‘వ్యవసాయానికి 24గంటలు ఎందుకు.. మూడు గంటల కరెంటు చాలు’ అంటాడు కాంగ్రెస్ తెలంగాణ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి.. అది ఆయన మాటనో లేక ఆ పార్టీ విధానమో తెలియదుగాని, నిజంగానే ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే కర్ణాటకలో ప్రజలకు కరెంటు కోతలతో చుక్కలు చూపిస్తున్నది. 200 యూనిట్లు ఉచితంగా ఇస్తామని తీరా ‘చేతులు’ దులుపుకొని అక్కడి రైతులనే కాదు, అన్నివర్గాలవారిని ముప్పుతిప్పలు పెడుతున్నది. కానీ, దేశమంతా విద్యుత్ సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్నా.. ఉద్యమ సమయంలో కేసీఆర్ ముందుచూపు.. స్వరాష్ట్రంలో పక్కా కార్యాచరణ కారణంగా తెలంగాణలో ‘కోతల’ బెడదే లేకుండాపోయింది. ముఖ్యంగా అన్నదాతలకు కరెంటు కష్టాల నుంచి విముక్తి లభించింది. ఏండ్లకేండ్లుగా కునారిల్లిన కులవృత్తులకూ విద్యుత్ ఇబ్బందులు తప్పాయి. నిరంతరం నాణ్యమైన కరెంటు ఉంటుండడంతో పెద్దపెద్ద పరిశ్రమల్లోనే కాదు.. చిరువ్యాపారులకు సైతం చేతినిండా పని ఉంటున్నది. సీఎం కేసీఆర్ వల్లే తమ జీవితాల్లో ‘వెలుగులు’ నిండాయని సర్వత్రా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
– నమస్తే తెలంగాణ నెట్వర్క్, ఆగస్టు 19
నమస్తే తెలంగాణ నెట్వర్క్, ఆగస్టు 19 : ‘తెలంగాణ ఏర్పడితే చీకట్లే రాజ్యమేలుతాయి’ అన్నాడు నాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి.. ‘వ్యవసాయానికి 24గంటల కరెంటు ఎందుకు? మూడు గంటలు చాలు’ అంటాడు నేటి కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి.. మరి ఆ పార్టీకి నిజంగానే ప్రజలకు కరెంటు ఇవ్వాలన్న ఆలోచన లేదో ఏమోగాని ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో ఎదురైన కరెంటు కష్టాలు తెలంగాణ ప్రజలకు తెలియంది కాదు.. మొత్తంగా గోతి కాడి నక్కల్లా పీల్చిపిప్పి చేస్తున్నవారి కబంధ హస్తాలనుంచి తెలంగాణకు విముక్తి కల్పించిన కేసీఆర్, ఉద్యమ కాలం నుంచే మన కరెంటు ఇక్కట్లను తొలగించాలని కంకణం కట్టుకుని పక్కా కార్యాచరణతో అనుకున్నది సాధించారు. 24గంటలు నాణ్యమైన విద్యుత్ అందిస్తూ అటు రైతులకే కాదు.. ఇటు పెద్దపెద్ద పరిశ్రమలు, చిరువ్యాపారులు, గృహ వినియోగదారులకు కూడా రంది లేకుండా చేశారు. సాగుకు 24గంటల ఉచిత విద్యుత్ సరఫరాతో సేద్యరంగం విప్లవాత్మక మార్పులకు లోనయింది. రాష్ట్రంలో వ్యవసాయం.. కరెంటు గురించి మాట్లాడాలంటే.. ‘కేసీఆర్ పాలనకు ముందు తర్వాత’ అనే పరిస్థితి వచ్చింది. మరోవైపు ఏండ్లకేండ్లుగా కునారిల్లిన కులవృత్తులకు రాష్ట్ర సర్కారు చేయూతనిస్తూ వాటినే నమ్ముకున్నవారి జీవితాలను నిలబెడుతున్నది. ఇందులో భాగంగానే నాయీ బ్రాహ్మణులు, రజకులకు సంబంధించి సెలూన్లు, లాండ్రీ షాపులు, ధోబీఘాట్లకు 250 యూనిట్ల దాకా ఉచిత కరెంటు అందిస్తూ ఎంతో అండగా నిలుస్తున్నది.
