నల్లబెల్లి : కాంగ్రెసోళ్లు అంటున్నట్లు ధరణి తీసేస్తే మళ్లా దళారీ వ్యవస్థకు దారులు తెరిసినట్లే అవుతుంది. గత పాలకుల నియంతృత్వ పోకడల వల్ల సామాన్యుడు తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా భూముల సమస్య పరిస్కారం కాకపోతుండే. బ్యాంకు రుణాల కోసం అప్పటి వీఆర్వోలు ఒకరి భూమి మరొకరికి రాసి పహాణీ నకల్లు ఇచ్చేవారు. దీంతో అమాయకులైన కొందరు రైతుల భూములను మరొకరు పట్టాలు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. భూముల సమస్యలపై పోలీస్స్టేషన్ల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరిగేటోళ్లం. చేయి తడపందే తహసీల్ కార్యాలయంలో పని కాకపోయేడిది. తెలంగాణ రాష్ట్రం వచ్చినంక సీఎం కేసీఆర్ సార్ ధరణి తీసుకు వచ్చి భూములకు భద్రత కల్పించారు. ఇప్పుడు ఏ కొట్లాటలు లేవు. రైతులు హాయిగా ఎవుసం చేసుకుంటార్రు. అర చేతిలోనే భూమి వివరాలు తెలుత్తానై. దళారీ వ్యవస్థ దూరమైంది. ఐదు నిమిషాల్లో భూములు రిజిస్ట్రేషన్ అయితానయ్. గతంలో సావుకారి కాడ అప్పులు తెచ్చి పంట పెట్టుబడులు పెట్టేటోల్లం. వచ్చీరాని కరెంటుతో అట్టకట్టాలు పడ్డాం. మోటర్లు ఎప్పటికి కాలిపోతుండేది. వేరే అయ్యకాడ మళ్లా అప్పు తెచ్చి మోటర్లు సగబెట్టిచ్చేది. పండిన పంట అమ్మితే వచ్చే పైసలు అప్పులోనికే దారపోసేది. పిల్లల చదువులు చదివించలేక కుటుంబం గడువక తిప్పల పడ్డం. మా బాధలు తెలుసుకుని పెద్ద సార్ అదునుకు రైతు బంధు ఇవ్వడంతో ఇప్పుడు అప్పులు తెత్తలేము.
మాకాడ ఎక్కువ మిరప తోటలు పండిత్తం. అప్పుడు రాత్రి పూట పంటలకు నీళ్లు పెట్టేందుకు వెళ్లేటోళ్లం. మా ఊళ్లో ఇద్దరు ముగ్గురు రాత్రి చేనుకాడికి పోతాంటే పాము కర్చి సచ్చిపోయారు. కొందరు కరెంటు షాకు తగిలి సచ్చిపోయారు. అయినా పంట తీయాలే అప్పులోడికి పైసలు కట్టాలె కాబట్టి టార్చ్లైట్లు పట్టుకుని చేన్లకాడికి పొయేటోళ్లం. నిద్ర మానుకొని కరెంటు కోసం ఎదురు చూసెటోళ్లం. మళ్లా లోవోల్టేజీతో కరెంటు వచ్చేది. దీంతో ఊకె కరెంటు టిప్పు అయితుండె. రాత్రంతా మేల్కతోని ఉంటే 10 గుంటల చెల్క కూడా తడువకపోయేటిది. ఇప్పుడు 24 గంటల కరెంటు ఇత్తాండ్రు. 3 హెచ్‌పీ, 5 హెచ్‌పీ మోటర్లనే వాడుతానం. ఈ మోటర్లకు ఆటోమేటిక్ స్టాటర్లు పెట్టుకుంటే అదే ఎత్తుకుంటది అదే ఆఫ్ అయితది. ఇంట్ల ఉన్నా పొలాలు పారుతానై.. పంటలు మంచిగా పండుతానై. పిండి బత్తాలు, మందులు అదునుకు దొరుకుతానై. కల్తీ లేని విత్తనాలు దొరుకుతానై. రంది లేకుండా ఎవుసం చేత్తానం. మళ్లా కాంగ్రెసోళ్లు 3 గంటల కరెంటు ఇత్తానంటాండ్రు. 10 హెచ్‌పీ మోటర్లు పెట్టిత్తామంటాండ్రు. ఇలా రైతులు అందరు ఒక్కసారే మోటర్లు పెడితే ట్రాన్స్ఫార్మర్లు ఆగుతాయా.. సబ్స్టేషన్లు కాలిపోవా.. నట్టం ఎవడు బరిస్తడు.. మళ్లా రైతులపైనే భారం ఏత్తరు.. గిప్పుడుగిప్పుడే నాల్గు పైసలు ఎనకేసుకుంటానం.. కాంగ్రెసోళ్లు మా బతుకులను ఆగం చేసేందుకే కంకణం కట్టుకున్నట్టుంది. రైతులందరం కూడగట్టుకుని ఈ ఎన్నికల్లో ఓట్లతో బుద్ధి చెప్పుడు ఖాయం. నీళ్లిచ్చి, పెట్టుబడి ఇచ్చి మమ్ముల ఆదుకుంటున్న కేసీఆర్ సార్కే అండగా ఉంటాం. మందిని ముంచే కాంగ్రెస్‌కు బుద్ధి చెప్తం.
