‘బీఆర్ఎస్ అభ్యర్థి కడియం శ్రీహరిని గెలిపించండి.. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే స్టేషన్ ఘన్‌పూర్‌ను మున్సిపాలిటీ చేస్తం.. ఆటో కార్మికులను ఆదుకుంటం.. ఆటోలకు ఫిట్నెస్, పర్మిట్ ట్యాక్స్ జీరో చేస్తం.. శ్రీహరికి గొప్ప చరిత్ర ఉన్నది.. ఆయనను గెలిపిస్తే మీరు అడిగినవన్నీ ఇచ్చే బాధ్యత నాది’ అని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. స్టేషన్‌ఘన్‌పూర్ శివారు శివారెడ్డిపల్లిలో సోమవారం నిర్వహించిన నియోజకవర్గ ప్రజా ఆశీర్వాద సభకు కనీవినీ ఎరుగని తీరులో తరలివచ్చిన ప్రజలనుద్దేశించి బీఆర్ఎస్ అధినేత మాట్లాడారు. శ్రీహరికి టికెటిచ్చినా డాక్టర్ రాజయ్యను చిన్నచూపు చూడబోమని, ఆయనకు కూడా బ్రహ్మాండమైన హోదా ఉంటుందని, మంచి పదవిలో ప్రజాసేవలోనే ఉంటారని, అందులో ఎలాంటి అనుమానం వద్దని సీఎం స్పష్టం చేశారు. ‘శ్రీహరి మంత్రిగా ఉన్నప్పుడు, లేనప్పుడు ఘనపురం అభివృద్ధి, రైతులు, ప్రజల కోసం ఎట్లా తండ్లాడిండో మీ అందరికీ తెలుసు.. ఆయనను గెలిపిస్తే ఘనపురం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది’ అని స్పష్టం చేశారు.
జనగామ, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ) : జనగామ కొత్త జిల్లాగా ఆవిర్భవించి స్టేషన్‌ఘన్‌పూర్ రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఏర్పాటై అభివృద్ధికి అడుగులు పడుతున్న నియోజకవర్గంపై ముఖ్యమంత్రి కేసీఆర్ మరిన్ని వరాలు కురిపించారు. బీఆర్ఎస్ అభ్యర్థి కడియం శ్రీహరి ఆధ్వర్యంలో సోమవారం స్టేషన్‌ఘన్‌పూర్ శివారులో కనీవినీ ఎరుగనిరీతిలో నిర్వహించిన నియోజకవర్గ ప్రజా ఆశీర్వాద సభకు గులాబీదండు కట్టి రాగా, వారిని ఉద్దేశించి ముఖ్యమంత్రి ప్రసంగించారు. కడియం శ్రీహరి కోరిన వెంటనే స్టేషన్ఘన్పూర్ను మున్సిపాలిటీగా చేసేందుకు ఓకే చెప్పారు. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అప్‌గ్రేడ్ ప్రక్రియ ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపిస్తే అడిగినవన్నీ ఇచ్చే బాధ్యత తనదని, కడియం శ్రీహరి చరిత్ర చాలా పెద్దదని, ఆయన వస్తే నియోజకవర్గం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుందన్నారు. డాక్టర్ తాటికొండ రాజయ్య మంచి హోదా, మంచి పదవిలో ప్రజాసేవలోనే ఉంటారని, దాంట్లో ఎలాంటి అనుమానం వద్దని స్పష్టం చేశారు. శ్రీహరి కోరినవి గొంతెమ్మ కోరికలు కావని, అవి తీర్చలేనివి కావని ప్రజల పక్షాన నిలబడే మంచి నాయకుడు, ఉత్తమమైన నాయకుడు శ్రీహరిని గెలిపించే బాధ్యత స్టేషన్‌ఘన్‌పూర్ ప్రజలదేనన్నారు.