బతుకుదెరువుకు భరోసా : రాతిపెల్లి శ్రీనివాస్, ఖిలావరంగల్
ఖిలావరంగల్: సీఎం కేసీఆర్ సార్ లాండ్రీ షాపులకు ఉచిత కరెంటిచ్చి మా బతుకు దెరువుకు భరోసానిచ్చిండు. 30 ఏళ్ల సంది ఈ షాపు నడిపిత్తాన. గిప్పుడు ఎటువంటి కష్టం లేకుండ ఇస్త్రీ చేత్తాన. ఫ్రీ కరెంట్ ఇయ్యక ముందు రోజుకు 4 కిలోల బొగ్గులు పట్టేవి. నెలకు రూ. 5 వేలకు పైగా ఖర్చయ్యేటిది. బీఆర్ఎస్ సర్కారు నెలకు 250 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తాంది. దీంతో కరంట్ ఖర్చు లేకుండా నెలకు రూ. 20 వేల వరకు సంపాదిత్తాన. ముఖ్యమంత్రి కులవృత్తిదారుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నడు. మాలాంటి వాళ్లకు అండగా ఉంటున్న బీఆర్ఎస్ వెంటే మేముంటం.
సీఎం కేసీఆర్ ముందుచూపుతో..
తెలంగాణ వస్తే రాష్ట్రం అంధకారమే అని వెక్కిరించిన వారినే వెక్కిరించేలా స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ ముందుచూపుతో కరెంటు వ్యవస్థను బలోపేతం చేశారు. రాష్ర్టానికి కరెంటు ఎంత అవసరం..? ఇక్కడ ఎంత ఉత్పత్తి అవుతున్నది? ఇంకా ఎంతా కొనాలి.. ట్రాన్స్ఫార్మర్ల నుంచి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల దాకా ఉన్న పరిస్థితి ఏమిటి తదితర అన్ని అంశాలపై పక్కా ప్రణాళికలు రూపొందించి పకడ్బందీగా అమలు చేశారు. దీంతో విద్యుత్ కోతలే లేని రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. నిమిషం కూడా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగకుండా చేశారు.
నాడు ఎప్పుడు వస్తుందో :ఎప్పుడు పోతుందో తెలియని దుస్థితి
సమైక్య పాలనలో కరెంటు ఎప్పుడు వస్తుందో?, ఎప్పుడు పోతుందో? తెలియని పరిస్థితితులు ఉండేవి. ఎండకాలం వచ్చిందంటే కరెంటు ఉండుడు గగనమే అయ్యేది. పగలు, రాత్రి కొన్ని గంటలు మాత్రమే విద్యుత్ సరఫరా అయ్యేది. కరెంటు లేని సమయంలో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు తప్పకపోయేది. ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు ఉన్నా వినియోగించుకోలేని దుస్థితి ఉండేది. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు అల్లాడిపోయేది. ఉదయం నుంచి సాయంత్రం దాకా పందిర్ల కిందనో.. చెట్ల కిందనో సేదతీరాల్సి వచ్చేది. ఆర్థికంగా ఉన్నవాళ్లు ఇన్వర్టర్లు, జనరేటర్లు వాడేది.
