కృష్ణకాలనీ, మే 7 : ప్రజావ్యతిరేక పాలన కొనసాగిస్తున్న కేంద్రంలోని మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు సీపీఎం ఉద్యమిస్తున్నదని, ఈ పోరాటంలో అం దరూ కలిసి రావాలని సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చారు. దేశంలో మతతత్వ బీజేపీని ఓడించే సత్తా కేవలం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు మాత్రమే ఉందని పేర్కొన్నారు. మేడే వారోత్సవాల్లో భాగంగా సీపీఎం నేతృత్వంలో ఆదివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. అనంతరం పార్టీ జిల్లా కార్యదర్శి బందు సాయిలు అధ్యక్షతన స్థానిక మున్సిపల్ క్రీడా మైదానంలో నిర్వహించిన బహిరంగ సభలో తమ్మినేని మాట్లాడారు. దేశ ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన బీజేపీ ఈ తొమ్మిదేళ్లలో రైతులు, కార్మికులకు వ్యతిరేకంగా చట్టాలను తీసుకొచ్చిందన్నారు. ఇళ్లులేని పేదలందరికీ ఇండ్లు నిర్మించి ఇస్తామని చెప్పినా నేటికీ అమలు చేయలేదన్నారు. 2022 నాటికి రైతును రాజు చేస్తామని చెప్పిన ప్రధాని మోదీ రైతు వ్యతిరేక చట్టాలను తీసుకురావడంతో 365 రోజులు ఢిల్లీలో అన్నదాతలు ఆందోళనలు నిర్వహించడంతో దిగొచ్చారని విమర్శించారు.
ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని యువతకు మాయమాటలు చెప్పి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని విమర్శించారు. కులాలు, మతాల పేరుతో ప్రజల మధ్య విద్వేషాలు సృష్టిస్తున్న బీజేపీ అవకాశవాద రాజకీయాలు చేస్తున్నదని వీరభద్రం అన్నా రు. ప్రపంచ మేధావి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని పక్కకు పెట్టి మనుధర్మ శాస్ర్తాన్ని తీసుకురావాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చూస్తున్నదన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు రైల్వే, విమానాశ్రయాలు, ఎల్ఐసీ, వంటి వాటిని అదానీ, అంబానీలకు ప్రధాని నరేంద్రమోదీ కారుచౌకగా అమ్మేస్తున్నాడన్నారు. బీజేపీ పాలనలో కార్పొరేట్ సంస్థల ఆస్తులు రూ.17 లక్షల కోట్లకు పెరిగాయన్నా రు. బీజేపీ అరాచకాలకు అడ్డుకట్ట వేయడానికి సీఎం కేసీఆర్ దేశంలో ధర్మయుద్ధం చేస్తున్నాడని, ఎర్రజెండా పార్టీ సీఎం కేసీఆర్కు అంండగా ఉంటుందన్నారు. బీజేపీని ఓడించడానికి దేశంలోని అన్ని పార్టీలు ఏకమై సీఎం కేసీఆర్కు మద్దతిచ్చినట్లయితే మోదీ చిత్తుచిత్తుగా ఓడిపోవడం ఖాయమన్నారు.
కర్ణాటకలో బీజేపీకి ఓటమి తప్పదు..
కర్ణాటకలో జరుగుతున్న ఎన్నికల్లో బీజేపీకి ఓటమి తప్పదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నా రు. అక్కడి ప్రజలు బీజేపీ విధానాలను వ్యతిరేకిస్తుండడంతో మోదీకి ఓటమి భయం పట్టుకుందన్నారు. ఎన్నికల సమయంలోనే ఓటర్లను దేవుళ్లుగా సంబోదిస్తున్న బీజేపీ నాయకులను ప్రజలు నమ్మరన్నారు. దేశం లో పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెంచి సామాన్యులపై భారం మోపిన మోదీకి గుణపాఠం తప్పదన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి బందు సాయిలు మాట్లాడుతూ చికాగో అమరవీరుల స్ఫూర్తిగా భూపాలపల్లి జిల్లాలో 10 వేల ఇళ్లపై మేడే జెండాలను ఎగురవేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు వెంకటేశ్, శ్రీకాంత్, పెద్దపల్లి జిల్లా కార్యదర్శి యాకన్న, నాయకులు రాజయ్య, కిరణ్, రాజేందర్, రమేశ్, వినయ్, మల్లయ్య, దేవేందర్, ప్రీతి, రఘుపాల్, రవికుమార్, నరేశ్, శ్రావణ్, స్వర్ణలత, సుజాత, ఉషారాణి, గంట ఓదమ్మ, కోసరి రమేశ్, రజీని, మానస, వసుంధర పాల్గొన్నారు.