ఖిలావరంగల్, మార్చి 19: ఆశాలకు ఫిక్సుడ్ వేతనం రూ.18 వేలు ప్రకటించే వరకు పోరాటాలు ఆగవని సీఐటీయూ(CITU)రాష్ట్ర కార్యదర్శి కాసు మాధవి అన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ బుధవారం వరంగల్ కలెక్టరేట్ ఎదుట తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్ డాక్టర్ సత్య శారదకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ మాతా శిశు మరణాలు తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తున్న ఆశాల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
శాసనసభ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఆశాలకు ఫిక్స్డ్ వేతనాలను అమలు చేయాలని, లేకుంటే విడుతల వారిగా ఆందోళనలను ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఏఎన్సీ టార్గెట్లను తీసివేసి అధికారుల వేధింపులను అరికట్టాలన్నారు. 2021 జూలై నుండి పెండింగ్లో ఉన్న పీఆర్సీ, లెప్రసీ, సర్వే, పల్స్ పోలియో డబ్బులు చెల్లించాలన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి డిమాండ్లను పరిష్కరించకపోతే పోరాటాలను ఉధృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు రాణి, సుజాత, వజ్ర, సునిత, రత్నకుమారి, మాధవి, పద్మ, మంజుల, రమ, సంధ్య, రమ, రజిత, రేణుక, అరుణ తదితరులు పాల్గొన్నారు.