కరెంటు లేక గిరాకీ దెబ్బతినేది : పాము నిర్మల, లేడీస్ టైలర్ నిర్వాహకురాలు, జనగామ
జనగామ చౌరస్తా : మాది జనగామ పట్టణంలోని అంబేద్కర్‌నగర్. 18 ఏళ్ల నుంచి లేడీస్ టైలర్‌గా పనిచేస్తున్న. నా భర్త కూడా టైలరే. బ్లౌజ్‌లు, చీరెలు, పంజాబీ డ్రెస్‌లు, లాంగ్ ఫ్రాక్, కుచ్చుల ఫ్రాక్, పీకో పాల్స్, కంప్యూటర్ వర్క్‌తో చేసే మగ్గంవర్క్ బ్లౌజ్‌లను కరెంట్‌తో నడిచే కుట్టు మిషన్‌పైనే కుడుతా. రోజులో 12గంటల పాటు పనిచేస్త. ప్రస్తుతం నా దగ్గర కరెంట్‌తో నడిచే జాక్, జుకీ, శక్తి, రాల్సన్ కుట్టు మిషన్లు ఉన్నాయి. 24 గంటల కరెంట్ ఉండడం వల్లే స్వయం ఉపాధి రంగంలో రాణిస్తూ, నాతో పాటు మరోముగ్గురు మహిళలకు పని కల్పిస్తున్న. తెలంగాణ రాక ముందు కరెంట్ కోతలతో చాలా ఇబ్బందిపడ్డం. కుట్టు మిషన్లు సరిగా నడవక కస్టమర్లతో మాట పోయేది. గిరాకీ దెబ్బతినేది. ఆర్థికంగా నష్టపోయే వాళ్లం. కరెంట్ లేనప్పుడు కాళ్లతో తొక్కే కుట్టు మిషన్లు వాడడం వల్ల నడుము నొప్పి, కాళ్లు-చేతులు లాగడం, మెడలు గుంజడం వంటి సమస్యలతో బాధపడోటోళ్లం. సీఎం కేసీఆర్ సార్ వచ్చినంక కరెంట్ సమస్య తీరింది. ఇప్పుడు అసలు కరెంటే పోతలేదు. నా దగ్గర కరెంట్‌తో నడిచే నాలుగు కుట్టు మిషన్లపై బట్టలు కుట్టి సకాలంలో కస్టమర్లకు అందిస్తున్న. సీఎం కేసీఆర్ సార్‌కు మా లేడీస్ టైలర్లందరి తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు.
తీరిక లేకుండా పని ఉన్నది : గడీల నరేశ్ (వెల్డర్)
గూడూరు : నేను వెల్డింగ్ పని చేస్తున్న. రైతులకు నాగళ్లు, కేజ్‌వీల్స్, ట్రాక్టర్ ట్రాలీ డబ్బాలు, రొటవేటర్స్, ఇండ్లకు గేట్లు, కిటికీలు ఇతర వెల్డింగ్ పనులతో ఉపాధి పొందుతున్న. ఉమ్మడి రాష్ట్రంలో కరెంటు కోతలతో మస్తు ఇబ్బందిపడ్డం. కరెంటు ఎప్పడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో పని సక్కగ జరిగేది కాదు. తెలంగాణ రాష్ట్రం రాకముందు వేసవి కాలంలో కరెంట్ ఉదయం పోతే సాయత్రం 7గంటలకు వచ్చేది. షాపులు నడవక, కుటుంబం గడవక ఇబ్బందిపడ్డం. తెలంగాణ వచ్చినంక నిరంతర కరెంటుతో షాపులో తీరిక లేకుండా పనిచేస్తున్న. చేతినిండ పని ఉండడంతో భోజనం చేయడానికి కూడా తీరిక లేదు. ఆర్డర్లు ఎక్కువ ఉండడంతో మరో ముగ్గురికి పని ఇచ్చిన. గతంలో నా షాపులో నాకే పని ఉండేది కాదు. ఇప్పుడు వెల్డింగ్‌కు సంబంధించి మిషనరీలు కొనుక్కుని తీరిక లేకుండా పనిచేసుకుంటున్నా. నాణ్యమైన కరెంటు ఇవ్వడంతో మా వ్యాపారం చాలా బాగుంది. సంతోషంగా ఉంది. ఇంత మంచిగ కరెంటు ఇస్తున్న కేసీఆర్ సార్నే మళ్లీ గెలిపించుకుంటం.