ఆర్టీసీ బిల్లు పాస్ చేసినా గవర్నర్ ఆలస్యం చేయడం వల్ల అమలులో కొంత ఆలస్యమైందని, ఎన్నికలైన తెల్లారి, మర్నాడు ఆర్టీసీ ఉద్యోగులను రెగ్యులైజ్ చేసి ప్రభుత్వ ఉద్యోగులుగా చేస్తామని చెప్పారు. దేశం మొత్తంలో ఆటోరిక్షాలకు ట్యాక్స్ ఉంటుందని, ఒక్క తెలంగాణలోనే పన్నులేదన్న సంగతి గుర్తించాలన్నారు. పేద వర్గాలకు చెందిన ఆటో కార్మికులకు ఇంకో పెద్ద సమస్య ఉందని, ఫిట్నెస్ కోసం ఏడాదికి రూ.1200 కడుతున్నారని, అది కూడా ఎన్నికల తర్వాత రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వానికి వందకోట్ల నష్టం వచ్చినా ఫర్వాలేదని, ఇకపై ఆటోలకు ఫిట్నెస్, పర్మిట్ ట్యాక్స్ ‘జీరో’ చేస్తామని స్పష్టం చేశారు. ఐదారు లక్షల మంది ఆటో కార్మికులకే కాకుండా ప్రతి వర్గం వారిని ఆదుకుంటామన్నారు. లిఫ్ట్ వచ్చింది సరిపోయింది కాబట్టి లింగంపల్లి రిజర్వాయర్ అవసరం పడదని, కాబట్టి ఎక్కడ అవసరమో అక్కడ కట్టుకుందామని చెప్పారు. మిగతా భూములకు కూడా నీళ్లు వచ్చేలా చేద్దామన్నారు. శ్రీహరిని భారీ మెజార్టీతో గెలిపిస్తే స్టేషన్‌ఘన్‌పూర్ అద్భుత ప్రగతి సాధిస్తుందని, ఎన్నికల తర్వాత ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసుకుందామని చెప్పారు.
స్టేషన్‌ఘన్‌పూర్ : బీఆర్ఎస్ ప్రభుత్వం నియోజకవర్గంలో ఏడు ప్రాజెక్టులు పూర్తి చేసి వ్యవసాయానికి పుష్కలంగా సాగునీరు అందిస్తోందని, లింగంపల్లి రిజర్వాయర్ అవసరం లేదని, దేవాదుల ద్వారా కొత్త కాలువల ఏర్పాటుకు నిధులు కేటాయించాలని, డిగ్రీ కళాశాల, ఇంజినీరింగ్ కళాశాల మంజూరు చేయాలని, వంద పడకల వైద్యశాల ఏర్పాటుకు సహకరించాలని కడియం శ్రీహరి కోరారు. దళితులు మద్రాసులో శిక్షణ పొంది ఉన్నారని, వీరికి ఉపాధి కల్పించేందుకు మండలకేంద్రంలో లెదర్ పార్క్‌ను పునరుద్ధరించాలన్నారు. వ్యవసాయాధారిత పరిశ్రమలు, మహిళలకు కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేయాలన్నారు. స్టేషన్‌ఘన్‌పూర్, శివునిపల్లి, చాగల్లు మూడు గ్రామాలను కలిపి మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ చేసి వందల కోట్లు కేటాయించి అభివృద్ధి చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే రాజయ్య, ఎమ్మెల్సీ, మాజీ స్పీకర్ మధుసూదనాచారి, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి గ్యాదరి బాలమల్లు, ఎంపీ పసునూరి దయాకర్, జనగామ బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే భువనగిరి ఆరోగ్యం, గ్రంథాలయ చైర్మన్ ఎడవెల్లి కృష్ణారెడ్డి,
