మార్క్‌ఫెడ్ సంస్థ జిల్లా మేనేజర్ మహేశ్ వెల్లడించారు. సోమవారం లేదా మంగళవారం కొనుగోళ్లు ప్రారంభించనున్నట్లు తెలిపారు. కొనుగోలు చేసిన మక్కలను వ్యవసాయ మార్కెట్ కమిటీ గోదాముల్లో నిల్వ చేయనున్నట్లు చెప్పారు. మక్కల రవాణాకు ట్రాన్స్పోర్ట్ టెండర్ల ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు వివరించారు. జిల్లాలో మక్కల కొనుగోలుకు చేపట్టిన చర్యలను మహేశ్ ‘నమస్తే తెలంగాణ’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.
నమస్తే : మక్కల కొనుగోలు కోసం మీ ప్రణాళిక?
మహేశ్ : జిల్లాలో రైతులు సుమారు 88 వేల ఎకరాల్లో మక్కజొన్న పంట సాగుచేశారు. 1.66 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని వ్యవసాయశాఖ అంచనా వేసింది. ఈ మేరకు జిల్లాలో 20 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. చెన్నారావుపేట, దుగ్గొండి, నాచినపల్లి, ఖానాపురం, నల్లబెల్లి, నర్సంపేట, మహేశ్వరం, నెక్కొండ, తోపనపల్లి, ఊకల్, మొగిలిచర్ల, వంచనగిరి, వరంగల్ ఏఎంసీ, ఆరెపల్లి, సంగెం, కాపులకనపర్తి, పర్వతగిరి, ఏనుగల్, రాయపర్తి, ఇల్లందలో కొనుగోళ్లు చేస్తాం.
నమస్తే : కొనుగోలు కేంద్రాలను నిర్వహించే ఏజెన్సీలు?
మహేశ్ : మక్కల కొనుగోలు కేంద్రాలు పీఏసీఎస్‌లు, ఓడీసీఎంఎస్‌కు అప్పగించాం. ఈ ఏజెన్సీలు ఆయా కొనుగోలు కేంద్రాల్లో రైతుల నుంచి ప్రభుత్వ మద్దతు ధర రూ. 1962తో మక్కలను కొనుగోలు చేస్తాయి. కాపులకనపర్తి ఎఫ్ఎస్సీఎస్, మహేశ్వరం, తోపనపల్లి ఓడీసీఎంఎస్, మిగతా కొనుగోలు కేంద్రాలను పీఏసీఎస్‌లు నిర్వహిస్తాయి.
నమస్తే : మక్కలను ఎక్కడ నిల్వ చేస్తారు?
మహేశ్ : రైతుల నుంచి కొనుగోలు చేసిన మక్కలను వ్యవసాయ మార్కెట్ కమిటీ గోదాముల్లో నిల్వచేస్తాం. నర్సంపేట, చెన్నారావుపేట, నెక్కొండ, దుగ్గొండి, వెంకటాపూర్, గొర్రెకుంట, ఎనుమాముల మార్కెట్ కమిటీల గోదాములను గుర్తించాం. కొనుగోలు చేసిన మక్కలను నేరుగా ఇక్కడికి తరలిస్తాం.
నమస్తే : మక్కల రవాణా కోసం జరుగుతున్న ఏర్పాట్లు ఏమిటీ?
మహేశ్ : కొనుగోలు కేంద్రాల నుంచి మక్కలను గోదాముల వరకు 3 సెక్టార్ల ద్వారా రవాణా చేయడానికి నిర్ణయించాం. నర్సంపేట, చెన్నారావుపేట, నెక్కొండ మండలాల్లోని కొనుగోలు కేంద్రాలను ఒక సెక్టారు, దుగ్గొండి, నల్లబెల్లి, ఖానాపురం మండలాల్లోని కొనుగోలు కేంద్రాలు ఒక సెక్టారు, గీసుగొండ, సంగెం, రాయపర్తి, వర్ధన్నపేట, పర్వతగిరి, ఖిలావరంగల్, వరంగల్ మండలాల్లోని కొనుగోలు కేంద్రాలను ఒక సెక్టార్‌గా గుర్తించాం. ఆయా సెక్టార్ పరిధిలో ఉన్న వ్యవసాయ మార్కెట్ కమిటీ గోదాములను మక్కలను తరలిస్తాం. కాంట్రాక్టర్ల ఎంపిక కోసం టెండర్ల ప్రక్రియ చేపట్టాం. సోమవారం టెండర్లను ఖరారు చేస్తాం.
నమస్తే : ఎప్పటినుంచి కొనుగోళ్లు ప్రారంభిస్తారు?
మహేశ్ : ప్రభుత్వ ఆదేశాల మేరకు మక్కల కొనుగోలుకు దాదాపు ఏర్పాట్లు పూర్తి కావచ్చాయి. సోమవారం లేదా మంగళవారం నుంచి ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. రైతులు తమకు అందుబాటులో ఉన్న సెంటర్‌కు మక్కలను తీసుకురావాలి. ప్రతి కొనుగోలు కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నాం. మక్కల కొనుగోలుపై సెంటర్ నిర్వాహకులకు సోమవారం శిక్షణ ఇస్తాం.