డిమాండ్‌కు తగ్గట్లు సరఫరా : చేతినిండా ఉపాధి
ఉమ్మడి జిల్లాలో గతంతో పోలిస్తే విద్యుత్ వినియోగం పెరిగింది. అయినా డిమాండ్‌కు తగినట్లుగా రాష్ట్ర ప్రభుత్వం కరెంటు సరఫరా చేస్తున్నది. 24గంటలు నాణ్యమైన కరెంటు ఇస్తున్నది. దీంతో చిరు పరిశ్రమలవారు ఎలాంటి ఆటంకాలు లేకుండా తమ పని చేసుకుంటూనే మరికొందరికి ఉపాధి కల్పిస్తున్నారు. వర్క్ ఫ్రం హోం ఉద్యోగులు ఇబ్బందులు లేకుండా పని చేసుకుంటున్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడిన నేపథ్యంలో ఉద్యోగార్థులు ఫ్యాన్లు, కూలర్లు, ఏసీల కింద ప్రశాంతంగా చదువుకుంటున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కరెంటు కోసం కండ్లు కాయలు కాసేలా ఎదురుచూడాల్సి వచ్చేదని, పనులు ఉన్నా కరెంటు లేక చేయలేని దుస్థితి ఉండేదని, ఇలా ఉపాధి లేక ఎన్నో ఇబ్బందులు పడ్డామని, తెలంగాణ వచ్చాక ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుతో నాటి ఇక్కట్లన్నీ తొలగిపోయాయని చిరువ్యాపారులు చెబుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు అవకాశం ఇస్తే మళ్లీ పాత రోజులే వస్తాయని, అలాంటి రోజులను తాము కోరుకోవడం లేదని, విజన్ ఉన్న బీఆర్ఎస్సే మళ్లీ అధికారంలోకి రావాలని, ఎప్పటిలానే నిరంతర విద్యుత్ అందాలని కోరుకుంటున్నారు. మనవద్ద ఉన్నట్లుగా 24గంటల కరెంటు దేశంలోని ఏ రాష్ట్రంలోనూ లేదని, విద్యుత్ రంగంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని, ఈ ప్రగతి ఇలానే కొనసాగాలంటే కేసీఆరే సీఎంగా ఉండాలని స్పష్టం చేస్తున్నారు.
అప్పుడు కరెంటు కోతల ప్రభుత్వం..
భీమదేవరపల్లి : 20 ఏళ్లుగా ముల్కనూరులో అద్దె రూములో విక్రమ్ టైలర్స్ పేరుతో షాపు నడుపుతున్న. నాతోపాటు మరో ఐదుగురు పని చేస్తున్నరు. ఉమ్మడి రాష్ట్రంలో కరెంటు కోతలతో ఇబ్బందిపడేటోళ్లం. రోజుకు నాలుగు నుంచి అయిదు గంటలు కరెంటు పోయేది. రాత్రిపూట రైతులు నీళ్లు పారించేందుకు బాయిల కాడికి వెళితే.. మేము షాపుల్లో కరెంటు కోసం కావలికాసేటోళ్లం. ఛీ.. జీవితం.. ఈ బతుకు పగోనికి రావద్దనుకునేటోళ్లం. తెలంగాణ రాష్ట్రం వచ్చాక మా బతుకులు మారినయి. పగలే కాదు.. రాత్రి కూడా కరెంటు పోతలేదు. ఇప్పుడు సాఫీగా బట్టలు కుట్టుకుంటున్నం. తెలంగాణ వస్తే కరెంటు కోతలు ఎక్కువైతయని అప్పుడు సీఎంగా ఉన్న కిరణ్‌కుమార్‌రెడ్డి జెప్పిండు కదా. నేను షాపు నడుపుకుంటనా అని చాలారోజులు భయపడిన. సీఎం కేసీఆర్‌ను కూడా నమ్మలే. తెలంగాణ అయితే పట్టుబట్టి తెచ్చిండు. కరెంటు కోతలు లేకుండా ఎట్ల జేత్తడు. ఇది నా ఒక్కడి భయమే కాదు. కరెంటుతో పనులు చేసుకుని బతుకుతున్న కులవృత్తులోల్లకు కూడా గిదే గుబులు. కానీ కేసీఆర్ గట్టోడు. పట్టుబట్టితే ఉడుంపట్టే. కరెంటు 24గంటలు తెప్పించి గిది తెలంగాణ అంటే అని సూపెట్టిండు. నాకిప్పటికీ అర్థం కాదు. గిన్ని పింఛన్లు ఇస్తడనుకోలె. ఏ ఊరుకు పోయినా చెరువులన్నీ నిండే కనిపిస్తున్నయి. పుట్లకు పుట్లు వండ్లు పండుతానయి. నా జిందగీల సూడలే గిన్ని వడ్లు. ఎంతోమంది రైతుల పిల్లలకు నేను బట్టలు కుట్టిన. బడికి పోయే పిల్లలకు బట్టలు కుట్టీయాలంటే రైతులు నానా ఇబ్బందిపడేది. గసోంటిది ఇప్పుడు దర్జాగా దర్జీ వద్దకు వచ్చి మంచి బట్టలు కుట్టమంటాండ్రు. దిల్ ఉన్న మారాజు సీఎం కేసీఆర్. గసోంటి కేసీఆర్ సారుకు ఓటేయకుంటే మన బతుకులను మనం ఆగం జేసుకున్నట్లే.