పార్టీ రాష్ట్ర నాయకులు మాదాసు వెంకటేశ్, డా.బొల్లపల్లి కృష్ణ, చేపూరి వినోద్, మండల అధ్యక్షులు మాచర్ల గణేశ్, ఎం రాజు, జయపాల్‌రెడ్డి, జిల్లా నాయకులు నరేందర్‌రెడ్డి, బెలిదె వెంకన్న, రాజేశ్‌నాయక్, రాపోలు మధుసూదన్‌రెడ్డి, నీల గట్టయ్య, జడ్పీటీసీలు ఇల్లందుల బేబి శ్రీనివాస్, చాడ సరిత, అజయ్, ఎంపీపీలు కందుల రేఖాగట్టయ్య, చిట్ల జయశ్రీ, కవితారెడ్డి, వైస్ ఎంపీపీ చల్లా సుధీర్‌రెడ్డి, మార్కెట్ చైర్మన్ గుజ్జరి రాజు, మాజీ చైర్మన్ అన్నం బ్రహ్మారెడ్డి, సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు సారంగపాణి, మామిడాల లింగారెడ్డి, పెసరు రమేశ్, ఎంపీటీసీలు బూర్ల లతాశంకర్, గుర్రం రాజు, శైలజా అజయ్‌రెడ్డి, గన్ను నర్సింహులు, సమ్మయ్య, కనకం స్వ రూపగణేశ్, సర్పంచ్‌లు తాటికొండ సురేశ్, నగరబోయిన మణెమ్మ యాదగిరి, కూడా మాజీ డైరెక్టర్ ఆకుల కుమార్, కొమురవెళ్లి దేవస్థానం మాజీ చైర్మన్ చేవెళ్ల సంపత్, పార్టీ మండల మాజీ అధ్యక్షుడు అక్కనపల్లి బాలరాజు, గట్టు రమేశ్, రైతు బంధు సమితి సభ్యుడు తోట వెంక న్న, మా ర్కెట్ డైరెక్టర్ చిగురు సరిత, కడియం సేన నాయకులు ఎల్మకంటి నాగరాజు, ఇల్లందుల విజయ్, హఫీజ్, సంపత్‌రాజ్, జీడి ప్రసాద్, వెంకటేశ్ నాయక్, తెల్లాకుల రామకృష్ణ పాల్గొన్నారు.
‘స్టేషన్‌ఘన్‌పూర్ ప్రాంతంలో ఒకప్పుడు చాలా భయంకరమైన పరిస్థితి ఉండేది, అది యాది చేసుకుంటేనే భయపడే పరిస్థితి.. కండ్లకు నీళ్లచ్చే పరిస్థితి ఉండే.. తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు అన్ని జిల్లాలు, మండలాలు నలుచెరుగులా, మూలమూలల తిరిగిన. అది మీకు తెలుసు. ఎనిమిదేండ్లు కండ్లకు నీళ్లు తీసుకొని స్టేజీల మీదనే ఏడ్చిన.. అట్లాంటి ప్రదేశాల్లో మీ ప్రాంతం కూడా ఒకటి’ అని కేసీఆర్ గుర్తుచేశారు. ‘పల్లా రాజేశ్వర్‌రెడ్డి గడ్డమీదున్న వేలేరుకు నీళ్లు రావాలని నాతో కొట్లాడిండు..కడియం కూడా స్టేషన్‌ఘన్‌పూర్ సాగునీటి కోసం నాతో చెబుతుండే, అందుకే ఈప్రాంతంలో లక్షా 10వేల ఎకరాలకు సాగునీరు అందుతోంది. బోర్ల బాధ, కరెంటు గోస తప్పి మంచిగ పంటలు పండించుకుంటూ ఇప్పుడు తెలివికి వచ్చినం’ అని గుర్తుచేశారు. మిషన్ కాకతీయ కింద చెరువులు బాగు చేసుకున్నం.. వాగులు, వంకలు, నదులపై చెక్‌డ్యాంలు కట్టుకోవడం వల్ల ఎక్కడి నీళ్లు అక్కన్నే ఆగి భూగర్భజలాలు బాగా పెరిగినయి. దేవాదుల ద్వారా వచ్చే నీటికి తీరువాలేదు.. దేశంలో ఎక్కడైనా ప్రాజెక్టుల కింద నీళ్లిస్తే ముక్కుపిండి పన్ను వసూలు చేస్తరు, కానీ తెలంగాణలో రైతులపై పైసా భారం పడనిస్తలేం’ అని చెప్పారు. నీళ్లు వచ్చిన తర్వాత పాత వరంగల్ జిల్లాలో అత్యధికంగా వడ్లు పండించే జిల్లా జనగామ అయిందన్నారు.