ఎల్కతుర్తి : మన సొంత పాస్ పుస్తకాల్లో భూ యజమాని పేర్లు ఉంటయ్ కానీ మళ్ల గీ కౌలు దార్ల పేర్లు ఎట్ల పెడుతరు. ఎన్కటనే పాస్ పుస్తకాల్లో అనుభవదారు, కౌలుదారు అని రెండు పేర్లు ఉంటనే తలకాయనొప్పులు వచ్చినయ్. అప్పుడున్న కొందరు రెవెన్యోళ్లు అటు పేరు ఇటు, ఇటు పేరు అటు రాసి మస్తు ఆగం జేసిన్రు. పేర్లు మార్వడానికి ఆఫీసుల చుట్టు తిరిగీతిరిగి చెప్పులరిగేటియి. పహాణీల్లో పెన్సిళ్లు, పెన్నులతో రాసి కొట్టేసేవారు. మళ్ల పైసలిస్తేనే పనులయ్యేటియి. గిప్పుడు అలాంటి సమస్యలేమీ రైతులకు లేవు. నిజంగా ఇదివరకు రైతుల ఇబ్బందులు తెలిసిన వాళ్లెవరు గిట్ల మాట్లాడరు. ఒకవేళ అదే జరిగితే కొట్లాటలు తప్పయ్. భూములు కౌలుకు ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రారు. ధరణి మంచిగనే ఉన్నది. మా హక్కులకు ఎలాంటి రంది లేదు. పేరు మార్చి కొత్తగా పెడితే ఏమొస్తదో కాంగ్రెసోళ్లకే తెల్వాలి.
ధర్మసాగర్ : రైతుల సంక్షేమమే సీఎం కేసీఆర్ లక్ష్యం. ఆయన స్వయంగా రైతు. రైతుల కష్టాలు తెలుసు. ధరణి ద్వారానే భూములకు రక్షణ. ఎప్పుడో తాతల నాటి కాలంలో తెల్ల పేపర్ మీద రాసుకుని భూమి కొంటే దానిని సాదాబైనామా పేరిట ధరణి పోర్టల్‌లో ఎక్కించి పట్టాదారు పాస్ బుక్కులు ఇచ్చిండు. ధరణి వల్లే రైతులకు భూములపై హక్కులు వచ్చినయ్. దీన్ని తీసి కాంగ్రెసోళ్లు భూమాత తీసుకువస్తామని చెప్పడాన్ని రైతుగా నేను వ్యతిరేకిస్తున్నా. అయినా వారు అధికారంలోకి రారు. ముఖ్యంగా తెలంగాణ పట్టాదారు పాసుబుక్కు రావడంతో భూమిపై హక్కులు వచ్చినయ్. ఇంట్లో భూమి సమస్యలు తీరినయ్. ఏ కుటుంబంలోనైనా భూమి అమ్ముకోవాలన్నా, కొనుగోలు చేసుకోవాలన్నా ఇద్దరు ఉంటేనే సరిపోతది. అంతే కాకుండా వేలు ముద్ర పెడితేనే ఆ భూమి వివరాలు ఓపెన్ అయి వేరే వారికి అమ్మినట్లు తెలుస్తుంది. మళ్లీ కేసీఆరే రావాలే. కాంగ్రెస్ వస్తే పాత పద్ధతిలో మళ్లీ భూమి సమస్యలు వస్తయ్. ధరణిని తొలగించవద్దు.