– గంజి రాజమౌళి, విక్రమ్ టైలర్స్, ముల్కనూరు
కండ్లు కాయలు కాసేలా ఎదురు చూసేది..
చిట్యాల: నేను టైలరింగ్ పనిచేస్తున్న. తెలంగాణ రాక ముందు కరెంట్ ఇగ అస్తదో.. అగ అస్తదోనని కండ్లు కాయలు కాసేలా ఎదురు చూసేది. కరెంటు సక్కగ రాక గిరాకీ ఉండేది కాదు. కుటుంబ గడవడం కూడా కష్టంగా ఉండేది. కాళ్లతో మిషిన్ తొక్కుతూ బట్టలు కుట్టడం వల్ల కాళ్లు, నడుం నొప్పులు వచ్చేవి. తెలంగాణ వచ్చినంక కేసీఆర్ సార్ 24గంటల కరెంటు ఇస్తున్నడు. కుట్టు మిషిన్కు కరెంటు మోటరు పెట్టుకోవడంతో పని సులువైంది. ఇప్పుడు రెస్ట్ తీసుకోవడానికి కూడా సమయం ఉండడం లేదు. గిరాకీ ఎక్కువైనా అనుకున్న సమయంలో బట్టలు కుట్టి ఇస్తున. నాతోపాటు మరో నలుగురికి పని నేర్పించి ఉపాధి కల్పించా. పొద్దంతా కరెంటు ఇవ్వడంతో ఎటూ బయటికి వెళ్లకుండా ఇంట్లో పని చేసుకుంటున్న. సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు.
– వెల్దండి రమ్య(టైలరింగ్), చిట్యాల
కరెంటు కష్టాలు తీరినయి..
ఆత్మకూరు : కేసీఆర్ సారు వచ్చినంక కరెంటు కష్టాలు తీరినయి. ఉమ్మడి రాష్ట్రంలో కరెంటు కోతలతో నరకయాతన అనుభవించినం. ఎప్పుడు కరంటు వస్తుందో.. ఎప్పుడు పోతదో తెలియని పరిస్థితి. అడపాదడపా వచ్చే కరెంటు కోసం రాత్రంతా జాగారం చేసేటోళ్లం. సద్ది పెట్టుకుని వెళ్లి బాయిల కాడ కావలి కాసేటోళ్లం. కరెంటు వచ్చినా లో వోల్టేజీ ఉండడంతో మోటర్లు కాలిపోయేవి. రిపేర్ల కోసం మోకానిక్‌ల వద్దకు రోజుల తరబడి తిరిగేటోళ్లం. పంట చేతికొచ్చే సమయంలోనే కరెంటు సక్కగ రాక, పొలానికి నీళ్లు అందక ఎండిపోయేవి. రాత్రి పూట కరెంటు ఇవ్వడంతో బాయిల కాన్నే పడుకునేటోళ్లం. పాములు, తేళ్ల భయంతో వణికిపోయేటోళ్లం. తెలంగాణ వచ్చినంక కేసీఆర్ సారు రైతుల పాలిట దేవుడైండు. 24 గంటలు మంచిగ కరెంటు ఇస్తున్నడు. నాటి పాలనను తలుచుకుంటే ఆ పార్టీలను దగ్గరకు రానీయకపోవడమే మంచిదనిపిస్తది. ఇంత మంచిగ కరెంటు ఇస్తున్న కేసీఆరే మళ్లీ సీఎం కావాలె.
– కుసం సాంబయ్య(రైతు), కటాక్షపురం
కేసీఆర్ ప్రభుత్వం మారితే అథోగతే..
