హనుమకొండ, ఆగస్టు 11: తెలంగాణ గ్రామ పంచాయతీ సిబ్బందికి వేతనాలు పెంచి, పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు జిల్లా గౌరవ అధ్యక్షులు బొట్ల చక్రపాణి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జీపీ కార్మికుల పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం సోమవారం హనుమకొండ ఆర్ట్ కళాశాల ఆడిటోరియం నుంచి కలెక్టరేట్ వరకు కార్మికులు ర్యాలీ నిర్వహించి ధర్నా చేసారు. ఈ సందర్భంగా చక్రపాణి మాట్లాడుతూ జిల్లాలో అనేకమంది కార్మికుల పేర్లు ఆన్లైన్లో నమోదు కాకపోవడంతో తక్కువ వేతనం ఇస్తూ తొలగిస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
వీరందరినీ యధావిధిగా ఆన్లైన్లో పేర్లు ఎక్కించి కార్మికులందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే మల్టీపర్పస్ విధానాన్ని రద్దుచేసి, క్యాటగిరీల వారీగా కొనసాగించాలని, కారోబార్, బిల్ కలెక్టర్లకు స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని అన్నారు. ఈఎస్ఐ, పీఎఫ్, ఉద్యోగ భద్రత, పర్మినెంట్, గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేసారు.
జిల్లాలో గ్రామ పంచాయతీలలో పనిచేస్తున్న కార్మికులకు బట్టలు ,చెప్పులు, సబ్బులు, నూనెలు, వర్షం కోట్లు ఇవ్వాలని, సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని లేనియెడల సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని చక్రపాణి హెచ్చరించారు. అనంతరం జాయింట్ కలెక్టర్ వెంకట్ రెడ్డికి డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేశారు. ఈ ధర్నాలో జిల్లా కార్యదర్శి పల్లె రామన్న, జిల్లా నాయకులు ఈసంపల్లి ఐలయ్య, మాట్ల భాస్కర్, భోగం రమేష్, గాదె కుమారస్వామి, ఏసుబ్, పరిక రాజు, సాంబయ్య రాజయ్య, ఎం శ్రీనివాస్ మల్లేశం, గిన్నారపు సుశీల, గీత, సునీత, రమ, శోభ, పూల, రూప తదితరులు పాల్గొన్నారు.