రాయపర్తి : ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకు వచ్చిన ధరణి పోర్టల్‌తో రాష్ట్రంలోని రైతులందరికీ ఎంతో మేలు జరుగుతున్నది. ఈ పోర్టల్ రాకతో రెవెన్యూ వ్యవస్థలోని వీఆర్వోలు, వీఆర్ఏలకు మంగళం పాడడంతో రైతాంగానికి ఇప్పుడు ఎటువంటి భూ సమస్యలు ఉత్పన్నం కావడం లేదు. ఆనాడు వీఆర్వోలు, వీఆర్ఏలు ఉన్న సమయంలో రైతులు, పట్టాదారుల రెవెన్యూ రికార్డులను తారుమారు చేస్తూ కరెక్షన్ల పేరుతో కరప్షన్ చేస్తూ వేలాది రూపాయలు దండుకునేవారు. ధరణిని తీసివేస్తే మళ్లీ రాష్ట్ర రైతాంగాన్ని నట్టేట ముంచినట్లే అవుతుంది. రైతాంగానికి సహాయకారిగా ఉన్న ధరణి పోర్టల్‌ను ఎత్తి వేస్తామంటే ఆగ్రహించక తప్పదు.
హనుమకొండ సిటీ : ధరణి అమల్లోకి వచ్చినప్పటి నుంచి భూమి విషయంలో లొల్లులు మాయమైనయ్. భూమి కొనుగోలు, అమ్మకాల విషయంలో దళారీ వ్యవస్థ లేకుండా నేరుగా తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకునే స్వేచ్ఛ వచ్చింది. గతంలో తహసీల్దార్, వీఆర్వోలకు లంచాలు ఇచ్చి కాళ్లు అరిగేలా తిరిగినా పని కాకపోయేది. ఇప్పుడు ధరణిని తీసుకువచ్చి సీఎం కేసీఆర్ మంచి పనిచేశారు. భూముల దగ్గర కిరికిరి అనే మాటే లేకుండా చేశారు. రానున్న రోజుల్లో అసైన్డ్ ల్యాండ్‌కు పట్టాలు ఇస్తానని చెప్తున్నారు. చాలా సంతోషకరమైన విషయం. కౌలు రైతుకు హక్కు కల్పిస్తామనడం దుర్మార్గమైన ఆలోచన. ఈ ఒక్క ఆలోచనతో కాంగ్రెస్‌ను రైతులు బొందపెట్టక తప్పదు. కాంగ్రెస్ వాళ్లు పబ్బం గడుపుకోవడానికి పాత రోజులను తీసుకొచ్చి రైతులను ఆగం చేయాలని చూస్తున్నారు.
సంగెం : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతు కౌలుకు ఇస్తే హామీ పత్రం రాసుకునేందుకు చట్టం తెస్తామనడం ఇద్దరి మధ్య గొడవలు పెట్టియ్యడమే. రైతు ఇష్టపూర్వకంగా కౌలుకు ఇవ్వాలే తప్ప ఇందుకోసం చట్టం చేస్తామంటే అసలు రైతు కౌలుకు ఇచ్చే పరిస్థితి ఉండదు. రాతపూర్వకంగా ఇస్తే చట్టపరంగా హక్కులు పొందుతాడు కాబట్టి ఇరువురి మధ్య గొడవలు, పంచాయితీలు అయి కోర్టుల వరకు పోయే ప్రమాదం ఉంది. చట్టం తీసుకురావడం వల్ల రైతులు ఇబ్బందులు పడుతారు. ధరణి పోర్టల్‌లో ప్రతి రైతు భూమిని ఆన్లైన్లో చూసుకోవచ్చు. రైతు భూమి కొన్నా.. అమ్మినా.. ఫింగర్ ప్రింట్ పెడితేనే పని అయితది. దీంతో రైతుకు భూమి మీద ఎలాంటి అపోహలు లేకుండా నిర్భయంగా ఉంటాడు. ధరణి ఉంటేనే రైతులకు శ్రేయస్కరం.