నల్లబెల్లి : కాంగ్రెస్ పాలనలో లోవోల్టేజీ సమస్యతో చాలా ఇబ్బందిపడ్డం. వచ్చిరాని కరెంటుతో మోటర్లు కాలిపోయి, నీళ్లందక పంటలు ఎండిపోయేవి. అప్పులు తెచ్చి మోటర్లను రిపేర్ చేయించేది. రాత్రి పూట పొలానికి నీరు పెట్టేందుకు బావుల కాడికి పోతే ఏనాడు దొయ్య పారలె.., దోసిలి నిండలె. లో వోల్టేజీ కరెంటుతో టీవీలు, ఫ్యాన్లు కాలిపోయేవి. అప్పులు తెచ్చి ఎవుసం చేస్తే చివరకు అప్పులే మిగిలేది. దీంతో పురుగుల మందునే పెరుగన్నంగా చేసుకుని మండలంలో చాలామంది రైతులు ఆత్మహత్య చేసుకున్నరు. అంతేగాక రాత్రి పూట విద్యుత్ షాక్, పాముకాటుకు గురై కొందరు చనిపోయిండ్లు. వారి కుటుంబాలు రోడ్డున పడ్డయి. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ సార్ దయతో 24 గంటల కరెంటు ఇవ్వడంతో మా బతుకులు మారినయి. ఎండలు కొట్టినా, పెద్దపెద్ద వానలు పడ్డా క్షణం కూడా కరెంట్ పోతలేదు. బావుల కాడ మోటర్లకు ఆటోమెటిక్ స్టాటర్లు పెట్టుకొని రాత్రి పూట హాయిగా ఇంట్లోనే నిద్రిస్తున్నాం. గోదావరి జలాలు రావడంతో ఎండాకాలంలో కూడా చెరువులు మత్తడిపడుతున్నయి. భూగర్భ జలాలు పెరిగినయి. పొలాలకు పుష్కలంగా నీళ్లు ఉండడంతో రెండు పంటలు పండించుకుంటున్నం. పెద్దసార్ దయతో సమయానికి పంట పెట్టుబడి, రైతు చనిపోతే కుటుంబానికి బీమా, సమయానికి ఎరువులు ఇస్తుండు. మా బతుకులను బాగు చేసిన కేసీఆర్ సార్ ప్రభుత్వమే మళ్లీ రావాలి. కాంగ్రెసోళ్లు రైతులను నట్టేట ముంచుతరు.
– మాలోత్ ప్రతాప్‌సింగ్, బిల్యానాయక్‌తండా రైతు, నల్లబెల్లి
డిమ్ము కరెంటుతో పని నడువకపోయేది…
స్టేషన్ ఘన్పూర్ : నేను 30ఏళ్లుగా లేత్‌మిషన్ నడుపుతున్నం. తెలంగాణ రాకముందు రోజులో 4 గంటలే కరెంటు ఉండేది. అది కూడా డిమ్ముగా ఉండడంతో షాపులో పని సక్కగ జరిగేది కాదు. రోజుకు సుమారు 8 వరకు కాలిపోయిన మోటర్లు వచ్చేవి. రైతులు రాత్రి వరకు షాపు వద్ద ఉండి మోటర్లు బాగు చేయమని వేడుకునే వారు. బాధనిపించేది. కరెంటు ఎప్పుడు వస్తదో.., ఎప్పుడు పోతదో తెల్వక రైతులు ఇబ్బంది పడేటోళ్లు. మోటరు బాగు చేసి ఇచ్చిన 15 రోజులకే లో వోల్టేజీ కారణంగా మళ్లీ కాలిపోయిది. వ్యవసాయ పనులను వదిలి రైతులు షాపు వద్దకు పరుగులు పెట్టేటోళ్లు. టైముకు కరెంటు లేక వారి బాధలు చూడలేక ద్విచక్రవాహనాల ఇంజిన్లతో మోటర్లు బాగు చేసేది. అప్పుడు వచ్చిన పైసలు పెట్రోల్ ఖర్చులకే సరిపోయేది. త్రీఫేజ్ కరెంటు ఇవ్వకపోవడంతో షాపులు నడవక మేము, పంటలు ఎండిపోయి రైతులు అప్పుల పాలైండ్లు. తెలంగాణ వస్తే నీళ్లు, కరెంటు వస్తదంటే అప్పుడు నమ్మలేదు. సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం 24 గంటల నాణ్యమైన కరెంటు ఇవ్వడంతో అటు రైతులు, ఇటు మా లెక్క షాపులు నడుపుకుంటున్నోళ్ల జీవితాల్లో చాలామార్పు వచ్చింది. కాలిపోయిన మోటర్ తీసుకొచ్చిన రెండు గంటల్లోనే రిపేర్ చేసి ఇస్తున్నం. ఆ రోజుల్లో నెలకు 120కి పైగా మోటర్లు రిపేరుకు వచ్చేవి. ఇప్పుడు 20 కూడా రావడం లేదు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌నే మళ్లీ గెలిపించుకోవాలి.
