చీమలపుట్టల్లోంచి బారులు తీరినట్టు.. నలుదిక్కుల నుంచి దండులా కదిలివచ్చిన లక్షలాది మందితో భూపాలపల్లి, ములుగు ప్రాంతాలు పోటెత్తాయి. తమ అభిమాన నేత ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కనులారా చూసి, ఆయన మాటలు వినాలని జోరువానను సైతం లెక్కచేయకుండా అశేషంగా తరలివచ్చిన జనాలతో రెండు నియోజకవర్గ కేంద్రాలు పులకించిపోగా, అభ్యర్థులు గండ్ర వెంకటరమణారెడ్డి, బడే నాగజ్యోతి ఉప్పొంగిపోయారు. ఓ వైపు కళాకారుల ఆటాపాటలు, జై తెలంగాణ.. జై కేసీఆర్ నినాదాలతో ఆద్యంతం ఉర్రూతలూగిన సభికులతో ములుగు, భూపాలపల్లి ప్రజా ఆశీర్వాద సభలు కనీవినీ ఎరుగని రీతిలో విజయవంతం అయ్యాయి. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీతో ప్రజల్లో ఆనందం విల్లివిరియగా, గెలుపు ఖాయం అనే ధీమాతో బీఆర్ఎస్ శ్రేణులు రెట్టింపు ఉత్సాహంతో ఊగిపోయాయి.
భూపాలపల్లి అభివృద్ధి బాధ్యత నాదే భూపాలపల్లి బీఆర్ఎస్ అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డి గెలుపు బాధ్యత మీదే.. ఇప్పటికే నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశాం. ఇకపై మరింత అభివృద్ధి చేసే బాధ్యత నాదే.. పొద్దటి నుంచి భూపాలపల్లిలో జోరు వర్షం కురుస్తున్నా ఇంత పెద్ద ఎత్తున జనం సభకు హాజరై ఇంతసేపు నా కోసం ఎదురుచూశారంటే గండ్ర వెంకటరమణారెడ్డి గెలుపు ఖాయమైందని అర్థమవుతోంది. సింగరేణి సంస్థ వంద శాతం మనకే ఉండేది. కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ అనుబంధ ఐఎన్టీయూసీ నాయకులు సింగరేణిని నిండా ముంచిన్రు. సింగరేణిని కాపాడడం చేతకాక కేంద్రం దగ్గర అప్పులు తెచ్చి, అవి తీర్చడం చేతకాక 49శాతం వాటాను కేంద్రానికి అప్పగించిన్రు. లేకుంటే సింగరేణి మన రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోనే ఉండేది. సంస్థలో అనాదిగా ఉన్న డిపెండెంట్ ఎంప్లాయిమెంట్‌ను సైతం పోగొట్టి కార్మికులను ఆగం చేశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతే సింగరేణిని కాపాడే బాధ్యతను మా భుజాలపై వేసుకున్నాం. మా యూనియన్ నేతలు వెంకట్రావు, మిర్యాల రాజిరెడ్డి నా దగ్గరకు వచ్చి సింగరేణిలో డిపెండెంట్ ఎంప్లాయిమెంట్‌ను కొనసాగించాలని, కార్మికులకు మేలు చేయాలని అడిగారు. వాటిని కారుణ్య నియామకాల పేరుతో తిరిగి తీసుకువచ్చి 15వేల మంది కార్మికుల పిల్లలకు ఉద్యోగాలిచ్చాం. మీ ఎమ్మెల్యే కోరినట్లు భూపాలపల్లికి ఇంజినీరింగ్ కళాశాల ఇస్తాం. కొత్తగా ఏర్పడ్డ గోరికొత్తపల్లి మండల అభివృద్ధి బాధ్యత నాదే. గతంలో అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్న భూపాలపల్లిని మధుసూదనాచారి చాలా అభివృద్ధి చేశారు. అనంతరం గండ్ర అభివృద్ధిని పరుగులు పెట్టించారు. గండ్రను మరోసారి గెలిపిస్తే మరింత అభివృద్ధి చెందుతది. ఇచ్చిన మాట ప్రకారం భూపాలపల్లిని జిల్లాగా చేసి ప్రొఫెసర్ జయశంకర్ సార్ పేరు పెట్టినం. ఎన్నికలంటే ఎవరో ఒకరు పోటీ చేస్తరు.. ఎవరో ఒకరు గెలుస్తరు.. ఎవరు గెలిస్తే అభివృద్ధి అవుతుందనే విషయాన్ని ఆలోచించుకోవాలె. ఆదమరిచి ఓటు వేస్తే అభివృద్ధి ఆగిపోతుంది. గండ్ర వెంకటరమణారెడ్డి గెలవాలి, లేకుంటే కిందమీదైతది.’