ఆత్మకూరు : తెలంగాణ ఉద్యమ నేత, సీఎం కేసీఆర్ రైతుల కోసం ధరణి పోర్టల్ తీసుకువచ్చి భూములకు భద్రత కల్పించారు. ధరణి తీసేస్తే రైతులు ఆగమాగం కావడం ఖాయం. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పటేల్, పట్వారీ వ్యవస్థలో దొంగ రిజిస్ట్రేషన్లు చేసిండ్రు. రెవెన్యూ రికార్డుల్లో గోల్మాల్ చేసి రైతులను మోసం చేశారు. ప్రస్తుతం ధరణి ద్వారా భూమి ఉన్న ప్రతి రైతుకు పట్టాదారు పాస్ పుస్తకం ఇప్పించారు. పెట్టుబడి కోసం రైతుబంధు ప్రవేశపెట్టి బ్యాంకు ఖాతాల్లో డబ్బులు వేస్తున్నారు. గత ప్రభుత్వాలు ఏ రోజు రైతుల కోసం ఆలోచించలేదు. రైతుల కష్టసుఖాలు తెలుసుకున్నది సీఎం కేసీఆర్ ఒక్కరే. గ్రామాల్లోకి వచ్చే కాంగ్రెసోళ్ల మాయ మాటలు వింటే మళ్లీ కష్టాలు మొదలైనట్లే. 24గంటల కరెంటు ఉండడం వల్ల ఎంతో సంతోషంగా వ్యవసాయం చేసుకుంటానం. 3గంటల కరెంటు ఇస్తే, వ్యవసాయం చేయడం దండుగ. పచ్చని పొలాలు బీడు భూములుగా మారుతాయి. అప్పుడప్పుడు కరెంటు ఇస్తే బావుల వద్ద జాగారాలు చేయాల్సిందే. రైతులకు కరెంటు కష్టాలు ఉండవద్దనే సీఎం కేసీఆర్ 24గంటల కరెంటు ఇచ్చి రైతులను ఆదుకుంటున్నారు. రైతులను ఆగం చేయాలనే చూస్తే ఊరుకునే ప్రసక్తి లేదు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓటుతో దెబ్బకొడతాం.
దామెర : ధరణి తీసేస్తామని కాంగ్రెస్ చెబుతున్న తీరు చూస్తే రైతుల వ్యవసాయ భూముల రికార్డులు తారుమారై ఆగం అయ్యే పరిస్థితి ఉంటది. దళారులు పుట్టుకొస్తరు. మళ్లీ పాతగొడవలే. ఇదేం బాగా లేదు. ధరణి తీసేసి గ్రామాల్లో రైతుల మధ్య గొడవ పెట్టాలని కాంగ్రెస్ నాయకులు చూస్తున్నరు. ఇది మంచి పద్ధతి కాదు. సీఎం కేసీఆర్ తీసుకువచ్చిన ధరణి వల్ల రైతులు తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లిన రెండు నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ జరుగుతున్నది. రైతుకు తెలియకుండా వ్యవసాయ భూమికి సంబంధించిన ఏ రికార్డూ మారదు. నయా పైసా లంచం ఇవ్వనవసరం లేదు. ఇలాంటి ధరణిని కాంగ్రెస్ నాయకులు తీసివేస్తామని చెప్పడం చూస్తే మళ్లీ రైతులకు పాతకాలపు కష్టాలే.. ఎట్టి పరిస్థితిల్లో దీన్ని మేం ఒప్పుకోం.. కాంగ్రెస్‌కు తగిన బుద్ధి చెబుతాం.