– ఓరుగంటి రాములు (ఇంజినీరింగ్ వర్క్స్, స్టేషన్‌ఘన్‌పూర్).
మిషిన్ల కాడ దుబ్బ కొట్లాడుతుండె..
రాయపర్తి : టీడీపీ, కాంగ్రెస్ పార్టీల కాలంలో కరెంట్ తిప్పలు బొచ్చెడు ఉండేవి. ఊళ్లపొంటి పొద్దుందాకా కరెంట్ బంద్ జేసేటోళ్లు. చేతిపని చేసేటోళ్లంమంతా పొద్దంతా ఇంటి కాన్నే ఉండి, తెల్లందాక పనులు చేసేది. కర్ర కోత, దూగడ, తొళ్లు వేసే మిషిన్లు, కటింగ్, డిజైనింగ్ మిషిన్ల సుట్టూ దుబ్బకొట్లాడేది. ఇండ్లకు కొత్త దర్వాజలు, తలు పులు, కిటికీలు, వెంటిలేటర్ల కోసం ఆసాములు ఇబ్బందిపెట్టేది. తొందరగా పనిజేద్దామంటే కరెంట్ ఉండకపోయేది. వాళ్ల తొందర సూడలేక చెక్కలు, దర్వాజ శెరలను భుజాన పెట్టుకుని వరంగల్, తొర్రూరు, వర్ధన్నపేటకు పోయి జనరేటర్లు ఉన్నకాడ ఎక్కువ పైసలు ముట్టజెప్పి పనులు చేయించుకొని వచ్చేది. కానీ, ఇప్పుడు తెలంగాణ వచ్చినంక కేసీఆర్ సారు కరెంట్ తిప్పలు తీర్చిండు. ఇరాం లేకుంట కరెం టు ఇస్తున్నడు. చేతినిండా పని దొరుకుతున్నది. కేసీఆర్‌ను మరిచిపోతే మళ్ల జనమంతా అగ్గిల పడ్డట్టే అయితది. మంచిగ పనిచేసేటోళ్లనే గెలిపించుకుంటం.
– దాసరోజు గోవర్ధనాచారి, వడ్రంగి, రాయపర్తి
ఏటా దర్జాగా మూడు పంటలు పండిస్తున్నం..
మల్హర్: సీఎం కేసీఆర్ ఇస్తున్న 24గంటల ఉచిత కరెంట్‌తో ఏటా మూడు పంటలు పండిస్తున్న. ఉమ్మడి రాష్ట్రంలో కరెంట్ కోతలతో ఇబ్బందిపడ్డం. రోజుకు 5 నుంచి 6 గంటలు వచ్చే కరెంటుతో ఏ పనీ సరిగ్గా జరిగేదికాదు. పంటలకు నీళ్లు అందక ఎండిపోయేవి. పెట్టి పెట్టుబడి కూడా రాక అప్పుల పాలయ్యేది. రాత్రిపూట కరెంటు కోసం పంట చేన్లలో పడిగాపులు కాసేటోళ్లం. పాములు, తేళ్ల వంటి విష పురుగులు కాటేసి చాలామంది రైతులు చనిపోయారు. తెలంగాణ వచ్చినంక రైతుల బాధలు తెలిసిన కేసీఆర్ సార్ 24 గంటల కరెంట్ ఇస్తున్నడు. ఇప్పుడు కరెంట్ కోసం ఎలాంటి ఇబ్బందులు లేవు. పంటలకు 24 గంటలు నీళ్లు పారిస్తున్నం. చాలా సంతోషంగా ఉంది. పెట్టుబడి సాయం, ఉచిత కరెంట్ ఇవ్వడంతో ఏటా రెండు నుంచి మూడు పంటలు పండించుకుంటున్నం. పంట చేన్ల సుట్టూ తిరిగే బాధ తప్పింది. సీఎం కేసీఆర్ రైతు కష్టం తెలిసిన దేవుడు. రైతులమంతా రుణపడి ఉంటాం.
– అజ్మీరా రాజు, రైతు అడ్వాలపల్లి, మల్హర్