బీఆర్ఎస్ అభ్యర్థి బడే నాగజ్యోతి ఆధ్వర్యంలో ములుగులోని తంగేడు మైదానంలో, భూపాలపల్లి అభ్యర్థి, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో కేటీకే-5 ఇైంక్లెన్ ఆవరణలో తలపెట్టిన ప్రజా ఆశీర్వాద సభలు జనసంద్రాన్ని తలపించాయి. రెండు చోట్లా అంచనాకు మించి ప్రజలు తరలిరావడంతో ఆ ప్రాంతాలన్నీ జాతరను తలపించాయి. ఐదు సంవత్సరాలుగా అధికార పార్టీ ఎమ్మెల్యే లేకపోవడంతో ప్రజలు కోల్పోయిన మంచి, సీఎం కేసీఆర్ చేసిన ప్రగతి శుక్రవారం ములుగు జిల్లాకేంద్రంలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో కళ్లకు కట్టినట్లు కనిపించింది. సభకు లక్ష మంది వస్తారని అంచనా వేయగా అధినేతను చూసేందుకు అంతకుమించి రావడంతో ఎటుచూసినా జనప్రవాహమే కనిపించింది. కిలోమీటర్ల దాకా ఫ్లెక్సీలు, భారీ కటౌట్లతో ములుగు, భూపాలపల్లి పట్టణాలు గులాబీమయమ్యాయి. నలుమూలలోని భారీగా వచ్చిన జనంతో అంబేద్కర్ సెంటర్ కిక్కిరిసిపోయింది. డప్పుచప్పుళ్లు, డోలు వాయిద్యాలు, మహిళల కోలాటాల నడుమ భారీ ర్యాలీగా సభకు చేరుకున్నారు. భూపాలపల్లిలో మిట్టపల్లి సురేందర్, ములుగులో సింగర్ మధుప్రియ, కవి, గాయకుడు మానుకోట ప్రసాద్‌లు తమ ఆటాపాటలతో ప్రజలను ఊర్రూతలూగించగా మంత్రి సత్యవతిరాథోడ్, ఎంపీ మాలోత్ కవిత, అభ్యర్థి బడే నాగజ్యోతి, మహిళా ప్రజాప్రతినిధులు, కళాకారులతో కలిసి నృత్యం చేసి ఉత్సాహం నింపారు.
మిట్టపల్లి పాడిన ‘అటు పొద్దు ఇటు పొడిచినా’, కళాకారిణి రామక్క పాటకు ప్రజలు ఉత్సాహంగా స్టెప్పులేశారు. సీఎం రాక కోసం ప్రజలు ఎదురు చూస్తున్న క్రమంలో మధ్య మధ్యలో వర్షం కురుస్తున్న ప్రజలు అడుగు పక్కకు వేయకుండా తమ వెంట తెచ్చుకున్న గొడుగులను, సీఎం కేసీఆర్ ప్లేకార్డులను తలలపై పెట్టుకొని ఆకాశ మార్గాన వచ్చే సీఎం కేసీఆర్ కోసం ఎదురుచూశారు. 3:43గంటలకు హెలిక్యాప్టర్ లాండ్ కాగానే జై తెలంగాణ, జై కేసీఆర్ అంటూ నినాదాలతో అపూర్వ స్వాగతం పలికారు. భూపాలపల్లిలోనూ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చారు. మధ్యాహ్నం 3గంటల వరకు వర్షం కురుస్తూనే ఉండగా, సభ నిర్వహణ సాధ్యమేలా పార్టీ శ్రేణుల్లో సందేహం వ్యక్తమైంది. కానీ అభిమానం ముందు అన్నీబలాదూర్ అన్నట్టు సభకు లక్షకు పైగా వచ్చి చేరుకున్నారు. కుర్చీలు సరిపోక చాలామంది నిలబడే సీఎం ప్రసంగాన్ని వీక్షించారు. మధ్యలో వర్షం మొదలవడంతో కేసీఆర్ తన ప్రసంగాన్ని త్వరగా ముగించారు. కేసీఆర్ తన ప్రసంగంలో ములుగు సంఘటన ప్రేరణతోనే కల్యాణలక్ష్మి పురుడు పోసుకుందని గుర్తు చేసి ప్రజలతో పంచుకున్నారు. కేసీఆర్ ప్రసంగం ముగిసేంత వరకు ప్రజలు తమ చూపును పక్కకు తిప్పకుండా శ్రద్ధగా వింటూ సందర్భానుసారం ఈలలు, కేరింతలు కొట్టారు.