తొర్రూరులో మంగళవారం నిర్వహించిన ‘ప్రజా ఆశీర్వాద సభ’కు వేలాదిగా తరలివచ్చిన ప్రజలను చూసి పోరాటాల పురిటిగడ్డ పాలకుర్తి పులకించిపోయింది. బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌కు ప్రజలు బ్రహ్మరథం పట్టగా, మంత్రి, బీఆర్ఎస్ అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్‌రావు పిలుపుతో పోటెత్తిన అభిమానులు, ప్రజలను చూసి బీఆర్ఎస్ శ్రేణుల్లో నూతనోత్సాహం నిండింది. ముఖ్యమంత్రి ప్రసంగిస్తున్నంత సేపు ఈలలు, చప్పుట్లతో సభికుల నుంచి మద్దతు వెల్లువెత్తింది. పాలకుర్తి నియోజకవర్గ దారులన్నీ గులాబీమయం కాగా, సభావేదికపై కళాకారుల ఆటపాటలు, ప్రదర్శనలు కట్టిపడేశాయి.
తొర్రూరు, నవంబర్ 14 : మంత్రి దయాకర్‌రావుకు మద్దతుగా పాలకుర్తి నియోజకవర్గ ప్రజలు ‘లక్ష’ణంగా తరలివచ్చి తొర్రూరు సభను విజయవంతం చేశారు. ‘మా ఓట్లు మీకే’నంటూ సీఎం కేసీఆర్‌ను, మంత్రి దయాకర్‌రావును ఆశీర్వదించారు. తొర్రూరులో మంగళవారం నిర్వహించిన సభ గులాబీ వనాన్ని తలపించింది. పాలకుర్తి నియోజకవర్గ దారులన్నీ గులాబీమయమై బీఆర్ఎస్కు ఉన్న ఆదరణకు అద్దం పట్టాయి. సభకు అంచనాకు మించి ప్రజలు తరలిరావడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ నెలకొంది. తొర్రూరు సభలో ప్రజలు కనిపించిన తీరును చూసి ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం ముగ్ధులయ్యారు. తన ప్రసంగంలో కూడా ‘నేను ముందే వచ్చిన.. జనం ఇంకా చేరుకోవాల్సి ఉందని దయాకర్‌రావు బాధపడ్డడు.. కని సభలో ఎంతమంది ఉన్నారో అంతకంటే ఎక్కువ మంది బయట రోడ్డు వెంట వస్తున్న తీరును హెలికాప్టర్ నుంచి చూసి సంబురపడ్డ. లక్ష మంది దాకా సభకు రావడం దయాకర్‌రావుపై అభిమానానికి నిదర్శనం’ అని చెప్పడంతో ఒక్కసారిగా సభికులు కేరింతలు కొట్టారు. కేసీఆర్ ప్రసంగం ప్రారంభంలోనే యువకులు పెద్ద ఎత్తున ఈలలు వేస్తూ మద్దతు పలికారు. ప్రత్యేకించి అనేక మంది వృద్ధులు కాలినడకన తరలిరావడం కనిపించింది. పాలకుర్తి నియోజకవర్గాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీర్వాదంతో ఎలా అభివృద్ధి చేశారో మంత్రి దయాకర్‌రావు తన ప్రసంగంలో వివరించిన తీరు, ఈ దఫా విజయం సాధించగానే ఏమేం పనులు చేయాలో సీఎం కేసీఆర్ ఎలాంటి మంజూరీలు ఇవ్వాలో అభ్యర్థించిన తీరు ఆకట్టుకున్నది.
మంత్రి దయాకర్‌రావును చెక్‌డ్యాంల రావు అని అభివర్ణిస్తూ సీఎం కేసీఆర్ కితాబునివ్వడంతో సభలో నవ్వులు వెల్లివిరిశాయి. నియోజకవర్గ అభివృద్ధికి ఆయన పడుతున్న కష్టం మామూలుది కాదని, మూడుసార్లు వర్ధన్నపేట ఎమ్మెల్యేగా, మూడుసార్లు పాలకుర్తి ఎమ్మెల్యేగా వరుస విజయాలతో ఈ ప్రాంతాల అభివృద్ధికి పని చేస్తూనే అవకాశం దొరికినప్పుడల్లా ఆకేరు, పాలేరు, యశ్వంతాపూర్ వాగులపై చెక్‌డ్యాంలకు నిధులు మంజూరు చేయించుకుని 35 నుంచి 40 చోట్ల నిర్మాణాలు చేయించాడని గుర్తుచేశారు. ‘మేమంతా ఆయనను దయాకర్‌రావు కాదు చెక్‌డ్యాంల రావు అని పేరు పెట్టుకున్నం’ అని సీఎం చెప్పగానే సభలో నవ్వులు విరబూశాయి. ‘ఆమెరికా నుంచి పాలకుర్తికి వచ్చి నాలుగు రోజుల మురిపెం చూపెట్టి టోపిపెట్టి పోయేటోళ్లను జనం పట్టించుకోవద్దు, కరోనా వంటి కష్టకాలంలో మీ వెంట ఉండి ధైర్యాన్నిచ్చిన దయాకర్‌రావును భారీ మెజార్టీతో గెలిపించాలె’ అని ప్రజలకు ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. సభ ముగిసిన తర్వాత వేలాది మంది జన సందోహం నడుమ దయాకర్‌రావు తన వాహనం పైనుంచి అభివాదం చేస్తూ ముందుకు సాగారు. గంటకు పైగా సభా ప్రాంగణం నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు వాహనాల ర్యాలీ కొనసాగగా దయాకర్‌రావు వాహనం ముందు యువకులు, గిరిజన మహిళలు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన బీఆర్ఎస్ శ్రేణులు డ్యాన్సులు చేస్తూ ‘దయాకర్‌రావు గెలుపు ఖాయం’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.