నర్సంపేట, మార్చి 11: వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణం మాధన్నపేట రోడ్డులోని భూమికి సంబంధించి ఇరు వర్గాల మధ్య మంగళవారం ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా, సీఐ, ఎస్సైలకు స్వల్ప గాయాలయ్యాయి. వివరాలిలా ఉన్నాయి.. మాధన్న పేట రోడ్డు సర్వే నంబర్ 111/1/ 91, 111/1/92లో రామ అనసూర్యదేవి వద్ద 2019 జనవరిలో ఆరెకరాల భూమిని ఓడీసీఎంఎస్ చైర్మన్ గుగులోత్ రామస్వామి నాయక్, అతని స్నేహితులు ఎకరాకు రూ. 50 లక్షల చొప్పున కొనుగోలు చేసేందుకు అగ్రిమెంట్ చేసుకుని రూ.1.60 కోట్లు చెల్లించారు. ఆ తర్వాత భూమి కొలత వేయగా 3.30 ఎకరాలు మాత్రమే తేలగా, మిగిలిన నగదును రిజిస్ట్రేషన్ రోజు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారు. ప్రొహిబిటెడ్ లిస్టులో ఉన్న భూమిని 2022లో హైకోర్టులో రిట్ పిటిషన్ వేసి రామస్వామి ఉత్వర్వులు పొందారు. ఈ ప్రక్రియతో భూమి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి చా లా సమయం పట్టింది.
ఆ తర్వాత రామ అనసూర్యదేవి అనారోగ్యంతో మృతి చెందగా ఆమె వారసులైన రామచంద్రమోహన్‌తో పాటు కుటుంబ సభ్యులను అప్పట్లో సంప్రదిస్తే రిజిస్ట్రేషన్ చేసేందుకు వారు సహకరించలేదు. 2024లో నర్సంపేట పట్టణ కాంగ్రె స్ ముఖ్య నాయకులు ఓర్సు తిరుపతి, పెండెం రామానంద్, పంబి వంశీకృష్ణ సదరు భూమిని మరల కొనుగోలు చేశారు. అప్పటి నుంచి ఇరువర్గాల మధ్య తరచుగా గొడవలు జరుగుతున్నాయి. అంతేగాక కాంగ్రెస్ నాయకులు వెంచర్లో ప్లాట్లు చేసి అమ్మేందుకు యత్నించారు. గమనించిన రామస్వామి అతని కుటుంబ సభ్యులతో పాటు బంధువులు మంగళవారం వెంచర్ వద్దకు వచ్చి అందులోని షెడ్డును తొలగించేందుకు యత్నించారు.
ఈ క్రమం లో ఓర్సు తిరుపతి, పెండెం రామానంద్, పంబి వంశీకృష్ణతో పాటు వందలాది కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు రామస్వామి కుటుంబ సభ్యులు, బంధువులపై విరుచుకుపడ్డారు. దీంతో ఇరువర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. భూమి తమదే అంటూ గొడవకు దిగారు. పరస్పర దాడులతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నర్సంపేట ఏసీపీ కిరణ్‌కుమార్, టౌన్ సీఐ రమణమూర్తి, దుగ్గొండి సీఐ శ్రీనివాస్‌తో పాటు ఎస్సైలు, ఏఎస్సైలు, పోలీసు సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు.
ఈ దాడిలో ఖానాపురం మండలం మంగళవారిపేటకు చెందిన రామస్వామి బంధు వు భూక్యా బాలకృష్ణకు తల పగలగా, మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. ఆందోళనకారులను అదుపుచేసేందుకు యత్నించిన సీఐ రమణమూర్తి, ఎస్సై రవికుమార్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ఆ తర్వాత పోలీసులు ఇరువర్గాలపై లాఠీచార్జి చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఘటనా స్థలాన్ని వరంగల్ ఈస్ట్‌జోన్ డీసీపీ అంకిత్‌కుమార్, నర్సంపేట ఆర్డీవో ఉమారాణి పరిశీలించి సమస్యను కోర్టులో పరిష్కరించుకోవాలని బాధితులకు సూచించారు.