ఐనవోలు: కరెంటు 24గంటలు సైప్లె చేయడం వల్ల రైతులందరం ఎంతో సంతోషంగా ఎవుసాయం చేస్తుం. కరెంటు లేకపోతే ఎనుకటి కాలం వస్తది. కరెంటు ఎప్పటికీ ఇవ్వడం వల్ల ఎప్పడు వీలుంటే గప్పుడు బాయిల కాడికి పోయి మోటర్ వేసి పంటలకు నీళ్లు పారిస్తున్నాం. ఒక వేళ 3, 5 గంటల కరెంటు వచ్చిందా, రైతులందరం కరెంటు ఎప్పుడు వస్తుందా.. ఎప్పుడు మోటర్ వేయాలని ఎదురుచూస్తాం. కరెంటు వచ్చినంక అందరం ఒక్కసారే మోటర్లు వేస్తే మోటర్లు, స్టాటర్లు కాలిపోతయి. ఎనుకటి కాలం ముందటపడుతుంది. వ్యవసాయం వదిలీ పనికోసం పట్నానికి వలసలు పోతారు.
వర్ధన్నపేట: రాష్ట్రంలో కేసీఆర్ సార్ ధరణి పోర్టల్ తెచ్చిన తర్వాతే భూ పరిష్కారమయ్యాయి. గతంలో చేతితో రాసిన పహానీలు ఉండడం వల్ల అనేక సమస్యలు వచ్చాయి. ఒకరి భూమిని మరొకరిపై రాయడం వల్ల గ్రామాల్లో నిత్యం గొడవలే జరుగుతుండేవి. కానీ సీఎం కేసీఆర్ సార్ వచ్చిన తర్వాత ధరణిని తేవడంతో రైతులకు వారి భూములపై పూర్తి హక్కులు వచ్చాయి. రికార్డులు కూడా ఆన్లైన్లో ఉండడం వల్ల భూముల క్రమద్ధీకరణ ఆన్లైన్లోనే లభ్యమవుతుండడంతో ఇబ్బందుల్లేవు. ఎంతో ప్రయోజనకరంగా ఉన్న ధరణిని తీసివేస్తామని కాంగ్రెస్ నాయకులు చెప్పడం విడ్డూరంగా ఉంది. కాంగ్రెస్ నాయకులు ఎన్ని మాటలు చెప్పినా ఎవరూ నమ్మరు.
కాంగ్రెస్‌కు ఓటేస్తే మళ్లీ మునుపటి రోజుల కష్టాలు మొదలైతం.. సీఎం కేసీఆర్ రైతుల్లో ఆనందం నింపిండు.. సరిపోయే కరెంట్‌ను అదిస్తున్నది. ఈ పదేళ్లలో ఎక్కడ కూడా కరెంటు కోసం ఇబ్బందులు ఏర్పడలేదు. సాఫ్‌గా కరెంటు వస్తుంది. రాత్రి పగలు ఎప్పుడైనా పొలానికి నీళ్లు పెట్టొచ్చు. 24 గంటల కరెంటు ఇవ్వడం రైతుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ మంచి ఆలోచన చేసిండ్రు. మళ్లీ కేసీఆరే గెలుస్తడు.. ఎరువులు, విత్తనాలు అదునుకు దొరికినాయి. ఎలాంటి ఇబ్బంది లేదు. కాంగ్రెస్‌కు ఓటేస్తే.. మూడు గంటలతో చాలా ఇబ్బందులు ఎదురైతయ్. అసలు మూడు గంటల కరెంటు సరిపోదు. నేను బీఆర్ఎస్కే ఓటు వేస్తా.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావద్దంటున్నా.
