హనుమకొండ, సెప్టెంబర్ 28 : మున్సిపల్, ఇతర ప్రభు త్వ శాఖల్లో పనిచేస్తున్న కాం ట్రాక్ట్, అవుట్ సోర్సింగ్, నాన్ పర్మినెంట్ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని సీఐటీయూ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు టీ ఉప్పలయ్య డిమాండ్ చేశారు. శనివారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనం రూ. 26 వేలకు పెంచడంతో పాటు కార్మిక చట్టాలు అమలు చేయాలని డిమాండ్ చేసారు.
ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆటలాడుతున్నాయని విమర్శించారు. గత ఎన్నికల్లో కార్మికులు బీజేపీకి బుద్ధి చెప్పనప్పటికీ మార్పు రాలేదన్నారు. అనంతరం డీఆర్వో వైవీ గణేశ్‌కు వినతి పత్రం అందజేశారు. ధర్నాలో సీఐటీయూ మున్సిపల్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు బరుపట్ల మహేశ్, రాష్ట్ర కమిటీ సభ్యుడు యాస బాబు, మాతంగి నవనీత, కాజీపేట, హసన్‌పర్తి మండలాధ్యక్షులు, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.