వేలేరు: ధరణి లేకుంటే భూములపై అధికారులు, దళారులదే పెత్తనం సాగుతది. రైతులు తమ యాజమాన్య హక్కులు కోల్పోతరు. రైతులకు తమ భూమిపై ధరణితోనే భద్రత, భరోసా ఉన్నది. రైతులకు ఉన్న యాజయాన్య హక్కలకు తొలగించేందుకే కాంగ్రెస్ నాయకులు ధరణిని తొలగిస్తామని ప్రకటన చేస్తున్నరు. ధరణి లేకుంటే భూములపై అధికారులకే అధికారం ఉంటది. ధరణి రద్దుతో తెలంగాణలో కొత్త భూస్వామ్య వ్యవస్థ ఏర్పడి రైతులు తీవ్రంగా నష్టపోతరు. రైతులు, కౌలుదారులు మధ్య విభేదాలు వచ్చి భూ తగాదాలు పెరుగుతయ్. రైతులకు తెలియకుండానే వారి యాజమాన్య హ క్కులో మార్పులు, చేర్పులు జరుగుతయ్. అదే ధరణితో రైతులు తమ యాజమాన్య హక్కులో ఏమైనా మార్పులు, చేర్పులు చేయాలంటే తప్పనిసరిగా రైతు వచ్చి తన వేలిము ద్ర వేస్తేనే హక్కులో మార్పులు జరుగుతయ్. అందుకే తెలంగాణలో ధరణి ఉండాల్సిందే.
నర్సంపేట : సీఎం కేసీఆర్ వ్యవసాయానికి కరెంటు సమృద్ధిగా ఇస్తున్నారు. కాంగ్రెస్ నాయకులు చెప్పినట్టు మూడు గంటల కరెంటు సరిపోదు. కాంగ్రెస్ పాలన వస్తే అంధకారం తప్పదు. గతంలో కాంగ్రెస్ పాలనలో రైతులు అవస్థలు పడ్డారు. అప్పట్లో ఎన్నోసార్లు కరెంటు కోసం సబ్స్టేషన్లను ముట్టడించాం. వచ్చీరాని కరెంటుతో మోటర్లు కాలిపోయేవి. రిపేర్ చేయించడం వల్ల రైతులపై ఆర్థికభారం పడేది. నీరు అందక పంటలు ఎండిపోయేవి. రైతులు తీవ్రంగా నష్టపోయారు. కాంగ్రెస్ నాయకుల మాటలను నమ్మొద్దు. వ్యవసాయానికి 24గంటల కరెంటుతో ఎంతో మేలు జరుగుతున్నది. పంటలకు నీరు అందించేందుకు ఏ సమయంలోనైనా రైతులు మోటర్లు పెట్టుకుంటున్నారు. రైతులు ఆలోచించి రైతు ప్రభుత్వానికి అండగా నిలువాలి. కరెంటు మూడు గంటలు ఇస్తమన్న కాంగ్రెస్ పార్టీని బొందపెట్టాలి.
హసన్‌పర్తి : నేను 40ఏండ్ల నుంచి వ్యవసాయం చేస్తాన.. గతంలో నీళ్లు లేక పంటలు ఎండిపోయేది. కరెంటు ఎప్పుడు వస్తదో తెలువని పరిస్థితి ఉండేది. రాత్రి పూట కరెంటు పెట్టబోయి రైతులు కరెంటు షాకులతోటి, పాములు కుట్టి ఎందరో చనిపోయిండ్లు. విత్తనాలు, ఎరువులు దొరుకక లైన్ల నిలబడి ఎన్నో ఇబ్బందులు పడ్డం. కానీ తెలంగాణ వచ్చినంక ముఖ్యమంత్రి కేసీఆర్ ఉచితంగా 24గంటల కరెంటు ఇచ్చి, కాళేశ్వరం నుంచి నీళ్లను తెచ్చి చెరువులు నింపడంతో పంటలు బాగ పండుతానయ్. రైతుబంధుతో పెట్టుబడికి ఎకరాకు రూ.10వేలు ఇచ్చి ఆదుకున్నడు. రైతుబీమాతో బాధిత కుటుంబాలకు వారం రోజుల్లోపే రూ.5లక్షలు ఇచ్చి భరోసా ఇచ్చిండు. విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచి పంటలకు మద్దతు ధర ఇచ్చి ఆదుకున్నడు. కాంగ్రెస్ వస్తే 50 ఏండ్లు ఎనుకకు పోవాల్సిందే. రైతులకు మూడు గంటల కరెంటు ఇస్తరు. మళ్లా ఆత్మహత్యలే శరణ్యం. పంటలు ఎండి రాత్రివేళల్లో కరెంటు పెట్టబోయి ప్రమాదాలకు గురై ఇబ్బందులకు పడాల్సిందే. రైతులు కాంగ్రెస్ పార్టీని నమ్మరు. మళ్లా కేసీఆర్ గెలిస్తేనే రైతులు బాగుపడుతరు.
గీసుగొండ : అప్పటి కరెంటు కష్టాలు మళ్లీ రావద్దు. రాత్రి పూట బావుల కాడ పండుకునేటోళ్లం. కరెంటు ఎప్పుడు వస్తదో.. ఎప్పుడు పోతదో తెల్వదు. దీంతో అక్కడే కావలి కాసేటోళ్లం. రాత్రి పూట ఇచ్చే కరెంటుతో గ్రామంలో చాలా మంది రైతులు నీళ్లు పెట్టేందుకు పోయి కరెంటు షాక్‌తో, పాముల కాటుకు గురై చనిపోయారు. కరెంటు సరిగా రాక పంటలు ఎండిపోయేవి. తెలంగాణలో ఇప్పుడు 24 గంటల కరెంటు వస్తుండడంతో రైతులు అవసరం వచ్చినప్పుడల్లా నీళ్లు పారించుకుంటున్నరు. ఎవుసం సక్కగా ఉంది. రెండు పంటలు పండిస్తు రైతు రాజుగా జీవిస్తుండు. పుట్ల కొద్ది వడ్లు పండుతానయ్. మళ్లీ కాంగ్రెస్ వస్తే రైతులు బావుల కాడ పండుకోవాలె. ఆ కష్టం మళ్లీ మాకు వద్దు.
రాయపర్తి : రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఒచ్చిన కాన్నుంచి రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేవు. ఇరాం లేకుండా 24గంటలు కరెంట్ ఇస్తుండటంతో రైతులమంతా ఆడుకుంట పాడుకుంటా బంగారు పంటలు పండించుకుంటానం. పంటలకు నీళ్లు పారిచ్చేందుకు తెల్లందాంక బాయిలకాడికి.. బోర్ల కాడికి పోవుడు తప్పింది. కరెంట్ తిప్పలు లేకపోవడంతో రైతులమంతా ఉన్న కాడికి సేద్యం చేసుకుంటూ సుఖంగా ఉంటానం. 24 గంటల కరెంట్‌ను 3 గంటలకు తగ్గించినట్లయితే గొడ్డు, గోదాకు గడ్డి కూడా పెంచే పరిస్థితి ఉండదు. ఎన్నడో పోయిన కరెంట్ బాధలను మళ్ల తీసుకొస్తామంటున్న పార్టీలను రైతులు, రైతు కూలీలు, రైతు కుటుంబాలు ఆదరించవు, మళ్లా ఏ ప్రభుత్వం ఒచ్చినా 24 గంటల విద్యుత్ ఇయ్యాల్సిందే.
నర్సంపేట : మూడు గంటల కరెంటుతో ఎంతో నష్టం జరుగుతుంది. గతంలో కాంగ్రెస్ పాలనలో కరెంటు కష్టాలు అన్నీ ఇన్నీ కావు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కరెంటు సరఫరాను చక్కదిద్దిన చరిత్ర బీఆర్ఎస్ సర్కారు, సీఎం కేసీఆర్‌దే. తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ వస్తే కరెంటు ఉండదని అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. కానీ, దానికి విరుద్ధంగా తెలంగాణలో 24 గంటల పాటు నిరంతరాయంగా కరెంటు సరఫరా జరుగుతున్నది. సాగుకు ఉచితంగా కరెంటును అందిస్తున్నారు. గతంలో కాంగ్రెస్ పాలనలో కరెంటు కోతలు ఎక్కువగా ఉండేవి. కోతలతో విసుగెత్తి ఎన్నోసార్లు రైతులు అధికారులను నిర్బంధించిన దాఖలాలూ ఉన్నాయి. ఆ చరిత్రను ప్రజలు ఇప్పటికీ మరిచిపోలేదు. కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తే మూడు గంటలే కరెంటు ఇస్తే పంటలు ఎలా పండించాలి. లో వోల్టేజీ నుంచి కరెంటు మోటర్లను ఎలా కాపాడుకోవాలి.. పంటలు ఎండిపోకుండా ఎలా చూడాలి. ఇప్పుడు 24గంటల కరెం టుతో ప్రమాదాలు కూడా తగ్గిపోయాయి. గతంలో రాత్రుళ్లు ఎంతో మంది విష పురుగుల బారిన పడి, విద్యుత్ షాక్‌లతో రైతులు అసువులు బాసారు. కానీ, బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనతి కాలంలోనే 24గంటల పాటు నాణ్యమైన కరెంటును అందిస్తు న్నది. మళ్లా బీఆర్ఎస్నే గెలిపించుకుంటాం. రైతులు కాంగ్రెస్‌ను నమ్మరు. కరెంటుపై ఆ పార్టీ నాయకుల మాటలు అర్థరహితం.
నల్లబెల్లి : 10 హెచ్‌పీ మోటర్లు బిగిస్తే ట్రాన్స్‌కో పరిస్థితి అథోగతి పాలే. నల్లబెల్లి మండలంతో పాటు నర్సంపేట నియోజకవర్గంలో 100 కేవీ, 63 కేవీ, 25 కేవీ ట్రాన్స్ఫార్మర్ల సాయంతో రైతులు బావులు, బోర్ల వద్ద 3 హెచ్‌పీ, 5 హెచ్‌పీ మోటర్లు బిగించి పంటలకు నీరందిస్తున్నారు. 100 కేవీ ట్రాన్స్ఫార్మర్ కింద 3 హెచ్‌పీ మోటర్లు 30, 5 హెచ్‌పీ అయితే 18 మోటర్లు నడుస్తాయి. అదే కాంగ్రెస్ నాయకుల లెక్క ప్రకా రం 100 కేవీ ట్రాన్స్ఫార్మర్ కింద 10 హెచ్‌పీ మోటర్లు కేవలం 9 మాత్రమే నడుస్తాయి. అంటే మి గతా 3 హెచ్‌పీ మోటర్లు వాడే 19 మందికి సరిపడా విద్యుత్ ఇవ్వాలంటే మరో 150 కేవీ ట్రాన్స్ఫార్మర్ అదనంగా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అంటే ప్రభుత్వంపై పెద్దమొత్తంలో అదనపు భారం పడుతుంది. అంతేగాక 10 హెచ్‌పీ మో టర్లు ఒకేసారి ఆన్ చేస్తే గ్రిడ్ సబ్స్టేషన్లు దగ్ధమయ్యే ప్రమాదం ఉంది. అలాగే ఈ మోటర్ల వల్ల భూగర్భ జలాలు తగ్గుముఖం పడుతాయి. దురదృష్టవషాత్తు 10 హెచ్‌పీ మో టర్ కాలిపోతే వైండింగ్ చేయిం చేందుకు రైతుకు అధిక భారం అవుతుంది. అంతేగాక ప్రస్తుతం తెలంగాణలో రైతులు వ్యవసాయ బావుల వద్ద ఒక సర్వీస్ కు కేవలం రూ. 365 చార్జీ చెల్లిస్తున్నారు. అంటే నె లకు ఒక వ్యక్తి సెల్‌ఫోన్ బిల్లు కంటే తక్కువే చెల్లిస్తున్నారు. కాంగ్రెస్ నా యకులు 3 గంటల కరెంటు ఇస్తామంటున్నారు. ఈ కరెంటుతో ఒక్క దొయ్య కూడా పారదు. దీంతో రైతులకు మళ్లీ కరెంట్ కష్టాలు మొదలవడం ఖాయం. కేవలం అధికారం కోసమే కాంగ్రెస్ సాధ్యం కాని హామీలను ఇస్తూ ప్రజలను మోసం చే యాలని చూస్తున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన లోనే రైతులు నా లుగు రాళ్లు ఎనకేసుకుంటున్నారు. రైతుల నోట్లో మట్టి కొట్టేందుకే కాంగ్రెస్ కుట్ర పన్నుతుంది. ఈ ఎన్నికల్లో ప్రతి ఓటరు ఓటు ద్వారా కాంగ్రెస్‌కు గుణపాఠం నేర్పాలి. బీఆర్ఎస్కు అండగా నిలబడాలి.